అత్యాచార నిరోధక చట్టం పటిష్టంగా ఉండాలి

The anti-rape law must be strengthened

దళితులు, ఆదివాసీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోవడం ముదావహం. గత ఏడాది ఆ చట్టంలోని నిబంధ నలు నిందితుల పట్ల కఠినంగా ఉన్నాయని సుప్రీంభావించి అందుకు అనుగుణంగా తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పువల్ల బాధితులు మరింతగా నష్టపోయే అవకాశం ఉండడంతో ప్రజా గ్రహం వెల్లువెత్తింది. కేంద్రం పాత నిబంధనల్ని కొనసాగిస్తూ పార్లమెంటులో చట్టం చేయడమే కాకుండా సదరు తీర్పుని పున:సమీక్షించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. తుది తీర్పు రిజర్వులో ఉంది. దరిమిలా గతంలో తానిచ్చిన తీర్పుని వెనక్కి తీసుకొంటున్నట్లు ప్రకటించడం బాధితవర్గాలకు ఊరట. దేశంలో దళితులపై సగటున పదిహేను నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతూ వస్తోంది. గత పది సంవత్సరాలల్లో దాడులు అరవైఆరుశాతం పెరగ్గా, అత్యాచారాలు రెట్టింపైనాయి. అంటరానితనం వార్తలు మీడియాలో నిత్యం దర్శనమిస్తున్నాయి. అధికారిక లెక్కలే ఇలా వ్ఞంటే ప్రపంచం దృష్టికి రాని, నమోదుకాని ఉదంతాలు ఇంకెంత తీవ్రమో చెప్పలేం. ఈ అత్యాచారాల్ని అడ్డుకొనే మార్గాల్లో కఠిన చట్టాలుండడం కీలకం. కొంత మేరకు ఉపయోగపడుతున్న చట్టాల్ని ఏదో కారణాన పదును కోల్పోయేలా చేస్తే పరిస్థితులు మరింతగా దిగజారు స్తాయి.నేరం చేసే వాళ్లకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఆ ప్రమాదాన్ని నివారించేలా సుప్రీం వ్యవహరించడం హర్షణీయం.నమోదైనఅత్యా చారకేసుల్లో శిక్షవరకు వచ్చేవి అత్యల్పం. నమోదు మొదలు తుది తీర్పు వరకు బాధితులకు ఎదురయ్యే అవరోధాలెన్నో. సాధారణం గా బాధితుడి కన్నా నిందితుడు బలమైనవాడు. పలుకుబడి కలవాడు అయ్యుంటాడు. ఆ వ్యక్తికి ఎదురునిలబడడమే కష్టమైన పరిస్థితిలో అతన్ని వెంటనే అరెస్టు చేయరాదు. నమోదుకు ముందు ప్రాథమిక దర్యాప్తు చేయాలి. పై అధికారుల అనుమతి పొందాలి. అరెస్టు చేసినా ముందస్తు బెయిల్‌కి అర్హుడు తరహా అవకాశాలుంటే అవిబాధితుడి పట్ల అన్యాయం చేసినట్టే. అలాంటి అవకాశాల్ని నిందితుడికి లేకుండా చేయడంలోనే బాధితుడికి తొలి భరోసా ఉంది. సమానత్వం, అంటరానితనం నిషేధం లాంటి రాజ్యాంగ హక్కులపై సమాజానికి ఒక సందేశం ఇమిడి ఉంది. తప్పుడు కేసుల్లో అమాయకులు శిక్షించబడకుండా ఇప్పటికే నేరస్మృతిలో తగ్గు చట్టాలున్నాయి. ఆ వంకతో చట్టం పదును తగ్గించడం అంటే అసలు చట్టం ఉద్దేశాన్ని స్ఫూర్తిని నీరుగార్చ డమే. బెత్తం చూపిస్తూనే క్రమశిక్షణ అలవర్చడం, ప్రభుత్వానికే కాదు పౌరసమాజానికి ముందున్న కార్యం.

  • డా.డి.వి.జి. శంకరరావు

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/