ఆదివాసీలకు న్యాయం జరిగేదెప్పుడు?

Tribals
Tribals


అరవైఏడు మంది గిరిజనులు అడవ్ఞల నుండి హైదరాబాద్‌ వచ్చారు. ఇందులో చెప్పుకునేదేముంది. గిరిజనులు హైదరాబాద్‌ చూడటానికి రావడం సాధారణ విషయమే కదా అనుకోవచ్చు. వీరిని ప్రభుత్వ లాంఛనాలతో, పోలీసుల సంరక్షణలో తీసుకొచ్చారు. తమాషాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా హైకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఆదివాసీలు, గిరిజనులు అడవ్ఞలను ఖాళీ చేయాలని ఆదేశించింది. దానికి సంబంధించిన వాదనలు సుప్రీంకోర్టులో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ హైకోర్టు గిరిజనులను ఖాళీ చేయించిన పక్షంలో వారందరికీ ఆరు నెలల్లో భూమి, ఏడాదిలో ఇళ్లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక్కోసారంతే కిందికోర్టులు మంచి పేరుతో తీర్పులు ఇస్తుంటాయి. రాజ్య పరిపాలనను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు రాజ్యం, గిరిజనుల జీవించే హక్కును రెంటినీ దృష్టిలో పెట్టుకొని తీర్పు చెప్పింది. అంతిమంగా న్యాయం అంటే ప్రజల జీవించే హక్కును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. కోర్టు తీర్పులు ప్రజా స్వామ్యస్ఫూర్తికి భిన్నంగా ఉండకూడదు. ముఖ్యంగా ఆది వాసీల జీవించే హక్కును కాలరాసే విధంగా ఉండకూడదు. పెద్దన్న(సుప్రీంకోర్టు) చిన్నన్న (హైకోర్టు) ఇరువ్ఞరు చెప్పిందేమి టంటే ఆదివాసీలు అడవ్ఞలు ఖాళీ చేయాల్సిందేనని. న్యాయం పాపం ఎన్నిసార్లు ఓడిపోతుంది. అందుకే ఈసారి అది రోడెక్కింది. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా న్యాయం రోడెక్కడం ఈ మధ్య మనదేశంలో రివాజుగా మారింది. పౌరహక్కుల సంఘం చేసిన కృషి వల్ల హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది. అసలు విషయంలోకి వస్తే కొమరం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం కొలాంగొంది గిరిజనతండా ప్రజలను అటవీశాఖ అధికారులు నిర్బంధించారు. రిజర్వుడ్‌ ఫారెస్ట్‌లో నివాసముంటున్నారని, పోడు వ్యవసాయం చేస్తున్నారని, తద్వారా అడవిని నాశనం చేస్తున్నారని వారిపై అటవీశాఖ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా వారి ఇళ్లను బుల్‌డోజర్లతో తొక్కించి, ధ్వంసం చేసింది. వారందరినీ బలవంతంగా కలప డిపోకు తీసుకెళ్లారు. వారిని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై వెంటనే స్పందించిన పౌరహక్కుల సంఘం అటవీ అధికారులు చేస్తున్న చట్టవిరుద్ధ చర్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. హైకోర్టు తక్షణం స్పందిస్తూ 24 గంటల్లో నిర్బంధానికి గురికాబడ్డ గిరిజనులను కోర్టుకు హాజరుపరచాలని ఆదేశించింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ ఎఫ్‌డివో మంచిర్యాల నుంచి ప్రైవేట్‌బస్సులో వారందరిని హైదరాబాద్‌ కు తీసుకొచ్చా రు. కొలాంగొంది తండాలో 16 కుటుంబాలు నివసిస్తున్నాయి. 67 మంది గిరిజనులు ఉన్నారు. అటవీశాఖ అధికారులు ఇంటికో పెద్ద మనిషిని రాజమర్యాదలతో హైదరా బాద్‌ తీసుకొచ్చారు. నిజానికి గిరిజనులు కొలాంగొంది గ్రామంలో 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు. పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రిజర్వుడ్‌ ఫారెస్ట్‌లో నివాసం ఉండకూడదని వీరికి అటవీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీన్ని వ్యతిరేకించిన గిరిజనులు హైకోర్టు ను ఆశ్రయించారు. అటవీ అధికారులు వీరంతా అడవిని ధ్వంసం చేసి పోడు వ్యవసాయం చేస్తున్నారని, ఇది అటవీ చట్టం ప్రకారం నేరమని చెప్పారు. మరోవైపు గిరిజనులను అటవీ అధికారులను బలంతంగా ఖాళీ చేయించారు. కాని ప్రభుత్వం గిరిజనులు ఇష్టపూర్వకంగానే అక్కడ నుండి వెళ్లి పోయి కలప డిపోలో నివసిస్తున్నారని హైకోర్టుకు అబద్ధం చెప్పింది. నిజనిర్దారణ జరిపిన పౌరహక్కుల సంఘం వాస్త వాలను హైకోర్టుకు విన్నవించింది. వాస్తవాలను పరిశీలించిన హైకోర్టు తీర్పు చెప్తూ గిరిజనులకు ఆరు నెలల్లో భూమి, ఏడాదిలో పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వా న్ని ఆదేశించింది. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని చెప్పింది. వారికి పునరావాసం కల్పించే దాకా ఆదిలాబాద్‌ జిల్లాలోని వసతి గృహంలో ఉంచాలని చెప్పింది. విద్య,వైద్యంతోపాటు మౌలిక సౌకర్యాలన్నీ వారికి కల్పించాలని చెప్పింది. ఇంతవరకు న్యాయంగా తీర్పు చెప్పిన హైకోర్టు, తిరిగి సుప్రీంకోర్టు తీర్పు బాటలోనే పయనించింది. ఆదివాసీలు తమను ఖాళీ చేయించిన ప్రాంతంలో ఉంచాలని అభ్యర్థించారు. దానికి హైకోర్టు ఒప్పుకోలేదు. వారు నివసిస్తు న్న ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కావడం వల్ల అక్కడ నివసించే వీలు లేదని చెప్పింది. ఆదివాసీలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయకపోవడానికి సాంస్కృతిక కారణం కూడా ఉంది. కొలాంగొంది గూడెంలో జమునాబాయి అమ్మవారి ఆలయం ఉంది. తాత్కాలిక వసతి గృహాలు, భూమి వేరే చోట ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, తాము దేవతకొలువై ఉన్న ప్రాంతంలో ఉంటేనే బతకగలమని హైకోర్టుకు వారు చెప్పినా హైకోర్టు వారి వాదనలను పెడచెవిన పెట్టింది. అదే అయోధ్య విషయంలో కోర్టు భిన్నంగా స్పందించింది మరి. అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం గిరిజనులను ఇబ్బందులపాలు చేసింది. అధికారులు తరలించిన గిరిజనులలో ఏడు నెలల గర్భిణి ఉంది. ఆమెచేత ఒక్కరోజులోనే ఆరువందల కిలోమీటర్లు ప్రయాణం చేయించారు. ఆదివాసీ కుటుంబాలను తాము అక్రమంగా నిర్బంధించలేదని అటవీ శాఖ అధికారులు హైకోర్టుకు చెప్పారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే తాము వ్యవహరించామని పేర్కొన్నారు. ఆదివాసీలు హైకోర్టుకు చాలా స్పష్టంగా చెప్పారు. తమను బలవంతంగా తరలించారని, జంతువ్ఞల్లా చూశారని, తాము ఉన్న ఇళ్లను ధ్వంసం చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13, 2019న అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006పై తీర్పు వెలువరించింది. దీనిప్రకారం అడవిలో నివసించే అర్హత దేశంలోని 20 లక్షల మంది ఆదివాసీలకు లేదని చెప్పింది. ఇది ఆదివాసీల, గిరిజనుల జీవించే హక్కును కాలరాసింది. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వచ్చాయి. ఈ నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు సదరు రాష్ట్ర ప్రభుత్వాలను సమగ్రమైన రిపోర్టును కోర్టుకు అందించాల్సిందిగా ఆదేశిం చింది. సమస్య అటవీ హక్కుల గుర్తింపు చట్టంలోనే ఉంది. డిసెంబరు 13, 2005 ముందర 75 సంవత్సరాలుఅడవ్ఞల్లో నివసించే వారికే అటవీ భూమిపై హక్కు ఉంటుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. పులులకు ఇచ్చే విలువ కూడా మనుషులకు ఇవ్వడం లేదు. 1973లో జార్ఖండ్‌లోని లతేహర్‌ జిల్లాలో పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 9గా ఉన్న కేంద్రాలు ఇప్పుడు 50కి చేరాయి. 17రాష్ట్రాల్లో ఉన్న ఈ కేంద్రాల్లో ఆదివాసీలు నివసించకూడదని ప్రభుత్వం చెబుతోంది. 2014 గణాంకాల ప్రకారం పులుల సంఖ్య 2,226కి చేరుకుంది. అటవీ జంతువ్ఞలతో పాటు సహజీవనం చేస్తున్న ఆదివాసీలను ప్రభుత్వం, న్యాయస్థానాలు అడవి నుండి తరిమివేస్తున్నాయి. 2011 నాటి గణాంకాల ప్రకారం దేశంలో 11 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు. ఇందులో 95శాతం మంది అడవ్ఞల్లోనే నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వీళ్లలో 461 తెగలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పులులను కాపాడు తూ, అటవీ సంపదను కాపాడుతూ 50ఏళ్లకుపైగా అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. వారి జీవితం అడవితో మమేకం అయింది. వారు మైదాన ప్రాంతాల్లో నివసించలేరు. ఆదివాసీ లందరికీ అడవిపై, అటవీ ఉత్పత్తులపై హక్కును కల్పించాలి.

  • – ఎం.కె.కుమార్‌