పదవీవిరమణ వయసు పెంచితే ఇబ్బందులే!

Retirement Age Extention
Retirement Age Extention

మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేందుకు కసరత్తు చేస్తుంది. అయితే వయస్సు పెంపుతో ఇబ్బందులు తప్ప అదనపు లాభం ఏమీ ఉండబోదనే వ్యాఖ్యలు మేధావివర్గాల నుంచి వస్తున్నాయి. అలాగే రాష్ట్ర ఆర్థికశాఖ కూడా సమస్యలు తప్పవని స్పష్టం చేస్తోంది.

ప్రధానంగా ప్రభుత్వ ఖజానాపై ఊహించని భారం పడటం ఖాయంగా పేర్కొంటున్నారు. మూడేళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతాయి. కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెలువడవ్ఞ. 61 ఏళ్ల పెంపుతో ఒక్కో ఉద్యోగికి రూ.30వేల వేతనం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్య దశకు చేరే స్థితిలో ఉండే ఉద్యోగులకు జీతం పెంచినా చేసే పనిలో మాత్రం తేడా ఉండబోదని ఉద్యోగులే పేర్కొంటున్నారు. ప్రస్తుతం పదవి విమరణ వయస్సుకు దగ్గరలో ఉన్న వారంతా పాతతరం మనుషులే. నేటి యువకులతో పోల్చితే వీరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో, ప్రస్తుత కంప్యూటర్‌ యుగంలో పోటీపడే ఉత్సాహం వీరిలో ఏమాత్రం కానరాదు. పైగా చేసే పనిలోవేగం ఉండదు. కంప్యూటర్‌ యుగంలో కాలంతో పరుగెత్తే ఉద్యోగులు నేటి వ్యవస్థకు అవసరం. వయస్సు పైబడిన ఉద్యోగులు వారి వారి కార్యాలయాల్లో నామమాత్రంగానే విధులు నిర్వహిస్తుంటా రు. వీరు చేయాల్సిన పనులు ఇతర ఉద్యోగులకు అప్పగించడం తో, వారికి అదనపు భారంగా మారుతుంది. ఉద్యోగుల సగటు వయసులో భారీ తేడా ఉంటుంది.

జూనియర్‌, సీనియర్ల మధ్య దాదాపు నాలుగు దశాబ్దాల తేడా ఉంటుంది. ఇద్దరి మధ్య సమన్వయం కుదరక, అంతరం పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకటి, రెండు శాతం ఉద్యోగులకు మాత్రమే ప్రయో జనం కలిగించే వయసు పెంపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకుంటే, యావత్తు నిరుద్యోగులు, విద్యార్థులు, యువత కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఇది అసాంఘిక శక్తులకు అవకాశం కల్పించే విధంగా మారే అవకాశాలు ఉంటాయి. వృద్ధతరంతో పనులు చేసే బదులు కొత్త ఆలోచనలతో పాలనలో భాగస్వాములు అయితే అభివృద్ధి పరుగులెత్తుతుందనే భావన అన్ని వర్గాల నుంచి వ్యక్తమవ్ఞ తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కాలంతోపోటీపడే యువతకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచాలని అధికశాతం ఉద్యోగులు కోరలేదు. వారి దృష్టి అంతా ఐఆర్‌, పిఆర్సీపైనే ఉంది.

రిటైర్మెంటు దగ్గరలో ఉన్న కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు, కేవలం వారి పదవీకాలం పెంచుకునేందుకు కొద్ది మాసాలుగా ఈ కొత్త నినాదానికి తెరలేపటంతో ముఖ్యమంత్రి దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల కోరికమేరకు పదవి విరమణ కాలం పెంచితే ఇన్నాళ్లు కొంత వ్యతిరేకంగా ఉన్న వీరంతా సానుకూలంగా మారుతారని సిఎం దృష్టికి తెస్తూ పక్కదోవ పట్టిస్తున్నారని కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలే బాహాటంగా పేర్కొంటున్న సందర్భాలు న్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వయస్సు పెంపుపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలనే ఆకాంక్ష అందరి మదిలో నుంచి వెలువడుతోంది.

  • సంజీవరెడ్డి