బడ్జెట్‌ అంకెల మధ్య కుదరని ‘లింక్‌’లు!

TS CM KCR in Assembly Budget Session (file)
TS CM KCR in Assembly Budget Session (file)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావ్ఞ 2019-20 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆరునెలలు గడచిపోయిన తర్వాత 2019 సెప్టెంబరు తొమ్మిదిన శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ వార్షిక వ్యయం రూ.1,46,492 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని రూ.1,11,056 కోట్లుగా పెట్టుబడి వ్యయాన్ని (మూలధన వ్యయాన్ని) రూ.17,275 కోట్లుగా తన బడ్జెట్‌ ప్రసం గంలో స్పష్టంగా పేర్కొన్నారు.అలాగే ద్రవ్యలోటును రూ. 24,082 కోట్లుగా అంచనా వేశారు. అయితే బడ్జెట్‌ పుస్తకాలలో పేర్కొన్న పెట్టుబడి వ్యయానికి, బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న పెట్టుబడి వ్యయానికి చాలా తేడా కనపడుతున్నది. రెవెన్యూ వ్యయం రూ.1,11,056 కోట్లకు, పెట్టుబడి వ్యయం రూ. 17,275 కోట్లను కలిపితే రూ. 1,28,331 కోట్లు మాత్రమే వస్తుంది. బడ్జెట్‌ వ్యయం రూ. 1,46,492 కోట్లు కదా. పెట్టు బడి వ్యయాన్ని కుదించారు. బడ్జెట్‌లో ఉన్న రెండు పెట్టుబడి వ్యయ పద్దులను పెట్టుబడి వ్యయంగా చూపకుండా విస్మరించారు.

ఆ రెండుపద్దులు ఏవంటే ఒకటి రుణాలచెల్లింపులు రూ. 8,896 కోట్లు, రెండవది ఇతర పెట్టుబడి చెల్లింపులు (క్యాపిటల్‌ డిస్‌బర్స్‌ మెంట్స్‌) రూ.9,265కోట్లు. విస్మరించబడిన ఈ రెండు పెట్టుబడి వ్యయ పద్దులను కలిపితే రూ. 18,161 కోట్లువస్తుంది. కనుక పెట్టుబడి వ్యయం రూ.35,436 కోట్లు. అప్పుడు రెవెన్యూ వ్యయం రూ. 1,11,056 కోట్లు+ పెట్టుబడి వ్యయం రూ. 35,436 కోట్లు = 1,46,492 కోట్లు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి 2019-20 శాసనసభలో 2019 ఫిబ్రవరి 22వ తేదీన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను వార్షిక వ్యయం రూ. 1,82,017 కోట్లుగా మొత్తం రాబడులను రూ. 1,82,059 కోట్లుగా ప్రవేశపెట్టారు. ప్రతి డిమాండ్‌కు సంవత్సరానికి వార్షిక వ్యయాన్ని చూపెడుతూనే అందులో సగం మొత్తాన్ని ఆరు నెలల ఖర్చుగా (ఏప్రిల్‌ -సెప్టెంబర్‌) విడగొడుతూనే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా పేర్కొన్నారు. దీని ప్రకారం ఈ ఆరు నెలలో రూ.91,000 కోట్లు ఖర్చయినట్లు లెక్క. మొన్న ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ 2019 అక్టోబర్‌ నుండి అమలులోకి వస్తుంది.

ఇది కూడా ఆరునెలలకే (అక్టోబర్‌-మార్చి). పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రకారం గత ఆరునెలలో రూ. 73,246 కోట్లు ఖర్చయినట్లు లెక్క. ఈ రెండు లెక్కలలో ఏ లెక్క వాస్తవమో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూ. 1,82,017 కోట్లు కాగా, పూర్తి స్థాయి బడ్జెట్‌ రూ. 1,46,492 కోట్లా? అంటే రూ.35,525 కోట్లు కోత పెట్టారు! ఈ బడ్జెట్‌లో రూ. 33,445 కోట్ల మేర రుణాలను తెస్తామని చెప్పారు. సవరించిన అంచనాల ప్రకారం 2019 మార్చినాటికి రాష్ట్రానికి రూ.1,79,796 కోట్ల రుణము న్నది.

2020 మార్చి నాటికి ఈ రుణం రూ. 2,03,730 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం ఉవాచ. ఇప్పటివరకు ఈ రుణమొత్తాలపై వడ్డీనే సుమారు రూ. 45,000 కోట్లు చెల్లించ డం జరిగింది. ఈ రుణాలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ సంస్థల, కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా ఉన్నది. 2019 మార్చి నాటికి అలాంటి రుణాలు రూ. 77,315 కోట్లు ఉన్నవి.ఈ మొత్తానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నది. కనుక మొత్తం అప్పు రూ. 2,57,111 కోట్లు. గత సంవత్సర కాలం నుండి దేశంలో ఆర్థికమాంద్యం, ఆర్థిక సంక్షోభం చోటు చేసుకు న్నాయి.

వాటి ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా పడ్డది. అందు వలన రాష్ట్ర ఆదాయంలో కోత ఏర్పడింది. కనుక వార్షిక బడ్జెట్‌లో కోత విధించాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో వాపోయారు. అంతేగాక కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన పన్నుల వాటాలో గ్రాంట్స్‌లలో కేంద్ర ప్రభుత్వం కోత విధించిం దని అన్నారు. కేంద్రం 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 24,42,213 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించి అమలుపరచగా, 2019-20 సంవత్సరానికి రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అంటే బడ్జెట్‌లో రూ. 3,44,136 కోట్ల మేరకు పెరుగుదల కనపడుతున్నది.

రాష్ట్రం 2018-19 సంవత్సరానికి రూ. 1,74,454 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూ.1,46,492 కోట్లకు ఎందుకు కుదించింది?అంటే రూ.27,962 కోట్ల మేర తగ్గించింది. అంటే ఈ బడ్జెట్‌ను 2017-18 సంవత్సరం బడ్జెట్‌ స్థాయికి తీసుకొచ్చింది. (రూ.1,43,133 కోట్లు సుమా) అంతేగాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు బదలీ చేయాల్సిన పన్నుల ఆదాయాలను, ఇవ్వాల్సిన గ్రాంట్స్‌ను గత మూడు సంవత్సరాల నుండి గణ నీయంగా పెంచుతున్నది.

2017-18 సంవత్సరంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది రూ. 10,85,130 కోట్లు. 2018-19 సంవత్స రంలో రాష్ట్రాలకు ఇచ్చింది రూ. 12,46,583 కోట్లు సుమా. 2019-20 సంవత్సరంలో రాష్ట్రాలకు ఇవ్వతలపెట్టింది రూ. 13,29,428 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి లేని ఆర్థికసంక్షోభం, ఆర్థిక మాంద్యం తెలంగాణ రాష్ట్రానికి ఎలా వచ్చింది? గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రెట్టిపు అయినదని 2018-19 సంవత్సరంలో వృద్ధిరేటు సరాసరిన 10.5 శాతం నమోదయినదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల గత ఐదు సంవత్సరాలలో ఈ కిందివిధంగా ఉన్నది.


ఆర్థికసంవత్సరం జిఎస్‌డిపి(కోట్లలో) 1.2014-15 రూ.4,51,580
2.2015-16 రూ. 5,77,902 3.2016-17 రూ. 6,59,033
4.2017-18 రూ. 7,53,811 5.2018-19 రూ. 8,65,688
అలాగే 2018-19లో వ్యవసాయ వృద్ధిరేటు 8.1 శాతంగా నమోదయిందని చెప్పారు.

పారిశ్రామికరంగంలో వృద్ధిరేటు 5.8శాతంగానూ, సమాచార సాంకేతిక రంగంలో వృద్ధిరేటు 11.5 శాతంగా నమోదయినదని చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో ఐటి ఎగుమతులు రూ. 52,000 కోట్ల నుండి 1,10,000 కోట్లకు చేరుకున్నాయన్నారు.మరి ఆర్థికమాంద్యం ఎక్కడ ఉన్నట్లు? ఒకవేళ వాదన కోసం ఉందని అనుకున్నా పెట్టుబడిదారీ దోపిడీ ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తిలో అరాచకం, సంక్షోభం, మాంద్యాలు అనివార్యంగా చోటుచేసుకుంటాయి.

ఎందుకంటే పెట్టుబడిదారుడు కేవలం లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాడు. పెట్టుబడి దారీ విధానం అంటేనే లాభాల వేట.ఉత్పత్తి ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం జరగదు. ప్రజల అవసరాలను, ఉపయోగాలను, ప్రజల కొనుగోలు శక్తిని పెట్టుబడిదారుడు దృష్టిలో పెట్టుకోడు. ఉత్పత్తి పెరిగి మార్కెట్లో డిమాండ్‌, ధరలు తగ్గితే ఉత్పత్తి ఠపీమని తగ్గిస్తాడు. ఉద్యోగులు, కార్మికులను తొలగిస్తాడు. నిరుద్యోగం పెరుగుతుంది. నీటిపారుదల రంగానికి నిధులను భారీగా తగ్గించారు.

ప్రస్తుతం రూ. 8,476కోట్లు మాత్రమే కేటాయిం చారు. తలపెట్టిన నీటిపారుదల ప్రాజెక్టులన్నింటిని పూర్తిచేయ డానికి ఇంకా రూ. 2.50 లక్షల కోట్ల నిధులు కావాల్సివస్తుంది. రైతుబంధు పథకానికి రూ.12వేల కోట్లు, పంట రుణాల మాఫీకి కేవలం రూ. ఆరువేల కోట్లు కేటాయించారు. ఈ ఆరువేల కోట్లను కనీసం రూ. 10వేల కోట్లకు పెంచాలి. పోలీసుశాఖకు దాదాపు రూ.ఐదువేల కోట్లు కేటాయింరు. దీనిని తగ్గించాలి. పట్టణాభి వృద్ధికి, మున్సిపాలిటీలకు రూ. 3,295 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులను కూడా తగ్గించాలి. ఉన్నత విద్యకు రూ.1,692 కోట్లు కేటాయించారు. దీనిని రెట్టింపు చేయాలి.

  • వి.జయరాముడు
    (రచయిత:ప్రభుత్వ ఉపకార్యదర్శి (రిటైర్డ్‌)