నిర్లక్ష్యానికి గురవుతున్న వైద్యరంగం

Patients in Hospital

గత ప్రభుత్వాల అనుచిత విధి విధానాల కారణంగా ప్రభుత్వ వైద్యరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యింది. మరొకవైపు ప్రైవేట్‌ రంగం వైద్యంపై పట్టు బిగించింది.ఈ విధానాల కారణంగా మనదేశంలో ఆరోగ్యం కోసం పెట్టిన ఖర్చు కారణంగా 2012-18 మధ్యకాలంలో ఎనిమిది కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారని జాతీయ ఆరోగ్య మండలి తన తాజా ఆరోగ్య నివేదికలో పేర్కొంది. పరిస్థితిని సరిదిద్దేం దుకు పలు కఠినచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

కుల, మత, లింగ, ఆర్థిక హోదాతో నిమిత్తం లేకుండా ఆరోగ్యం అందరి అవసరం. అందుచేత ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించడం తప్పనిసరి. ప్రతి పౌరుడికి గ్యారంటీగా సమగ్ర, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి ఆరోగ్య సంరక్షణ చట్టం హక్కుగా జాతీయ ఆరోగ్య బిల్లును రూపొందించవలసిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని రాజ్యాంగం ఉమ్మడి జాబితాలో చేర్చి, జాతీయ ఆరోగ్య విధానాన్ని కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధంగా అమలు చేసే విధంగా చూడాలి.

ప్రతి పౌరుడికి ఆరోగ్యహామీ కల్పించే లక్ష్యం నెరవేరాలంటే ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం గణనీయంగా పెరగాలి. కార్పొరేట్‌ వైద్య సంస్థలకు వందల కోట్లలో లాభాలు ఆర్జించిపెడుతున్న ఆరోగ్యబీమా స్థానంలో ఆ నిధులను ప్రాథమిక ఆరోగ్యవైద్య కేంద్రాలను బలోపేతం చేయడానికి, తద్వారా గ్రామస్థాయిలోనే ప్రజలకు అత్యవసర పరిస్థితిలో సైతం నాణ్యమైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. ప్రతి 30వేల జనాభాకు రాత్రింబవళ్లు సేవలు అందించే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రతి ఐదువేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం, ప్రతిలక్ష మంది జనాభాకు అన్ని సౌకర్యాలతో సంపూర్ణ సిబ్బందితో కూడిన కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలి.

అత్యవసర పరిస్థితులలో రోగులను సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సుల ఏర్పాటు జరగాలి. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు తమ జిడిపిలో 6-9 శాతం దాకా ఖర్చు చేస్తుంటే మనదేశంలో అది ఒక శాతం కన్నా తక్కువే ఉంది. కాబట్టి ప్రజారోగ్యంపై తక్షణ చర్యగా ఒక్కశాతం నుండి 2.5 శాతానికి, రానున్న నాలుగు సంవత్సరాలలో ఐదు శాతానికి పెంచాలి. మందులను జనరిక్‌, పేర్లతో విక్రయించేందుకు వీలుకల్పించే హేతుబద్ధ మందుల విధి విధానాన్ని అమలు చేయాలి.జనరిక్‌ మందులను పేటెంట్‌ నిబంధనల నుండి మినహాయించాలి.

వ్యాక్సిన్లు తదితర అత్యవసర మందులు సరసమైన ధరలకు అందుబాటులో వ్ఞండేవిధంగా పరిస్థితిని మెరుగుపర్చేటట్లు చూడాలి. అభివృద్ధి చెందిన దేశాల నుండి ప్రాణాంతక మందులను దిగుమతిచేసి తద్వారా అపరి మిత వ్యయం చేయడం కంటే దేశీయంగా ఈ ప్రాణాంతక వ్యాధుల మందుల కొరతపై విస్తృత పరిశోధనలు చేసి ఇక్కడే మందులు ఉత్పత్తి చేయడం ద్వారా మందులకు అయ్యే ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.

  • సి.హెచ్‌.ప్రతాప్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/