ఉయ్యాలలో బిడ్డ: ఊరంతా వెతకడమా?

‘వార్తల్లోని వ్యక్తి
ప్రతిసోమవారం

Priyanka Vadhera
Priyanka Vadhera

రాహుల్‌ గాంధీ కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెసు అధిష్టానవర్గం కొత్త అధ్యక్షుని కోసం అన్వేషిస్తున్నది! రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండే, ఇంకా కొన్ని అనామక నామధేయాల పేర్లు వినిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీ అంత కష్టపడి, అహోరాత్రులు కృషి చేస్తేనే లోక్‌సభలో కాంగ్రెసు స్థానాలు 2014 నాటి 44 మంచి 90కి చేరాయి. అంటే రెట్టింపు పెరిగాయి. అదికూడా సాక్షాత్తు ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్‌గాంధీ కుమారుడైన రాహుల్‌గాంధీ కృషివల్లనే!
అయినప్పుడు, గెహ్లాట్‌లు, షిండేలు మోడీ, అమిత్‌షా దెబ్బకు ఎక్కడ ఆగుతారు? వారికి ప్రజలలో ఏ పాటి ‘గ్లామర్‌ వ్ఞంది? వారిని చూసి, ఎన్ని ఓట్లు పడతాయి?
ఒకప్పుడు మరీ ప్రజలలో ‘గ్లామర్‌ లేని సీతారామ్‌ కేసరులు, దేవకాంత్‌బారువాలు, యు.ఎన్‌.దేఖర్‌లు కాంగ్రెసు అధ్యక్ష పదవిని నిర్వహించారు. అయినా, అట్టి వారి వెనుక నెహ్రూ, ఇందిరాగాంధీ వంటివారు ప్రధానులుగా ఉండేవారు. సీతారామ్‌కేసరి హయాంలో కూడా కాంగ్రెసు గట్టి దెబ్బే తిన్నది.
అంతకు పూర్వం భర్త రాజీవ్‌గాంధీ మరణానంతరం ఎందరు ఎన్ని విధాల ఒత్తిడి చేసినా, కాంగ్రెసు అధ్యక్ష పదవీస్వీకారానికి నిరాకరించిన సోనియా గాంధీ ఇక కాంగ్రెసు క్షీణతను ఎదుర్కొవాలంటే తాను అధ్యక్ష పదవి స్వీకరించక తప్పదని భావించి, అతిరథమహారథులెందరో అలంకరించిన కాంగ్రెసు అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. ఆమె ఏకధాటిగా దాదాపు రెండు దశాబ్దాలు కాంగ్రెసు అధ్యక్షురాలుగా వ్ఞన్నారు. మూడేళ్లక్రితం ఆమెకు ‘క్యాన్సర్‌ వ్యాధి సోకడంతో కాంగ్రెసు అధ్యక్ష పదవిని నిర్వహించలేక రాహుల్‌కు అప్పగించారు.
కాగా, రాహుల్‌ తరువాత కాంగ్రెసు అధ్యక్షడెవరని వెతకాలా? ‘ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని, వూరంతా వెతికినట్టు! ప్రియాంక గాంధీ వాడ్రా వ్ఞండగా, గెహ్లాట్‌లు, షిండేల కోసం అన్వేషించనేల? ప్రియాంకను కాంగ్రెసు అధ్యక్షురాలిని చేయాలని కాంగ్రెసు కార్యకర్తలు కోరుతున్నారు. పెద్ద రాష్ట్రాలైన యు.పి, బీహార్‌ ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీలు ఏనాడో ప్రియాంకను కాంగ్రెసు అధ్యక్షురాలిని చేయాలని తీర్మానించాయి.
అచ్చంనానమ్మే
ఆ కట్టు, తలకట్టులో మాత్రమే కాదు- ఆలోచనా విధానంలోను ప్రియాంకది అచ్చం నానమ్మతీరే! ఇందిరాగాంధీలా ప్రజలతో మమేకం కావడం, ఆకర్షణశక్తి, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం- మూడు అంశాలు ఆమె బలం. ‘ప్రియాంక లావో కాంగ్రెసు బచావో ప్రియాంకను తీసుకురండి! కాంగ్రెసును కాపాడండి! అంటూ కాంగ్రెసు కార్యకర్తలు ఎన్నాళ్లుగానో ఆందోళన చేస్తున్నారు. పేదలకు ప్రతినెలా ఆరువేల రూపాయల పథకం ప్రియాంక ప్రతిపాదించిందే!
‘ప్రియాంక గాంధీ ఆంధీ (దుమ్మురేపే తుపాను) దూస్‌రా ఇందిరాగాంధీ ( రెండవ ఇందిరాగాంధీ)అనే నినాదాలు ఆమెను చూసినప్పుడల్లా కాంగ్రెసు కార్యకర్తలు చేస్తుంటారు. ఆమె కార్యకర్తలను తన కారులో కూర్చోపెట్టుకుంటారు. అప్పుడు వారి ఆనందోత్సాహాలు మిన్నుముట్టుతాయి. అదీ ఆమె ఆకర్షణశక్తి. కాంగ్రెసు హైకమాండ్‌ వెనుక ఆలోచనాశక్తి ఆమెదే! ప్రియాంకది ప్రేమ వివాహం. ఆమె భర్త వాడ్రా వ్యాపారవేత్త. ఆమె ఎమ్‌.ఏ (బుద్ధిజం అధ్యయనం) ఉత్తీర్ణులైనారు. బహుభాషా ప్రవీణురాలు-హిందీ, పంజాబీ, ఇంగ్లీషు, ఇటాలియన్‌, జర్మన్‌, రష్యన్‌, స్పానిష్‌. ఆమె పుట్టిన తేదీ జనవరి 12. వయస్సు 47 సంవత్సరాలు.
పునరుక్తి అయినా, ఒక్కమాట- ఇది ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని, వూరంతా వెతకడం కాదా?

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (”పద్మశ్రీ అవార్డు గ్రహీత)