పాత పింఛన్‌ విధానమే మేలు!

ఎన్నో ఆశలతో అంతకుమించిన ఉద్వేగంతో ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ పాతపెన్షన్‌ విధానాన్ని ఎట్టి పరిస్థితులలోను తిరిగి పునరుద్ధరించేది లేదు అని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టం చేసింది. జీవితం అంతా ఎన్నో త్యాగాలుచేసిన ఉద్యోగులకు ఇక పని చేయ లేరని వారే నిర్ధారించి ఇంటికి సాగనంపేటప్పుడు శేషజీవితం గౌరవప్రదంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ఉన్న ప్రభు త్వం వారిని అలా గాలికి వదిలేసి మీ తిప్పలు మీరు పడండి అని నిర్మొహమాటంగా చెప్పి చేతులు దులుపుకుంటుంటే ఏమి చేయాలోఅర్థంకాక జీవితం మొత్తం చేసిన కష్టానికి ఇదా బహుమతి అని సగటు ఉద్యోగి ఆవేదన పడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

Pension Schemes
Pension Schemes

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాబోయే కొన్ని సంవత్సరాలలో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాల కన్నా పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌ రెండింతలు అయ్యే పెను ప్రమా దం ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య కొన్ని సంవత్సరాల ఊగిసలాట జరిగింది. భారతదేశం లో నూతన ఆర్థిక విధానాలు అమలు ప్రారంభమైన 1991 తర్వాత ప్రపంచ బ్యాంక్‌ నుండి, అంత ర్జాతీయ సంస్థలనుండి, బహుళజాతి సంస్థలు, భారత పారిశ్రా మిక వాణిజ్యవర్గాల నుండి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వం పెన్షన్‌ ఖర్చులు తగ్గించుకోవాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. పలుకుబడి కలిగిన ఆ వర్గాలు భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కరెంట్‌ ఖాతాలోటు తగ్గించుకోవాలి. కనుక పెన్షన్‌ రంగంలో సంస్కరణలు చేపట్టవలస్సిందేనని భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వచ్చాయి.

నిండుకుంటున్న ఖజానాను తిరిగి నిలబట్టే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప మిగతా అందరికీ కనబడిన ఏకైక ప్రత్యామ్నాయం పెన్షన్‌ సౌకర్యం. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగవర్గానికి మాత్రమే పెన్షన్‌ సదుపాయాలు ఉన్నవి. కాబట్టిపాత పెన్షన్‌ స్థానంలో నూతన పెన్షన్‌ విధానం అమలు చేయాలని నిర్ణ యించారు. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1952లో పెన్షన్‌ సౌకర్యాన్ని కల్పించాయి. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆ ఉద్యోగి చివరి నెలలో పొందుతున్న మూల వేతనం+ కరువు భత్యంలో 50 శాతం పెన్షన్‌గా కేంద్ర ప్రభు త్వం చెల్లించనున్నది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌ చెల్లించు తున్నాయి.

పెన్షన్‌దారులకు కూడా వేతన సవరణలను వర్తింప చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వృద్ధాప్యంలో ఎటు వంటి చీకుచింతా లేకుండా ప్రశాంత జీవనం గడిపే విధంగా భారతదేశంలో పెన్షన్‌ చట్టాలు అమల్లో ఉన్నాయి.
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం
దుర్మార్గంగా రకరకాల రూపాలలో సబ్సిడీలను పొందుతున్న భారత పెట్టుబడిదారీ వర్గం ఉద్యోగులకు జీవన భద్రత కల్పిం చే పెన్షన్‌కు అయ్యే ఖర్చును తగ్గించుకోవాలని పట్టుబడుతూ వచ్చాయి. పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేసే భారత పాలకులు దశాబ్దాలుగా అమలవ్ఞతున్న పెన్షన్‌ విధానం స్థానంలో ఉద్యోగులు తమ జీతం నుండి పెన్షన్‌ చెల్లించే విధా నం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నోట్‌ ఎఫ్‌నెం.5/7/2002 ఇసిబిపిఆర్‌ తేదీ.10.10.2003 ద్వారా అమలులోనికి తీసుకొచ్చారు.

01.01.2004 నుండి అమలు లోనికి వచ్చిన ఈ విధానానికి నూతన పెన్షన్‌ పథకం అని పేరు పెట్టారు. ఈ విధానాన్ని ఆర్థిక భాషలో డిఫైస్డ్‌ కాంట్రి బ్యూషన్‌ సిస్టమ్‌ అంటారు. ఈ నూతన పెన్షన్‌ విధా నాన్ని అమలు చేయడానికి ఉద్దేశించిన పెన్షన్‌ నిధి నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లు 01.01.2004 నుండి పార్ల మెంటులో పెట్టి అమలుకు ఆనాడు ఎన్డీయే,ఆ తర్వాత యుపి ఏ ప్రభుత్వాలు భట్టి విక్రమార్కునిలాగ ప్రయత్నాలు చేసి చివ రకు సఫలం అయ్యాయి. యుపిఎ-1లో ప్రధాన భాగస్వాము లైన లెఫ్ట్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ రావడంతో 2009 వరకు సాధ్యంకాలేదు. ఆ తర్వా త వచ్చిన యుపిఏ-2 ప్రభు త్వం 2011లో తిరిగి పార్ల మెంటులో ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. బిల్లును స్టాండింగ్‌ కమిటీకి 2005లోను, 2011లో ను రెండు సార్లు సిఫార్సు చేశారు. ఈ బిల్లును చట్టం చేయ వద్దని గత దశాబ్దకాలంగా దేశంలోని ఉద్యోగులు, ఉపాధ్యా య, కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేస్తూ వస్తున్నాయి. పిఎఫ్‌ఆర్డీఏ బిల్లు ద్వారా పింఛన్‌దారులు దాచుకున్న సొమ్ము ను విదేశీశక్తులు మార్కెట్‌ మాటున దోచుకెల్తాయన్న ఆందోళన అన్ని వర్గాల నుండి వ్యక్తం అవుతున్నది.

ఈ వాదనతో ప్రతి పక్షాలైన వామపక్షాలు, తృణమూల్‌, డియంకె, అన్నాడియంకె, సమాజ్‌వాది పార్టీలు వ్యతిరేకిస్తూ అనేక సవరణలు ప్రతిపాదిం చినా వాటిని తిరస్కరి స్తూ బిజెపితో చేతులుకలిపి దొడ్డిదారిన బిల్లును ఆమోదించింది. విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి ప్రజల పింఛనుసొమ్మును ప్రైవేట్‌ శక్తులపరం చేసేందు కు ఉద్దేశించిన పెన్షన్‌బిల్లును ప్రతిపక్షాల నిరసనమధ్యనే యు. పి.ఏ సర్కార్‌ ప్రధా న ప్రతిపక్షం బిజెపితో జతకట్టి సెప్టెంబర్‌ 4న లోక్‌సభలో ఆమోదింప చేసుకుంది. పింఛను నిధి నియం త్రణ అభివృద్ధి ఆథారిటీ బిల్లు-2011 పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును పింఛ న్‌దార్లప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం పేర్కొంది.సంపాదిస్తూ పొదుపు చేయండి అంటూ పింఛన్‌ నిధులను మార్కెట్‌ పరం చేయనున్నారు.

పాతపెన్షన్‌ విధానంలో ప్రయోజనాలు

ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్‌ అయిన తర్వాత నిర్దిష్టమైన పెన్షన్‌ నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డిఏ, పిఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతి నెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంత వరకు పెన్షన్‌ ఇవ్వటంతోపాటు చనిపోయిన తర్వాత ఉద్యోగి భార్యకు పెన్షన్‌ చెల్లిస్తారు. ఆ పెన్షన్‌ బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌ చెల్లి స్తారు ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది.

ఉద్యోగి అవసరాల కోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జిపిఎఫ్‌ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహి స్తుంది. ఈ సొమ్ముపై ప్రతినెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవరసమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్‌కార్డుల సదుపాయం ఉంది. తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి వినియోగించ నందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు

. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది. పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్‌ నుంచి ప్రతినెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యూటేషన్‌ అంటారు. ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి చంద్రచూడ్‌ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం డిసెంబరు 17, 1982న కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇచ్చిన తీర్పులో వృద్ధాప్యంలో ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించబడింది.

  • కాళంరాజు వేణుగోపాల్‌