కల్తీ ఆహారంతో ప్రజారోగ్యానికి చేటు

ప్రజల ఆరోగ్యంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసాన్ని నిల్వ చేసి వాటితో ఆహారపదార్థాలు తయారు చేసి విక్రయిస్తుండటాన్ని కల్తీ ఆహార నియంత్రణ శాఖ అధికారుల ఆకస్మికదాడుల్లో ఇటీవలి కాలంలో గుర్తించారు. బయటకు హోటళ్లకు రంగురంగుల కాంతులతో హంగులతో ఆకట్టుకుంటున్నా లోపల మాత్రం జరుగుతున్న తంతును చూసిన అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

Roadside Food Stalls

పలు హోటళ్లను తనిఖీ చేస్తుండగా పురుగులు పట్టిన మాంసం, దుర్వాసన వెదజల్లే రొయ్యలు బయటపడుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని వేలల్లో జరిమానా విధిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం ఉన్న ప్రాంగణాల్లో వంటలు చేయడం ఆందోళన కలిగించే విషయం. అటువంటి పలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను తనిఖీలు చేసి అపరాధ రుసుం విధించినా ఎటువంటి ప్రయో జనం కనిపించడం లేదు. వీటివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ హోటళ్లలో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసానికి రంగులు పూసి మసాలా వేసి నూనెలో వేడి చేసి విక్రయిస్తున్నారు. ఇది తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్ప వని, కాలేయం, గుండె జీర్ణకోశ వ్యాధులు వస్తాయని వైద్యులు అంటున్నారు. పరిశుభ్రత లేని ఈగలు, క్రిములు చేరిన మాంసా న్ని తింటే శరీరంలోని అవయవాలపై ప్రభావం చూపుతుంది. కల్తీ, రంగులు అధికంగా వేసిన ఆహార పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

వీటివల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ హోటళ్లలో కల్తీనూనె వాడకం కూడా అధికంగానే ఉంటున్నది. సాధారణంగా ఏ నూనె అయినా కొంతస్థాయి వరకే వినియోగించాలి. అంతకుమించి వాడితే విషపూరితంగా మారిపోతుంది. ఉదాహరణకు నూనె ఒకమారు మరిగించి తీసేయాలి. కానీ వ్యాపారస్తులు మాత్రం అలా చేయడం లేదు. తొలిసారిగా వేసిన పామాయిల్‌ రెండు మార్లు వరకు అదే రంగులో ఉంటుంది. మూడోమారు ఎరుపుగా మారుతుంది. నాలుగో మారు చిన్న నలుపు వస్తుంది. ఇంకా వాడితే రంగు మారుతూ ఉంటుంది.

దీంతో పలురకాల వ్యాధులు సంక్రమిస్తాయి. తొలిసారి వినియోగించే నూనె మరిగేటప్పుడు సువాసన అంతగా ఉండదు. రెండు, మూడు మార్లు మరిగిన నూనెలు వాడితే సువాసన ఎక్కువగా వస్తుంది. అదే మనకు అంచనా. అంతేకాక చాలా మంది రోడ్లపక్కన ఏర్పాటు చేసిన దుకాణాల్లో ఆకలి తీర్చుకునేందుకు తినుబండారాలను తినేస్తుం టారు.

ఒకరోజుకు ఏమైపోతుందనే ధీమాతో ఉంటాం. కొన్ని దుకాణాల్లో ఇలా తినడం వల్ల హానికర రసాయన పదార్థాలు శరీరంలోకి చేరి పలురకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఒక్కోసారి వాటి ప్రభావం వెంటనే చూపకుండా ఆకస్మాత్తుగా కేన్సర్‌, లివర్‌ చెడిపోవడం, కామెర్లు వంటి ప్రాణాంతక వ్యాధులుగా మారుతాయి. అనుమతి లేని ఆహారపదార్థాలు విక్రయించే హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. భారీగా జరిమానాలు విధించాలి. యజమానుల్లో మార్పురాకుంటే హోటళ్లను సీజ్‌ చేయాలి. తనిఖీలు ముమ్మరంగా చేయాలి. ఆహారపదార్థాల నమూనాలను సేకరించి వాటిని పరీక్షించి ఆహారపదార్థాల నాణ్యతపై ప్రజలకు వాస్తవాలను వెల్లడించాలి. కల్తీ ఆహారంపై నేరుగా ఫిర్యాదు చేయడం ప్రజలు అలవరుచుకోవాలి.

  • ఆత్మకూరు భారతి