గ్రామ వలంటీర్ల వ్యవస్థ విజయవంతమయ్యేనా?

Volunteers (File)
Volunteers (File)

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వలంటీర్లను నియమిస్తా మని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇచ్చిన మాటను నిలుపుకుంటూ ఎపిలో రెండు లక్షల గ్రామవలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి, అన్నిరకాల ప్రభుత్వ సేవలను అక్కడి నుంచి ఈ వలంటీర్ల ద్వారా అందిస్తామంటున్నారు. ఎపిలోని 13వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీకి ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు, పురపాలికల్లో వార్డుకు ఒకరు చొప్పున వలంటీర్ల నియామకంపై కసరత్తు పూర్తయింది. రెండు లక్షల మంది వలంటీర్లు అవసరమని తేల్చారు. గ్రామాల్లో ప్రతి యాభై కుటుంబాలకు ఒక వలంటీర్‌ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల మంది అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా, మండలాల వారీగా కుటుంబ వివరాలు సేకరించి ఎంత మంది వలంటీర్లు అవసరమవ్ఞతారో అంచనాకు వచ్చారు. పట్టణ ప్రాంతాల్లోను దాదాపు 60వేల మంది వలంటీర్లు అవసరమ వ్ఞతారని గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గ్రామాలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వలంటీర్లు కీలకంగా మారనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి వలంటీర్ల వ్యవస్థ అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు అంచనా. మండలాన్ని యూనిట్‌గా తీసుకుని కుల రిజర్వేషన్లతోపాటు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన విధంగా నాలుగు లక్షల వలంటీర్లు కాకుండా రెండు లక్షల మందిని నియమించడం ద్వారా కోటి కుటుంబాలకు సేవలందించాలని ప్రభుత్వం భావిస్తోంది. జులైలో నియామకాలు పూర్తి చేసి, వలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15కల్లా వారు విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గ్రామవలంటీర్ల ఎంపికను మండల ఎంపిక కమిటీ చేపట్టనుంది. ఎంపిడివో ఛైర్మన్‌గా, తహసీల్దార్‌, ఈవోపిఆర్‌ అండ్‌ ఆర్డీలతో కూడిన మండలస్థాయి కమిటీ వలంటీర్లను ఎంపిక చేయనుంది. కుల, దివ్యాంగులు, మహిళా రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయనుంది. 18 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల లోపు యువతను నియమిస్తుంది. వయోపరిమితిలో ఎస్సీ,ఎస్టీ బిసిలకు సడలింపు ఉంటుంది. ఆయా పంచాయతీల్లో నియమించిన గ్రామవలంటీర్లు ఆ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో విధులు నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారికిచ్చే రూ.5వేల గౌరవవేతనం కూడా కార్యదర్శుల ద్వారా అందిస్తారు. మండలవ్యాప్తంగా ఈ వ్యవస్థను ఎంపిడివోలు నియంత్రిస్తారు. రేషన్‌ సరఫరా, పెన్షన్ల పంపిణీతోపాటు వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం వచ్చే విజ్ఞాపన పత్రాలను గ్రామవలంటీర్లు తమ పైఅధికారులకు చేరవేస్తారు. వలంటీర్లు ఏం చేస్తారు? ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉంటారు. వీరు ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటికి చేర్చుతారు. ఇప్పటి వరకు రేషన్‌ కార్డుదారులు రేషన్‌ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకువచ్చేవారు. ఇక నుండి గ్రామవలంటీర్లు వాటిని లబ్ధిదారులకు చేరవేస్తారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి బియ్యం, నిత్యావసర వస్తువ్ఞలు చేరవేస్తారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి డోర్‌ డెలివరీ చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి పౌర సరఫరాల శాఖ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. నాణ్య మైన సన్నబియ్యాన్ని సేకరించి ఐదు కిలోలు, 10 కిలోలు, 15 కిలోల చొప్పున బ్యాగుల్లో ప్యాక్‌ చేయించి సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగుల ఎంపిక పూర్తి చేశాక అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రజలకు అందుబాటులో రానున్నాయి. గ్రామాల్లో ఏ చిన్నపని కావాలన్నా స్థానిక నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, సొంత పనులు మానుకొని వాటి కోసం పంచాయతీ, మండల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించకపోవడంతో ఎంతో కొంత ముట్టచెప్పి పనులు చేయించుకునే దుస్థితి ఉందని వాపోతు న్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకం అందించే గృహాల నిర్మాణం లో కూడా అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని, అవి ఇచ్చిన వారికే నిధులు మంజూరు అవ్ఞతున్నాయని గ్రామంలో ఏ పనులు జరగాలన్నా అధికారులకు కమిషన్లు ముట్టచెప్పా లని లేనిపక్షంలో పనులు జరగవని, నిధులు మంజూరు కావని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ప్రభుత్వసేవలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందాలనే కృతనిశ్చయంతో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారపక్ష నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ సచివా లయం, గ్రామ వలంటీర్లు అక్రమ వసూళ్లకు వీల్లేని విధంగా పటిష్టమైన పద్ధతులు అమలు చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దేశంలో పంచాయతీల నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ విధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంగా, సౌకర్యవంతంగా ఉండాలని, లేని పక్షంలో ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్రామవలంటీర్ల వ్యవస్థ ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి సహాయకారిగా ఉండాలి. గ్రామవాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి. ఎటువంటి అవినీతికి తావ్ఞలేకుండా నడపగలగాలి. ఇప్పటికే గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అవినీతికి పాల్ప డిందనే అపవాదు మూటగట్టుకుంది. కాబట్టి గ్రామవలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి. వారి పనితీరు ఎప్పటిక ప్పుడు ప్రజలందరూ తెలుసుకోగలగాలి. అప్పుడే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ విజయవంతమవ్ఞతుంది.

  • వాసిలి సురేష్‌