భ్రూణహత్యలు ఆగేదెప్పుడు?

చట్టాలను కఠినంగా అమలు చేయాలి

Scanning-

కాసులకు కక్కుర్తిపడి భ్రూణహత్యలు చేస్తున్నారు. కఠిన చట్టాలను సైతం స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.

పుట్టే శిశువ్ఞ ఆడపిల్ల అని తెలిసి గర్భం లోనే అంతమొందించే రాక్షస ప్రయత్నాలు రాష్ట్రంలో యధేచ్ఛ గా సాగుతున్నాయి.

గర్భస్థ శిశువ్ఞకు స్కానింగ్‌ పరీక్షలు జరిపి ఆడపిల్ల అని తేలితే డబ్బులు దండుకొని కడుపులోనే కర్కషంగా నులిపేస్తున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కళ్లుమూసుకోవ డంతో స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కోట్ల రూపాయల వ్యాపారం లింగ నిర్ధారణపరీక్షల ద్వారా జరుగుతుంది. గర్భస్థ లింగ నిర్ధారణ కేంద్రంలో ఎన్ని పరికరాలు ఉంటే అన్నింటికి అనుమతి పొందాలి.

రేడియాలజిస్టు, సోనాలజిస్టు, గైనకాల జిస్టు, ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ శిక్షణ పొందిన వారికే అనుమతి ఇవ్వాలి.

జిల్లాస్థాయిలో జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి ఈ దందాకు ముగింపు పలకాలి. ప్రతి లింగనిర్ధారణ పరీక్ష సమాచారాన్ని అధికారికంగా ఒక పుస్తకంలో నమోదు చేయాలి.

జిల్లాకలెక్టరు ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి లింగ నిర్ధారణ అవగాహన సదస్సులను విరివిగా నిర్వహించాలి.

కానీ ప్రస్తుతం ఇవేవి తెలంగాణరాష్ట్రంలో పకడ్బందీగా సాగడంలేదు. చాలా జిల్లాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండానే లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. లింగ నిర్ధా రణ పరీక్ష సమాచారాన్ని అరకొరగా నిర్వహిస్తున్నారు.

వైద్యా ధికారులు తనిఖీలు చేయడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో శిక్షణ అనుభవంలేని వారిచేత పరీక్షలు చేయిస్తూ కాసులు దండుకుంటున్నారు.

డయాగ్నాస్టిక్‌ సెంటర్లలో ఒక పరికరానికి అనుమతి పొంది ఎక్కువ పరికరాలు వాడుతూ తమ వ్యాపారాన్ని యధేచ్ఛగా సాగిస్తున్నారు.

కనీస కఠిన చట్టా లను సైతం బేఖాతరు చేస్తూ ముందస్తు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో అవివాహి తుల, విద్యార్థినులు, అనుకోని పరిస్థితుల్లో గర్భం దాల్చితే స్కానింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు పెద్దఎత్తున డబ్బులకు డిమాండ్‌ చేసి అబార్షన్‌లు చేస్తున్నారు.

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణాల్లోనే భ్రూణహత్యలు పెరుగుతున్నా యి. గ్రామాల్లో గర్భిణీల సమాచారం వారి కదలికలు చుట్టుపక్కల వారికి ఇరుగుపొరుగు వారికి తెలుస్తాయి.

కనుక గ్రామాల్లో ఈ తతంగం తక్కువగా సాగుతుంది. పట్టణాల్లో విద్యాధికులు మధ్యవర్తుల ద్వారా ఆర్‌.యం.పి వైద్యుల ద్వారా స్కానింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

గ్రామస్థాయిలో ఆరోగ్య సిబ్బంది చోటామోటా వైద్యులు స్కానింగ్‌ సెంటర్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి ఈ లింగనిర్ధారణ పరీక్షలకు ఉసిగొల్పుతున్నారు.

గ్రామాల్లో చోటామోటా వైద్యుల మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో వైద్యపరీక్షలకు తీసుకెళ్లి పుట్టబోయే బిడ్డ లింగనిర్ధారణ పరీక్ష చేయిస్తున్నారు.

స్కానింగ్‌లో కనుక ఆడపిల్ల అని తేలితే సంబంధిత మహిళ, అత్త, మామ, భర్తలను బురిడి కొట్టించి 10 నుండి 20వేలు వసూలు చేసుకొని యమధర్మరాజు వలె లింగనిర్ధారణ కేంద్రాలకు వెళ్తున్నారు.

గర్భస్థ శిశువ్ఞల్లో అవయవలోపాలను గుర్తించడానికి పెట్‌స్కాన్‌ సెంటర్లు పనిచేయిస్తున్నాయి.

గర్భంలో ఎలాంటి లోపాలు లేకున్నా లోపాలు ఉన్నాయంటూ పెట్‌స్కాన్‌ పరీక్ష చేయాలంటూ భయపెట్టి 20 నుండి 30వేల వరకు వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అవసరం లేకున్నా పెట్‌స్కాన్ల దందా అడ్డగోలుగా సాగుతుంది.

స్కానింగ్‌ పూర్తయితే 50 శాతం కమిషన్‌(సి.సి) వైద్యులకు, చోటామోటా ఆరోగ్య సిబ్బందికి అకౌంటులో జమ అవ్ఞతుంది.

ప్రభుత్వం 1994లో భ్రూణహత్యలను నిరోధించడానికి రూపొందించిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు కావడం లేదు.

రేడియాలజిస్టు, యం.డి., డి.ఎన్‌.బి చదివిన వారు మాత్రమే గర్భస్థ పిండ పరీక్షలు చేయాలి.

కానీ అనుభవం లేని అవగాహన లేని గైనకాలజిస్టులు సైతం తమ నర్సింగ్‌ కేంద్రాల్లో స్కానింగ్‌ సెంటర్లను అడ్డగోలుగా నడుపుతున్నారు.

ఇలా చేయరాదని 14 ఫిబ్రవరి 2013లో ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.

ఈ చట్టం ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారణను బహిర్గతం చేయడం లేదా గర్భం ధరించిన వారిలో పిండ దశలోనే హత్యచేసిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, పదివేల జరిమానా విధిస్తారు.

కాని చట్టం ఎంత గట్టిగా ఉన్నా సరైన పర్యవేక్షణ లేనందువల్ల ఈ వ్యవహారం సాగుతుంది. ఇప్పటికైనా భ్రూణహత్యలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది.

  • రావుల లావణ్య

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/