ప్రస్తుత ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి?

People Wants Justice
People Wants Justice

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను ప్రకటిస్తూ ఆ పథకాల అమలు కోసం కార్మికులను కాంట్రాక్టు పద్ధతుల్లో తీసుకొని కనీస వేతనాలు చెల్లించకుండా మోసం చేస్తున్నాయి. ఇలాంటి కార్మికులు అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నభోజనం, ఐపికె, సాక్షారభారత్‌, స్వచ్ఛభారత్‌ లాంటి పథకాలలో రాష్ట్రంలో వేలమంది, దేశంలో లక్షల మంది పనిచేస్తూ దోపిడీకి గురి చేయబడుతున్నారు. ఏదో ఒకరోజు తామంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతామని ఆశతో ఈ కార్మికులంతా ఆలోచన చేస్తున్నారు. ఈ పథకాలలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి.

భా రతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు దాటింది. అయినా స్వాతంత్య్ర స్ఫూర్తి సమాజంలో అమలు కావడం లేదు. స్వాతంత్య్ర ఫలాలు అందరికి అందు బాటులో లేవు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ప్రభుత్వంగా ప్రజల కోసం పనిచేయాలి. వాస్తవంలో ప్రజల చేత ఎన్నుకోబడి పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని పాలకులు ఖూనీ చేస్తున్నారు. భారతదేశంలో బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించుకొన్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో స్వార్థ రాజకీయాలు, వర్గ ప్రయోజనాలు అధికంగా ప్రభావితం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం మన సమాజంలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నవారు సుమారుగా 70 లక్షల వరకు ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు రెండున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. వారిలో గ్రామాల నుండి నగరాల వరకు వివిధ ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నారు. వారికి సరైన జీతాలు కానీ, సౌకర్యాలుకానీ చెల్లించడం లేదు. గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్టు విధానం, దోపిడీ విధానమని దాన్ని రద్దు చేయడానికి వైస్లీ కమిషన్‌, రేగా కమిటీ లాంటి కమిటీలను వేసి వాటి సిఫార్సులతో 1970లో కాంట్రాక్టు విధానం రద్దు చేయడానికి చట్టాన్ని తెచ్చారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని తుంగలో తొక్కి ప్రతిపనికి కాంట్రాక్టు కార్మికులను నియమించి వారిని దోపిడీకి గురిచేస్తున్నారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 23 ప్రకారం ఫోర్స్‌డ్‌లేబర్‌ నిషేధించిన ప్పటికీ పరిపాలన అవసరాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం వివిధ రకాల పేర్లతో కాంట్రాక్టు కార్మికులుగా బలవంతంగా పనిచేయించు కుంటున్నారు. రాష్ట్రంలో సుమారుగా పంచాయతీ కార్మికులు 30 వేలు, మున్సిపల్‌ కార్మికులు 25వేలు, జిహెచ్‌యంసి కార్మికులు 30వేలు, స్కూలు, విద్యాసంస్థల్లో 15వేలు, సింగరేణిలో 20వేలు, ఆర్టీసీలో 10వేలు, మెడికల్‌ ఐదువేలు, ప్రభుత్వ ఆఫీసుల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుండి అటెండర్‌ వరకు వేల మంది, యూనివర్శిటీల్లో ప్రొఫెసర్‌ దగ్గర నుండి స్వీపర్‌ వరకు ఐదువేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు.

ఇందుగలడు అందులేడనే సందేహం వలదు అన్న రీతిని అన్ని చోట్ల కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు ఒక్కరోజు పనిచేయకపోతే ఈ వ్యవస్థ నడవనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా వారికి సరైన జీతాలు చెల్లించకుండా ప్రభుత్వాలు వీరి శ్రమను దోపిడీ చేస్తున్నారు.కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ నెలకు వందల కోట్ల నుండి సంవత్సరానికి వేల కోట్లల్లో ఉంటుందని అంచనా. పాతకాలంలో రాజులు కార్మికుడి శ్రమ దోచుకొని రాజ్యాలు నిర్మించినట్లుగా ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల శ్రమనుదోచుకొని పరిపాలన సాగించడం ప్రజాస్వామ్యంలో ద్రోహపూరితమైనది. ప్రజాప్రతినిధుల పాలనకు, రాజుల పాలనకు తేడా ఎక్కడవ్ఞంది? మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 43 ప్రకారం కార్మికులందరికి ‘లివింగ్‌ వేజెస్‌చెల్లించాలి. లీవింగ్‌ వేజెస్‌ అనగా ఒక కుటుంబం బతకడానికి కావాల్సిన జీతాలను నిర్వచించ బడింది. ఈ జీతాలు లెక్కగట్టడానికి దేశంలోని భారత లేబర్‌ ఆర్గనైజేషన్‌, ప్రపంచంలోని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థలు డాక్టర్‌ ఆక్రాయిడ్‌ ఫార్ములా ఆధారం చేసుకొని జీతాలు నిర్ణయించాలని నిర్ధారించి అంగీకరించడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం ప్రస్తుత వేతనాలు లెక్కగడితే నెలకు రూ. 24వేలు చెల్లించాలని యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయినా ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదు. ప్రభుత్వంలోని పర్మినెంట్‌ కార్మికులకు రూ.25వేల పైబడి జీతాలు చెల్లిస్తుంది. అదే పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10వేలు కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఇది రాజ్యాంగం ప్రకారం కానీ, కాంట్రాక్టు కార్మికుల చట్టప్రకారం కానీ, సుప్రీంకోర్టు తీర్పుప్రకారం కానీ ద్రోహం తప్ప న్యాయం కాదు. కాంట్రాక్టు కార్మికుల చట్టంలోని రూల్‌నెంబర్‌ 29, అనెగ్జర్‌ 5 ప్రకారం ఒకే పనిచేస్తున్న పర్మినెంట్‌ కార్మికులకు చెల్లించే జీతాలు కాంట్రాక్టు కార్మికులకు కూడా చెల్లించాలని చట్టం స్పష్టం చేసింది.

2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అయినప్పటికీ అటు కేంద్రం నుండి కానీ ఇటురాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేదు. బలవంతపు లేబర్‌కు సుప్రీంకోర్టు చక్కటి వివరణ ఇచ్చింది. ఏ కార్మికుడు తనంతటతానుగా తక్కువ జీతానికి పనిచేయడానికి అంగీకరించడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అవసరాలు, ముసలి తల్లిదండ్రులు పెరుగుతున్న పిల్లలను దృష్టిలో పెట్టుకొని పరిస్థితులకు లొంగిపోయి తక్కువ జీతానికి అంగీకరిస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా కాదని కోర్టు తెలియచేసింది. కోర్టు ఇంత మానవత్వాన్ని ప్రదర్శించే వివరణ చేసినప్పటికీ పాలకులు కార్మికుల పక్షాన ఉండాల్సింది పోయిపెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తూ కాంట్రాక్టు కార్మికులను ఎంత మోసం చూస్తున్నారో అర్థం చేసుకోవాలి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను ప్రకటిస్తూ ఆ పథకాల అమలు కోసం కార్మికులను కాంట్రాక్టు పద్ధతుల్లో తీసుకొని కనీస వేతనాలు చెల్లించకుండా మోసం చేస్తున్నాయి.

ఇలాంటి కార్మికులు అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్నభోజనం, ఐపికె, సాక్షారభారత్‌, స్వచ్ఛభారత్‌ లాంటి పథకాలలో రాష్ట్రంలో వేలమంది, దేశంలో లక్షల మంది పనిచేస్తూ దోపిడీకి గురి చేయబడుతున్నారు. ఏదో ఒక రోజు తామంతా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతామని ఆశతో ఈ కార్మికులంతా ఆలోచన చేస్తున్నారు.

ఈ పథకాలలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వ సంస్థలలో, పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితులు ఏరకంగా ఉంటాయో ఊహకందని విషయం. తెలంగాణ సాయుధ పోరాటంలో రాచరిక వ్యవస్థ వద్దు, బానిస వ్యవస్థ రద్దు అనే స్ఫూర్తితో కొనసాగి విజయవంతం అయింది. అదే స్ఫూర్తితో ప్రస్తుత సమాజంలో కాంట్రాక్టు విధానం రద్దు, అదేస్థానంలో పర్మినెంట్‌ ముద్దు అనే నినాదంతో ఉద్యమించాల్సిన పరిస్థితి ఉంది.

-వి.యస్‌.బోస్‌
(రచయిత:ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)