హిందీ అంటే ముద్దు, జాతీయ భాషగా ఎందుకు వద్దు?

Hindi Language

రాలా మంది హిందీ భాషని ఇష్టపడతారు. హిందీ సినిమాలు చూస్తారు, హిందీపాటలు వింటారు. మరి హిందీనెందుకు జాతీయ భాషగా అంగీకరించరు. ఈ సందేహం చాలా మందిని వదలడం లేదు. వద్దన్న వాదనకి సూత్రప్రాయంగా అవ్ఞనన్నా, సంపూర్ణంగా నిస్సందేహంగా మద్దతు పలకడం లేదు. ఒకే దేశం ఒకేభాష అన్నది ఒక అవసరం లేని ఆలోచన. ఎవరి భాషలు వారికి ఉన్నప్పుడు వాటితో బాగానే ఉన్నప్పుడు ఒకే భాష అని వేళ్లాడడం దేనికి? కేవలం భాష కారణంగా భార్యభర్తలను కలిపి ఉంచలేం. దేశప్రజల్ని కట్టి ఉంచగలమా? కలిసి ఉన్నారంటే భావల వల్ల, పెళ్లి అన్న రాజ్యాంగం వల్ల. అలాగే దేశం కలిసి ఉన్నది మనమంతా భారతీయులం, అన్నదమ్ములం అన్న భావం వల్ల. లేదా రాజ్యాంగం వల్ల. ఒకే భాషతో ఏకరూపత సాధిస్తే మంచిదే కదా అనొచ్చు.ఏకరూపత కన్నా ఐక్యత గొప్పది కదా. అయినా అన్నింట్లో ఏకరూపత బలవంతంగా తీసుకురావడం అవసరమా? ఒకే సైజులో కత్తిరిస్తే క్రోటన్‌ మొక్కలు బాగానే కనబడతాయి.

అవి ప్రదర్శనకి తప్ప మరి దేనికీ పనికిరావ్ఞ. అదే పని పండ్ల మొక్కలకు చేస్తామా? చేస్తే నష్టం తప్ప లాభం ఉంటుందా? మరి మాతృభాషని పట్టుకు వేళ్లాడితే ఏం ప్రయోజనం అని అడగొచ్చు. మాతృభాష అంటే అమ్మభాష. ఊహతెలిసినప్పటి నుంచి అమ్మానాన్న, ఇరుగుపొరుగు అలవాటు చేసిన భాష. సహజంగా అబ్బిన భాష. కాబట్టి ఆ భాషలో బాగా భావప్రకటన చేయగలం. బాగా నేర్చుకోగలం. జీవితపు ముఖ్యదశలో అమ్మభాషలో విద్య ఉంటే అదనపు శ్రమ లేకుండా జ్ఞానార్జన హాయిగా సాగుతుంది. పునాది బలం గా ఉంటుంది.

పైగా మనదైన వాడుక భాష ముందుతరాల వరకు మనగలుగుతుంది. సంస్కృతి సజీవంగా సాగుతుంది. అదే పరాయి భాష అయితే భావంతో పాటు భాషాజ్ఞానం నేర్చుకోవాల్సిరావడం కొంచెం ఎక్కువ శ్రమ. మరి ఆంగ్లాన్ని ఎందుకు నెత్తిన బెట్టుకోవడం అని అడగొచ్చు. అమ్మభాష కాని ప్రతిదీ పరాయి భాషే. గిరిజనులకు (కొన్ని తెగలకు) తెలుగు పరాయి భాష. తెలుగు వాళ్లకు అరవం అయినా ఆంగ్లం అయినా పరాయి భాషలే. అవి నేర్చుకోవడానికి కష్టం ఒక్కటే.

కష్టం ఒక్కటే అయినప్పుడు లాభం దేనికి ఎక్కువో చూడాలి. అమెరికా తరువాత ఎక్కువ ఆంగ్లం మాట్లాడే దేశం మనదే. పైగా ఆ భాష ప్రపంచభాష.సాంకేతిక జ్ఞానం,సకల విజ్ఞానం, సకల అజ్ఞానం అందులోనే ఉంది. విదేశీ ఉద్యోగాలు సాధించ డంలో భారతీయులు మిగతా దేశాల కన్నా ముందున్నారంటే ముఖ్యకారణం ఆంగ్లం బాగా తెలిసి ఉండటమే. ఆ విషయం తెలిసీ చైనా గతంలో ఫ్రెంచ్‌ పాలనలో ఉన్న కొన్ని దేశాలు ఇంగ్లీషు బాటపట్టాయి. హిందీతో ఆ సౌలభ్యం ఉండదు కదా.రామాయణం అంతా విని రామునికి సీత ఏమవ్ఞతుంది అని అడిగినట్టు హిందీని జాతీయ భాష చేస్తే ఏం నష్టం అని అడగొచ్చు.

కారణాల్లో మొదటిది ఆ అవసరం లేదు. ఎవరి భాషలు వారికున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటే గొప్పదేశం మనది. మనందరినీ భాషాపరంగా కలిపి ఉంచడానికి ప్రపంచ భాష ఇంగ్లీష్‌ ఉంది. రెండో కారణం జరిగే నష్టం. హిందీని బలవంతంగా మనకి తప్పనిసరి చేయడం వల్ల అటు సొంత వాడుక భాష వాడకం తగ్గి ప్రాధాన్యత కోల్పోతుంది. ఇటు ప్రపంచాన్ని జయించగల అవకాశం ఉన్న ఇంగ్లీష్‌ ఎంతో కొంత దూరమై ఇప్పటి ప్రాభవం కోల్పోతాం. పైగా ఇది సువిశాల భారతదేశంలో రెండుసార్లు విఫలమైన ప్రయోగం. మళ్లీ అవసరమా! కాబట్టి ఎప్పటిలాగే త్రిభాషా సూత్రం పాటించడమే మంచిది. హిందీని ఎటూ ద్వితీయభాషగా నేర్చుకుంట్నూం. ఏమాత్రం ద్వేషించడం లేదు. ఒకేదేశం, ఒకే భాష లాంటి విఫల వివాదభరిత యత్నాలెందుకు? విభిన్నతని గౌరవిస్తూ ఒకే దేశం ఒకే ఆత్మగా ఉండటానికి ప్రయత్నిద్దాం.

  • డా.డి.వి.జి.శంకరరావు

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/