మాంద్యంవైపు పరుగులు తీస్తున్న ఆర్థికవృద్ధి!

recesson to economic growth!

ఉద్యోగ-ఉపాధి రంగాల్లో అవకాశాలు పెరగకుంటే, వ్యవసాయరంగం లాభసాటిగా లేకపోతే ఎన్ని రకాల పన్నురాయితీలు ప్రకటించినా దేశ ఆర్థికస్థితి మెరుగుపడే అవకాశాలు కనబడవ్ఞ. ఆర్థికవేత్తల మాటలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, ప్రశ్నించేవారందరిని దేశద్రోహులుగా ముద్రవేస్తే క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కానీ, విధానపరమైన లోపాలను కానీ చెప్పేవారుండరు. ప్రభుత్వ వ్యతిరేకులు కూడా దేశ ప్రజలే అనే సత్యం తెలుసుకొని అన్నిరంగాల ప్రజల, నాయకుల సూచనలతోనే దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలి.

దే శ ఆర్థిక స్థితిగతులపై రాజ కీయ నాయకుల ప్రకటన లకు, ఆర్థికవేత్తల ప్రకటనలకు హస్తీమశకాంతం ఉన్నంత తేడాలు కనబడుతున్నాయి. సామాన్యుల కొనుగోలు శక్తి రోజురోజుకూ పడిపోతుంటే, దేశంలో ఆర్థిక ప్రగతి మెరిసిపోతుందంటూ కేంద్ర మంత్రు లు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా దేశంలో సరైన ఆర్థిక విధానాలు లేకపోవడం వల్లనే నేటి ఆర్థిక మాంద్యానికి దారిపడు తుందని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం తన రాజకీయ సిద్ధాంతాలను అమలు పరుస్తున్నంత వేగంగా ఆర్థిక విధానాల గురించి ఆలోచించడం లేదని, దేశం చుక్కాని లేని నవలా ఆర్థిక ప్రపంచంలో పయని స్తుందని ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలు పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకులన్నీ దివాలా తీసే స్థితిలో ఉన్నా, ప్రైవేట్‌ బ్యాంకులతోపాటు ఇతర రుణసంస్థలు బోర్డు తిప్పేసినా, వీటన్నింటికీ గతంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ విధా నాలే కారణమని ప్రకటించి చేతులు దులుపుకొంటున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన రఘురాంరాజన్‌ 2015లోనే బ్యాంకులలోని నిరర్ధక ఆస్తుల విషయంలో ఆందోళన వెలి బుచ్చినా, ఆనాటి నోబెల్‌ గ్రహిత అమార్త్యసేన్‌ దేశ ఆర్థిక విధా నాలను విమర్శించినా, వాటన్నింటిని చెవికెక్కించుకోని బిజెపి ప్రభుత్వం నేడు దేశంలోని అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలవ్ఞ తున్నా అంతగా పట్టించుకోకుండా పైపై మాటలతో ఏవోకొన్ని తాత్కాలిక ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చాలని చూస్తుంది.

సామాన్య ప్రజలకు తమ రోజువారీ జీవితం గడపడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో భావోద్రేకాలతో కూడిన రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లబుచ్చుతూ రాజ్యాధికారమే ప్రధానంగా కేంద్రప్రభుత్వం తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్నది. స్వాతంత్య్రానికి ముందు కూడా పాలకులు ఇలానే మంచి మాటలతో ప్రజలను మచ్చిక చేసుకోవాలని చూసేవారు. మళ్లీ అవే రోజులు వస్తున్నాయేమో. దేశంలో ఆర్థిక ప్రగతికి అవసరమైన విధంగా బ్యాంకులు సులభ తరంగా అందరికీ రుణసౌకర్యం కల్పించాలని, 2008-09 ప్రాంతంలో ఉన్న మందగమనాన్ని ఎదుర్కోవడానికిఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేయాల ని బ్యాంకులను ఆదేశించారు. కానీ అప్పుడు రుణాలు తీసుకొన్న కొన్ని సంస్థలు, పారిశ్రామిక గృహాలు వాటిని సక్రమంగా వాడకపో వడం వల్లనో లేక వ్యవస్థలో, మార్కెట్లో వచ్చిన మార్పుల వల్లనో ఆ అప్పుల్లో చాలా మటుకు నిరర్ధక ఆస్తులుగా అంటే మొండిబకా యిలుగా మిగిలిపోయాయనేది నేటి ప్రభుత్వ వాదన. వాటినితిరిగి రాబట్టడానికి తమకు గత ఐదేళ్ల పాలనాకాలం సరిపోలేదని మోడీ ప్రభుత్వం వాదిస్తుంది.

నిజానికి బిజెపికి ఒక స్థిరమైన ఆర్థిక విధా నం అంటూ లేదనేది వీరివాదన. వాజ్‌పా§్‌ు ప్రభుత్వకాలంలో గతంలోని పివి నరసింహారావ్ఞ విధానాలనే కొనసాగించారు. అంతకన్నా ఒక కొత్త విధానాన్ని తేలేదు. బిజెపి మాతృ సంస్థ అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు కూడా సరైన విధానం అంటూలేదు. ఎందుకంటే అందులోనే స్వదేశీ ఆర్థిక విధానం అంటూ కొందరు ప్రవచిస్తే, మరికొందరు పెట్టుబడిదారీ ఆర్థికవిధానమే మేలు అని ప్రకటిస్తారు.అందుకే నేటి పెద్దలు ఆనాటి నెహ్రూఆర్థిక విధానా లను ఇప్పుడు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు.ఆనాడు స్వాతంత్య్రం పొందిన కొత్తలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని ప్రభుత్వమే ముం దుండి నడపాలని నెహ్రూ ఆశించారు.

దానికి కారణం ఆనాడు పారిశ్రామికరంగంలో పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి దేశంలో ధనవంతులు ఎవరూ ముందుకు రాలేదు. అసలు ధనవంతులు అంటూ ఉన్నవారంతా రాజులు, మహారాజులే. అందుకే నెహ్రూ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలను రెంటినీ సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తూ,దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపే ప్రయత్నంచేశారు. నెహ్రూ ఆర్థిక విధానాలలో లోపాలున్నాయని ఇందిరాగాంధీ కాలం నాటికే మార్పులు తెచ్చారు. ఇందిరాగాంధీ తెచ్చిన బ్యాంకుల జాతీ యకరణ తర్వాతే గ్రామాలకు బ్యాంకుల పరిచయం ఏర్పడింది. నేడు ప్రతి వ్యక్తికి బ్యాంకుఖాతా ఉండాలనే మోడీ ఆలోచనలకు నాంది ఇందిరాగాంధీ చేసిన బ్యాంకుల జాతీయకరణతోనే ప్రారం భం అయిందని చెప్పాలి. కానీ 90వ దశకంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆనాటి ప్రధాని పివి నరసింహారావ్ఞ ధైర్యంగా ప్రారంభించిన ఆర్థిక సరళీకరణ విధానాలవల్లనే నేడు భారతదేశం గర్వంగా తలెత్తుకొని నేడు ప్రపంచంలో ఎదుగుతున్న అగ్రరాజ్యంగా నిలువగలిగింది.

ప్రధాని పివి తర్వాత వచ్చిన అటల్‌ బిహారీ వాజ్‌పా§్‌ు ఆర్థిక విధానాల ఫలితమే ఎన్నోకొన్ని విదేశీ కంపెనీలు భారతదేశంలో తమ శాఖలను నెలకొల్పాయి.ఆ తర్వాత వచ్చిన మన్మోహన్‌సింగ్‌ కూడా అవే సరళీకరణ విధానాలను కొన సాగించారు. అయితే ఆ విధానాల అమలులో కొంత ఆశ్రిత పక్ష పాతం జరిగి,అవినీతికి పాల్పడడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజ లలో విశ్వాసం కోల్పోయి, అధికారానికి దూరమైందనే విషయం అందరికీ తెలుసు. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అతిపెద్ద ప్రయోగం పెద్దనోట్ల రద్దు. దీని వల్ల నల్లడబ్బు బయటకు రాకపోవడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.

బడావ్యాపార సంస్థలు ఎలాగో నెట్టు కొచ్చినా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణసదుపా యం దొరకుండాపోయింది. గ్రామీణ, మధ్యతరహా పట్టణాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకం అయింది. వీటిని అవసరాలలో ఆదుకొనే నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడడం, బయట వడ్డీల భారం ఎక్కువ కావడంతో ఈ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో గ్రామీణ, మధ్యతరగతి ప్రజలలో కొనుగోలు శక్తి 2017-18 సంవత్సరాల నుండే మందగించింది.

విపక్షనాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసే విమర్శలలో రాజకీయమే కనబడుతుంది కానీ అతనిలోని ఆర్థికవేత్తను బిజెపి ప్రభుత్వం చూడలేకపోతుంది. నోట్లరద్దు సమయంలోనే మన్మోహన్‌సింగ్‌ దేశ జాతీయ వృద్ధి దాదాపు రెండు శాతం వరకు పడిపోతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బని చెప్పారు. ఆనాడు అంటే 2016లో దేశ జిడిపి 8శాతంగా ఉండేది. మరి నేడు ఆరుశాతం కన్నా దిగువకు పడిపోతుంది. దేశ ఆర్థికస్థితి ఇంతగా దిగజారడానికి నోట్లరద్దుతో పాటు ఆ తర్వాత హడావిడిగా, దేశస్వాతంత్య్రంతో సమానంగా అభివర్ణిస్తూ అర్థరాత్రి ప్రవేశపెట్టిన మంచి సులభ పన్నుల(గుడ్‌ సింపుల్‌ టాక్స్‌) విధానం,అదే జిఎస్టీ అంటే గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ పెద్దపారిశ్రామికవేత్తలను, సంస్థలను కూడా దివాలా తీయించే స్థాయికి చేర్చింది. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తలే కాకుండా విదేశీ సంస్థలు, ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక నిపు ణులు భారతదేశ ఆర్థిక రంగంపై చేస్తున్న ప్రకటనలను, రేటింగు ను ప్రభుత్వం పట్టించుకొన్నట్లు లేదు. మొన్నటికి మొన్న నేటి నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ భారతదేశ ఆర్థిక విధా నాలను తీవ్రంగా విమర్శిస్తూ, ఈ విధానాల వల్ల దిగజారిన దేశ ఆర్థికస్థితి కనుచూపుమెరలో బాగుపడదని చెప్పారు.

ఆర్థిక మంద గమనం ప్రభావంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందనే విష యం ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే అందరూ గ్రహించారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో మొదటగా లగ్జరీ వస్తువ్ఞల కొనుగోలుపై ప్రభావం చూపింది. దాంతో ఆటోమొబైల్‌ రంగం వెంటనే స్పందించి తనఉత్పత్తులను తగ్గిస్తూ, ఉద్యోగులను కూడా తీసివేయడం ప్రారంభించింది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు తమలాభా లు పెంచుకొనే విధంగా అంటే వారు కట్టే పన్నులలో రాయితీలు ప్రకటించారు. అయినా ఆటోమొబైల్‌ అమ్మకాలలో ఈ 10-17 శాతం పన్ను రాయితీలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.

అలాగే ప్రభుత్వ లెక్కలలో టోకుధరల సూచి, చిల్లర ధరల సూచి 14 శాతానికన్నా దిగువకు పడిపోయింది. కానీ గత రెండు మూడు నెలల్లో మార్కెట్లో కూరగాయల ధరలతోసహా అన్ని పెరుగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వం మాత్రం మళ్లీ రుణమేళాలు పెట్టి లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని ప్రకటిస్తుంది.కొనుగోలు శక్తి పెరగాలంటే గ్రామీణ ప్రజలతోసహా, మధ్యతరగతి ప్రజల ఆదాయం వృద్ధికావాలి. ఒక ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉంటే అందులో ఒకరే సంపాదిస్తుంటే వారి సంపాదన తిండికే సరిపోతుంది కానీ లగ్జరీ వస్తువ్ఞల కొనుగోలుకు సరిపడవ్ఞ. ఉద్యోగ-ఉపాధి రంగాల్లో అవకాశాలు పెరగకుంటే, వ్యవసాయరంగం లాభసాటిగాలేకపోతే ఎన్ని రకాల పన్ను రాయితీలు ప్రకటించినా దేశ ఆర్థికస్థితి మెరుగుపడే అవకాశాలు కనబడటం లేదు. ఆర్థికవేత్తల మాటలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రశ్నించేవారందరిని దేశద్రోహులుగా ముద్రవేస్తే క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను కానీ, విధానపరమైన లోపాలను కానీ చెప్పేవారుండరు.ప్రభుత్వ వ్యతిరేకులు కూడా దేశ ప్రజలే అనే సత్యం తెలుసుకొని అన్నిరంగాల ప్రజల, నాయకుల సూచనలతోనే దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలి.

  • సిహెచ్‌వి ప్రభాకర్‌రావు, సీనియర్‌ జర్నలిస్టు

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/