నలుగుతున్న ప్రయాణికులు!

Passengers
Passengers

లక్షలాది కార్మికుల శ్రమ, ప్రజల ఆదరాభిమానాలు, దూరదృష్టి కలిగిన కొందరు అధికారులు, నేతలు చేపట్టిన చర్యలు మరికొందరి త్యాగనిరతితో అంచలంచెలుగా ఎదిగిన రోడ్డురవాణా సంస్థ నేడు నష్టాల ఊబిలో, సమ్మెల బాటలో కొట్టుమిట్టాడుతున్నది. రవాణారంగం లోనే అద్వితీయ ప్రతిభను, అసమాన సేవానిరతిని కనబరిచి గిన్నీస్‌బుక్‌లో రికార్డు సంపాదించిన మన ఆర్టీసీ కనుమరుగైపోతున్నదేమోనన్న ఆవేదన కలుగుతున్నది. స్వార్థం, స్వలాభాపేక్ష, రాజకీయ నిర్ణయాలు ఫలితంగా నేడు ఆర్టీసీ పరిస్థితి తెలంగాణాలో ఆందోళనకరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విలీనంతో తాత్కా లికంగా సమస్య నుండి బయటపడినా భవిష్యత్తులో ఆర్థికనష్టాలను ఎలా పూడ్చుతారో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ ప్రారంభించిన సమ్మె మూడో రోజుకు చేరుకున్నది.

అటు ప్రభుత్వం కానీ, ఇటు కార్మికులు కానీ ఎవరికి వారు పట్టుదలలతో ఉండటంతో సమస్య జటిలంగా మారిపోతున్నది. ప్రభుత్వం ప్రయాణికులకు ఇబ్బందికలగకుండా ఉండేందుకు శాయశక్తుల కృషి చేస్తూనే ఉంది. అద్దె బస్సులను పెంచుతున్నారు. స్కూలు బస్సులను కూడా ప్రయాణికుల కోసం తిప్పుతున్నారు. అయినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఆర్టీసీ వేలాది కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోతుంటే ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేట్‌ బస్సుల పరిస్థితి మూడు పర్మిట్‌లు, ఆరు ట్రిప్పులుగా విరాజిల్లు తున్నది. ఆర్టీసీకి సుదీర్ఘచరిత్ర ఉంది. తెలంగాణకు సంబంధించి 1936లో నిజాం రైల్వేలో రోడ్డురవాణా ఒక శాఖగా ఉండేది.

1950 నిజాం రైల్వే భారత రైల్వేలో విలీనం కావడంతో 1951 అక్టోబరు 31వ తేదీన ఏజెన్సీ పద్ధతిలో రోడ్డురవాణా ప్రత్యేక శాఖ ఏర్పడింది. 1958 జనవరి 11న 16డిపోలు, 609 బస్సులు,5081 మంది కార్మికులతో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డురవాణా సంస్థగా అవతరిం చింది. అప్పటి నుంచి ప్రజాభిమానం చూరగొంటూ అంచెలంచెలుగా ఎదిగిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 11 రీజియన్లు, 24 డివిజన్ల పరిధిలో మొత్తం 97 డిపోలకు విస్తరించింది.ఇక మొత్తం 10వేల నాలుగువందల అరవై బస్సులు, మూడువేల ఆరువందల తొంభైరెండు రూట్‌లలో దాదాపు 97 లక్షల మందికిపైగా ప్రయాణికులను గమ్యాలకు చేరవేస్తున్నా యి.

మొత్తం రాష్ట్రంలోని 97 డిపోల్లో 11 డిపోలే లాభాలు నడుస్తుండగా మిగిలన్నీ నష్టాల్లో నడుస్తున్నట్లు అధికారవర్గాలు వివరిస్తున్నాయి. ఒక వ్యూహం ప్రకారం ఆర్టీసీని నష్టాల ఊబిలో నెట్టేందుకు ఏనాటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ 2001లో 24 రోజుల పాటు కార్మికులు సమ్మె చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి కార్మికుల సమ్మెను సమర్థించడమేకాక కేవలం ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టాల పాలైందని తేల్చిచెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఆర్టీసీ పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. వివిధవర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల ద్వారా ఆర్టీసీపై కోట్లాది రూపాయల భారం మోపుతున్నా, డీజిల్‌ విషయంలో కానీ, టోల్‌టాక్స్‌ విషయంలో కానీ ఎలాంటి సబ్సిడీలు, మినహాయింపులు ఇవ్వకపోవడం ఆర్టీసీకి మోయలేని భారంగా పరిణమిస్తున్నది.

అంతేకాదు మరోపక్క పెరుగుతున్న డీజిల్‌, టైర్లు, ట్యూబ్‌లు, విడిభాగాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల ఛార్జీలను పెంచడం అనివార్యమవ్ఞతుంది. ఫలితంగా ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. ఆటోలు, జీపులు, సెవన్‌సీటర్లు, డిసిఎంలు, మెటడోర్లు, కార్లు విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. గతంలో వేల సంఖ్యలోఉన్న ఈ ప్రైవేట్‌ వాహనాలు ఇప్పుడు లక్షల సంఖ్యల్లోకి చేరు కున్నాయి. ఇందువల్ల ఆర్టీసీలో ఆక్యుపెన్సీశాతం పడిపో తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాటపట్టారు.

వారి డిమాండ్లను అంగీకరించే పరిస్థితిలో ప్రభుత్వం లేదనే తెలుస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావ్ఞ ప్రధానంగా విలీనం ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. కార్మికులు కూడా సమ్మె విర మించేదిలేదని, మరింత ఉధృతం చేస్తామనిప్రకటించారు. రాజకీయ పార్టీల మద్దతు కూడగడు తున్నారు. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతున్నది.

రోజుకు కోటి మంది వరకు సేవలు అందిస్తూ లక్షలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాధారంగా ఉన్న ఆర్టీసీని ఇలాంటి పరిస్థితిల్లోకి నెట్టివేయడం క్షంతవ్యంకాదు. అలాగే కార్మికులు కూడా విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఇన్నాళ్లు, ఇన్నేళ్లు తామంత అహోరాత్రులు కష్టపడి నిర్మించుకున్న ఈ సౌధాన్ని కూలదోయడం సమంజసంకాదు. మునిగిపోతున్న ఆర్టీసీని అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు కలిసికట్టుగా ఆదుకోవాలి. దసరా పండగకు స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుకునేందుకు ఎన్నో రోజుల ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న ప్రజలకు చివరి నిమిషంలో సమ్మె సైరన్‌ మోగించడం ఎంతవరకు సమంజసమో కార్మికులు విజ్ఞతతో ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఆ కార్మికులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలనే విషయం విస్మరించకుండా ఒక మెట్టుదిగాలి. రెండు పక్షాలు పట్టుదలకుపోతే ‘కోడెల కొట్లాటల్లో నలిగిపోయే దూడల్లా సామాన్య ప్రజలు ఇక్కట్లకు గురికాకతప్పదు. అప్పుడు ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకం అవ్ఞతుంది.

తాజా మొగ్గ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/