ఇంగ్లీషు మీడియం కోసం టీచర్లకు శిక్షణ

Training for Teachers
Training for Teachers (File)

ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. వేసవి సెలవ్ఞల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగించాలి. టీచర్లలో ఇంగ్లీషు మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఇంగ్లీష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి.

రా ష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మండల, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే విడతల వారీగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్‌మీడియం విద్యను అమలు చేయనుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు, 2021-22 విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతికి, 2022-23 విద్యాసంవత్సరం నుంచి 10 తరగతి విద్యార్థులకు అమలు చేయనుంది. అయితే ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వు ల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నది.

ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరగాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలుకు రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ సంస్థ (ఎస్‌సిఇఆర్టీ) కసరత్తు ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ జిల్లా మండల పరిషత్‌, ఎయిడెడ్‌, మున్సి పల్‌ తదితర అన్ని మేనేజ్‌మెంట్లలో కలిపి 43,200 పాఠశాల లున్నాయి. వీటిలో ఇప్పటికే 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతోంది. గత ఏడాది రాష్ట్రంలోని 7వేల ప్రాథమిక పాఠశాల (1-5 తరగతులు)ల్లో ఇంగ్లీషు మీడియం ప్రవే శపెట్టారు. అంటే ప్రస్తుతం 1 నుంచి 8వ తరగతి వరకు మొత్తం మీద 8,500 పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలులో ఉంది.

ఇప్పుడు మరో34,700 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇప్పటివరకు 1500 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియానికి సమాంతరంగా తెలుగు మీడియంలో కూడా బోధన జరుగుతోంది. ఇప్పుడు అవి కూడా పూర్తి ఆంగ్లమాధ్యమ పాఠశాలలుగా మారిపోతాయి. ఇంగ్లీషు మాధ్యమంలో బోధనపై దాదాపు 96వేలమంది టీచర్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని ఎస్‌సిఇఆర్టీ అంచనా వేసింది.

ఇంగ్లీషు మెథడాలజీ టీచర్లకు, ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో బోధన చేస్తున్న వారికి శిక్షణ అవసరముండదు. తెలుగు మీడియంలో చదువ్ఞకుని, ఇప్పటివరకు తెలుగు మీడియంలోనే పాఠాలు చెబుతున్న వారందరికి శిక్షణ ఇవ్వాల్సిందే. ఇందుకోసం విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చే సంస్థల ఆధ్వర్యంలో మైసూరులోని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌ఐఇ), హైదరాబాద్‌లోని ఇఫ్లూ వంటిసంస్థల సహకారంతో ఉపాధ్యా యులకు శిక్షణ ఇప్పించే దిశగా కసరత్తు చేస్తోంది.

దశలవారీగా టీచర్లకు శిక్షణ ఇప్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమా చారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు నియమించేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతులను ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఉపాధ్యాయుల సంఖ్యకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపాలి.

ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు వీలుగా ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే టీచర్లకు శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహిం చాలి. వేసవి సెలవ్ఞల్లోనూ శిక్షణా కార్యక్రమాలు కొనసాగించాలి. టీచర్లలో ఇంగ్లీషు మీడియంలో బోధన సామర్థ్యం మెరుగుపడే వరకు సంబంధిత సబ్జెక్టు, ఇతర అంశాలపై వారికి తగిన శిక్షణ ఇవ్వాలి.

ఇంగ్లీష్‌ మీడియం బోధనలో సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే భవిష్యత్తులో జరిగే ఉపాధ్యాయ నియామకాల్లో నియమించుకోవాలి. ఇంగ్లీషు లాంగ్వేజ్‌ టీచింగ్‌ సెంటర్లు, డిస్ట్రిక్ట్‌ ఇంగ్లీష్‌ సెంటర్లను, డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌లుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలి. సంబంధిత ఉపాధ్యాయులు ఇంగ్లీష్‌ మీడియంలో బోధించడానికి వీలుగా వారికి అవసరమైన నైపుణ్యం, అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకశిక్షణ, హ్యాండ్‌బుక్స్‌ రూపకల్పన, ఉత్తమ బోధన పద్ధతుల గురించి వివరించడం, వారికి అవసరమైన మెటీరియల్‌ను రూపొందించే బాధ్యతను స్టేట్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌కి అప్పగించింది.

ఆంగ్లమాధ్యమం వల్ల మాతృభాషకు తీరిన అన్యాయం జరుగుతుందని, పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక బడి మానేసే ప్రమాదం ఉందని గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం మరింత కష్టం అవ్ఞతుందని విద్యానిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తెలుగు భాషాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలంకషంగా చర్చ జరగకుండానే లోతయిన అధ్యయనం చేయకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ నేడు ఇంటర్‌ వరకు తెలుగు మీడియంలో చదివిన వారికి నీట్‌ పరీక్ష కోసం తెలుగు మీడియంలో శిక్షణ ఇచ్చే సంస్థలు నేడు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం గమనార్హం.

అదేవిధంగా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదివిన వారు సివిల్స్‌లో శిక్షణ కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉన్నత చదువ్ఞలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంగ్లీష్‌ మీడియం చదివిన వారికి ఎక్కువగా ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం సమంజసంకాదు. ప్రభుత్వ స్కూళ్లల్లో 95 శాతం ఎస్సీ,ఎస్టీ, బిసివర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరు ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియం లేక తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు మీడియంలో చదువ్ఞతున్నారు.

ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే విద్యార్థిలో సృజన పెరు గుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ విద్యావేత్తలంతా చెబుతు న్నారు. దీనికి విరుద్ధంగా ఒక్కసారిగా తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి అంటే విద్యార్థులు మారితే ఆ ఒత్తిడి తట్టుకోగ లరా? అనేది అందరిలో తలెత్తుతున్న సందేహం. గణితం, సైన్స్‌ తెలుగులో చదివినవారు ఒకేసారి ఇంగ్లీష్‌లోకి వెళ్లడం చాలా కష్టమనే ఆందోళన ఉపాధ్యాయవర్గాల్లోనూ వ్యక్తమవ్ఞతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లలో కాలే జీలలో నేడు తెలుగు మీడియంలో బోధన జరగడం లేదు.

అక్కడ విద్యార్థులకు లేని ఇబ్బంది, కష్టం ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీషు మీడియం అమలు చేయడం వల్ల కొత్తగా ఉండబోదు. నేడు పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రావీణ్యం తప్పనిసరైంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంత ముఖ్యమో ఆంగ్లభాష విజ్ఞానం అంతకంటే ఎక్కువ అవసరం. ప్రపంచ విజ్ఞానం అంతా అధికభాగం ఆంగ్లభాషలో రాయబడిన గ్రాంథాలలోనే లభిస్తున్నది. కావ్ఞన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆంగ్లమాధ్యమంలో చదివిన వారికి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆంగ్లభాషపై పట్టు ఉంటే ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా బతకవచ్చు.

ఆంగ్లభాషపై పరిజ్ఞానం లేకుంటే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గడం అసాధ్యం. అందుకే రోజు రోజుకు ఆంగ్లభాష ప్రాధాన్యం, ప్రాముఖ్యత పెరుగుతోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియం చదువ్ఞలు అందించాలని యోచిస్తోంది. మధ్యతరగతి వాళ్లు ఎక్కువ మంది తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల్లో కొందరు తమ అబ్బాయిలను ప్రైవేట్‌ ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఫీజులు చెల్లించలేక అమ్మాయిలను మాత్రం ప్రభుత్వ తెలుగు బడుల్లో చేరుస్తున్న పరిస్థితి ఉంది. ఆంగ్లం రాకపోతే మన పిల్లలు ఎందుకూ పనికిరారు.

ఆంగ్లం రావాలంటే ఆంగ్ల మాధ్యమంలోనే చదివించాలి. నాణ్యమైన విద్య అంటే అదేనని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఏదిఏమైనా సామాజిక అంతరాలు, ఆర్థిక అంతరాలు తొలగాలంటే ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఇంగ్లీష్‌ మీడియం అమలు చేసి పేదవారికి కూడా ఇంగ్లీష్‌ చదువ్ఞలను అందుబాటులోకి తేవాలి.

ఒకవేళ తెలుగు మీడియం ఉండాలా ఇంగ్లీష్‌ మీడియం ఉండాలా అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలకు,ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్కూళ్లల్లో మీడియం ఉంచాలి. అవసరమైతే ప్రజల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా అవసరమైన మీడియం తెలుగు లేదా ఇంగ్లీష్‌ను అమలు చేయాలి.

  • ఆత్మకూరు భారతి

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/