లాయర్ల సంక్షేమంపై శ్రద్ధ చూపని తెలంగాణ సర్కారు

lawyers (File)

భారతదేశ స్వాతంత్య్ర సంగ్రా మంలో న్యాయవాదులు వహించిన కీలక పాత్ర గురించి అందరికీ తెలిసిందే. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకు న్యాయ వాదులు నిర్వహించిన పాత్ర కూడా అద్వితీయమైనది. ఎన్నో వ్యయప్రయాసాలకు నోచుకొని న్యాయవాదులు కోర్టు లోపల, ఉద్యమకారులకు ఉచితంగా న్యాయసహాయం అందించారు. కోర్టుబయట ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పోలీసులు దిగ్బం ధించినప్పుడు విద్యార్థులకు అండగా నిలబడ్డారు. అసెంబ్లీ ముట్టడి మొదలుకొని దీక్షలతో పాటు ఢిల్లీలో పార్లమెంట్‌ ముట్టడి వరకు అన్నిరకాల పోరాటాలు చేశారు.

తెలంగాణ సాధన జరిగాక కూడా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సాధన కోసం పోరాటం చేయకతప్పలేదు. ఇలా కష్టపడి సాధించిన తెలంగాణలో న్యాయవాదుల సమస్యలు తీరకపోగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ప్రస్ఫుటమవ్ఞతుంది.కొన్ని ప్రధాన సమస్యలైనా 41-ఎ,సిఆర్పీసి సవరణ గురించి కానీ, న్యాయవాదుల ఇళ్ల స్థలాల గురించి కానీ, జూనియర్‌ న్యాయవాదుల స్టయిఫండ్‌ గురించి కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. పై డిమాండ్లన్నింటిపైనా 2015 సంవత్సరంలో అన్ని బార్‌ అసోస ియేషన్లు కలిసి ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోయేషన్స్‌గా ఏర్పడి భారీ ధర్నా నిర్వహించినప్పటికీ ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పురాలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులతోపాటు న్యాయవాదులకు వంద కోట్లను కేటాయిస్తూ 2015లో వేర్వేరు ట్రస్ట్‌లను ఏర్పాటు చేసింది.

2018లో తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఏర్పడినప్పటికీ రూ.వందకోట్లను న్యాయవాద మండలికి బదిలీ చేయకుండా 2016లో ట్రస్ట్‌ డీడ్‌ను సవరణ చేసి కేవలం న్యాయవాదులకు చెందాల్సిన రూ.100 కోట్లను ఎటూకాకుండా పబ్లిక్‌ ఎట్‌ లార్జ్‌ అనే పదాన్ని చేర్చి ఆ నిధులను నిర్వీర్యం చేసింది.నిధుల కేటాయింపు విషయంలో ప్రజలతోపాటు న్యాయ వాదులు కూడా అనే అంశాన్ని చేర్చింది. నేరుగా న్యాయవాదుల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధుల పద్దువద్ద పబ్లిక్‌ ఎట్‌ లార్జ్‌ అనే పదాన్ని చేర్చడం న్యాయవాదులను వంచించడం తప్ప మరొకటికాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడ్మిని స్ట్రేటీవ్‌ ట్రిబ్యునల్స్‌ను మూసివేయడం జరిగింది.

ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్టులను కూడా మూసివేశారు. దీనివల్ల హైకోర్టులో పనిభారం పెరిగింది. గత ఏడు సంవత్సరాల నుంచి బార్‌ కౌన్సిల్‌కు ఒక్కపైసా కూడా మ్యాచ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సంవత్సరానికి రూ.ఐదు నుంచి పది కోట్లు న్యాయవాదుల సంక్షేమానికి కేటాయిస్తాయి. ప్రస్తుతం తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధిలో ఉన్న రూ. 9 కోట్లు కూడా ప్రతి న్యాయవాది ప్రతి కేసులో విధిగా అం టించాల్సిన న్యాయవాదులు, గుమస్తాల సంక్షేమనిధి స్టాంపు విలువ ద్వారా వచ్చిందే.

దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రభుత్వాల తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధుల కేటాయిం పులు చేస్తే న్యాయవాదుల సంక్షేమం మెరుగుపడుతుందని, లేని పక్షంలో కుంటుపడే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థలోభాగమైన న్యాయవాదుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. న్యాయవాదుల సంక్షేమం విషయంలో చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని అనేక దఫాలు డిమాండ్‌ చేశారు.

కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులంతా సిఎం అప్పాయింట్‌మెంట్‌కోసం ఎన్నిసార్లు లేఖలు రాసినా, రిమైండర్లు పంపినా సిఎం పేషీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందనా లేకపోవడం శోచనీ యం.ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 11 మంది న్యాయ వాదులు, కేబినెట్‌లో ఉన్న దాదాపు నలుగురు మంత్రులు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.

-బి.కొండారెడ్డి, (రచయిత: సభ్యుడు, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌)

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/