‘పెట్రో’కట్టడికి ప్రత్యామ్నాయం ఇదేనా?

PETROL PRICE
PETROL PRICE

‘పెట్రో’కట్టడికి ప్రత్యామ్నాయం ఇదేనా?

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో డీజిల్‌ధరల తగ్గింపుకోసం ప్రధాని నరేంద్రమోడీ చమురు ఉత్పత్తి కంపెనీలు, రిటైల్‌ కంపెనీల అధిపతులతో నిర్వహించిన సమా వేశం ఆశించిన ఫలితాలు ఇచ్చిందా? చమురుధరలు తగ్గించేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయా? రూపాయి క్షీణతకు కారణం ముడిచమురుధరలు పెరు గుదలే కారణమా? ఇవన్నీ ఇపుడు ప్రజలకు అవసరమైన విషయాలు కావు. కేవలం రిటైల్‌ధరలు తగ్గించడమే ముందున్న తక్షణ కర్తవ్యం. పెట్రోడీజిల్‌ ఉత్పత్తుల్లో లీటరుకు 50శాతానికిపైగా సుంకాలే వినియోగదారుల నెత్తినరుద్దుతుంటే ఇపుడు ఉత్పత్తి కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పడంలో అర్థం ఏమిటన్న వాదన తెరపైకి వస్తోంది. చమురు ఉత్పత్తికంపెనీలతో సమావేశం నిర్వ హించిన ప్రధానిమోడీ దేశీయంగా ఉన్న చమురు బావుల ఉత్పత్తికి తమ వద్ద ఉన్న మిగులు పెట్టుబడులు పెట్టా లని కోరడం మంచి పరిణామమే. అదే జరిగితే విదేశాల నుంచి తెచ్చుకుంటునన చమురుదిగుమతుల్లో కొంత మేరకైనా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. చమురు ఉత్పత్తిలో ఇప్పటికీ స్వయం సమృద్ధిని సాధించని భారత్‌ దేశీయ చమురు అవసరాలకోసం విదేశాలపైనే ఆధార పడుతోంది. పైగా 80శాతం దేశీయ అవసరాలన్నీ దిగు మతులపైనే ఆధారపడి నడుస్తున్నాయి.

వీటన్నింటికి లింక్‌ అయి డాలర్‌ రూపాయికరెన్సీ మారకం విలువలు ముడిపడి ఉన్నాయి. ముడిచమురుధరలు పెరిగినపుడల్లా డాలర్‌ చెల్లింపులు మరింతగా అవసరం అవుతున్నాయి. వీటితో డాలర్‌కు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 74 రూపాయలను అధిగమించిన డాలర్‌ కరెన్సీని కట్టడి చేసేందుకు రిజర్వుబ్యాంకుచేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఆశించిన ఫలితాలివ్వలేదు. సరికదా మరింతపెరుగుతూ వచ్చింది. ఇక ఇపుడు పెట్రోడీజిల్‌ రిటైల్‌ధరలను కట్టడి చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.

ఇందుకు ఏమేంచర్యలు తీసుకోవాలన్నది కేంద్రమే ముం దుగా చొరవచూపించాల్సిన తరుణం ఇది. కొంతలో కొం తగా సుంకం తగ్గింపులో లీటరుకు 1.50 తగ్గించిన కేంద్రంమరో రూపాయిని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భరించాలని స్పష్టంచేసింది. మొత్తంగాచూస్తే 2.50 రూపాయలు కేంద్ర పరంగా ఒనగూరుతుంటే మరో 2.50 రూపాయలు రాష్ట్రాలేభరించాలని స్పష్టంచేసింది. కేంద్రంకంటే రాష్ట్రాలే ముందుగా తమతమ స్థానిక పన్ను లను తగ్గిస్తూ వచ్చాయి. వీటిలో బిజెపి ప్రభుత్వాలతో పాటు బిజెపియేతర ప్రభుత్వాలుసైతం పెట్రోడీజిల్‌ ధర లకు కళ్లెంవేసేందుకుగాను స్థానిక పన్నులను వ్యాట్‌ తగ్గించాయి. రూపాయినుంచి 2.50 వరకూ తగ్గిస్తున్నట్లు వివిధ రాష్ట్రాలుప్రకటించాయి. మంచి పరిణామమే అయినా లీటరు పెట్రోలు ముంబయిలో 88 రూపాయ లకు పైబడింది. నాలుగుమెట్రోనగరాల్లోను 80 రూపా యలకు దిగివచ్చిన సందర్భాలులేవు. పైగా ఈ చమురు ధరలపై సుంకాలు తగ్గిస్తామని చెప్పినపుడల్లా ఆయిల్‌ మార్కెటింగ్‌కంపెనీల షేర్ల ధరల్లో సైతం ఎక్కువ మార్పు లు వస్తున్నాయి.

తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నా యి. వాణిజ్య ఉత్పత్తులకోసం జరిపే అన్వేషణల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని సాధించినతర్వాత ఆ ప్రభావం రిటైల్‌ధరలపై చూపించేసరికి వినియోగదా రుని నెత్తినమరింత భారం పడుతుంది. ముందుగా సుం కాలను మరింతగా తగ్గించాలి. అలాగేప్రభుత్వరంగంలోని కంపెనీలు కొంతవరకైనా సేవాభావం ప్రకటించాలి. వాణి జ్య ధోరణులతోనే ముందుకువెళితే వినియోగదారునిపైనే చివరకు భారం పడుతుందన్నది నిర్వివాదాంశం. రవాణా ఖర్చులు, ఇంధన దిగుమతి ఖర్చులు, బ్యారెల్‌ ముడి చమురుశుద్ధి ఖర్చులు మొత్తంగా చూస్తే అన్నింటినీ కల గలిపి పన్నులతోపాటుగానే వినియోగదారుని నెత్తిన రుద్దుతున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఇంధన రిటైల్‌ధరలుఎక్కువ అని ఇప్పటికే ఆర్థికరంగనిపు ణులు చెపుతుంటారు.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలను వదిలి ఉత్పత్తి కంపెనీల అధిపతులు, రిటైల్‌ సంస్థల ప్రతినిధులతో చర్చలుజరిపితే ఎంతమాత్రం ప్రయోజనం ఉండదన్న వినియోగరంగ నిపుణుల వాదనలను ఎన్నిక లకు వస్తున్న కేంద్రం ముందు పరిగణనలోనికి తీసుకోవా లి. కొంతలోకొంత డాలర్‌ చెల్లింపులకు ప్రత్యామ్నాయం గా స్థానిక కరెన్సీలో చెల్లింపులు జరిపితే రూపాయి క్షీణ తను కట్టడిచేయగలమా అన్నది కూడా ప్రస్తుతం పరి గణనలోనికి తీసుకోవాలి. డాలర్‌ డిమాండ్‌ పెరగడానికి ప్రధాన కారణం చమురు దిగుమతులే. ప్రపంచంలో చైనా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా చమురు దిగుమతిచేసుకుంటున్నది. దేశీయంగా స్వయం సమృద్ధి సాధించకపోవడంతో దేశీయ అవసరాలన్నీ ఇంచు మించుగా దిగుమతిచేసుకుంటున్న చమురు ఉత్పత్తులే తీరుస్తున్నాయి. భారత్‌పరంగా దిగుమతులుచూస్తే సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇరాక్‌ ముడి చమురుదిగుమతులు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు గానే ఇటీవలి కాలంలో ఇరాన్‌నుంచికూడా 25 మిలియన్‌ టన్నులు దిగుమతిచేసుకోవాలనినిర్ణయించినా అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇపుడు ఇరాక్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. చమురు కంపెనీలతో జరిపిన సంప్రదింపులు అసలు ధరలు కట్టడిచేయడానికా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దిగుమతుల సంగతెలా ఉన్నా ముందు దేశీయంగా ధరలను కట్టడిచేయకుంటే రానున్న ఎన్నికల్లో పాలకులకు చేదు అనుభవమే మిలుగుతుందని నిష్కర్షగా చెప్పవచ్చు.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌