ఆన్‌లైన్‌ విధానం నియత బోధనకు ప్రత్యామ్నాయం కాదు

లక్ష్యాలకు చేరుకునేనా?

Online Education
Online Education

కరోనా మహా విపత్తును అవకాశంగా మార్చుకొని కేంద్రప్రభుత్వం విద్యా రంగంలో ఆన్‌లైన్‌ విద్యను నియత విద్యకు ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు.

పిఎమ్‌ఇ విద్య పేరు మీద పాఠశాల విద్యలో మొదటి తరగతి నుండి 12వ తరగతి దాకా ఆన్‌లైన్‌ విద్య, ఒకే దేశం ఒకే డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను నెలకొల్పుతూ, ప్రతి తరగతికి ఒక టీవీ ఛానల్‌ ద్వారా విద్యను అందిస్తారట.

ఉన్నత విద్యలో ప్రతిష్ట కలిగిన వంద విశ్వవిద్యాలయాల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు ప్రవేశపెడ తారట. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానాలను అంగీకరించడమే .

విద్య సామాజిక అభ్యున్నతికి, సామాజిక మార్పునకు, సమానత్వ భావాలకు తోడ్పడాలి. విద్య ప్రజాస్వామిక, లౌకిక, శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకొని తన జీవితంలో ఆచరించే పౌరులను తయారు చేస్తుంది.

అది వృత్తి విద్య అయినా, సాంకేతిక విద్య అయినా కావచ్చు. లేదా సామా జిక, ప్రకృతి శాస్త్రాల గురించి బోధించే యూనివర్శిటీ, కాలేజీ విద్య అయినా కావచ్చు.

అందులో భాగంగా విద్య ఉద్యోగ అర్హతలను కల్పిస్తుంది. ఇంకా కొఠారి చెప్పినట్లుగా విద్య,జాతి ఐక్యతను సామాజిక ఐక్యతను సాధించాలి.

కానీ విద్యా లక్ష్యం ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్యోగం పొందడంగా మాత్రమే మారినప్పుడు, అది కూడా ఆన్‌లైన్‌లో నేర్చుకున్నప్పుడు పైన చెప్పిన విద్యాలక్ష్యాలు వక్రీకరించి దిగజారిపోతాయి;.

ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఎంత కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న వారు సెల్‌ఫోన్లనూ, లాప్‌టాప్‌లను హత్తుకొని సాటిమానవులను పట్టించుకోలేని రోబోట్‌లా మారుతారు.మానవత్వాన్ని కోల్పోతారు.

నిజంగా వీరు చాలా వరకు ఒంటరి మనుషులై నిజమైన అర్థంలో మనుషులు అనే ఉనికినే కోల్పోతారు.

ప్రత్యక్ష ముఖాముఖీ విద్యలో తరగతిగదిలో ఏదేని విద్యార్థి కాన్సెంట్రేషన్‌ చేయకపోతే అక్కడ ఉన్న టీచర్‌ ఆ విద్యార్థిని మందలించి, చెప్పే పాఠం మీదికి దృష్టి మరల్చుతాడు.

ఏదైనా విద్యార్థికి పాఠం మధ్యలో సందేహం కలిగినప్పుడు దానిని నివృత్తి చేస్తూ మిగతా పాఠాన్ని కొనసాగిస్తాడు.

వివిధ రకాల సామాజిక ఆర్థిక నేపథ్యంలో నుండి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఉదాహరణలు చెప్పి అర్థం చేయించాలో ప్రత్యక్ష విద్యలో జరుగుతుంది.

అటు వంటివి ఎన్నో సమస్యలు ప్రత్యక్ష ముఖాముఖి నియత విద్య ద్వారా పరిష్కారం అవుతాయి. ఇది ఆన్‌లైన్‌ విద్య ద్వారా అసాధ్యమని చెప్పకతప్పదు.

ఆన్‌లైన్‌ విద్య కొద్దిమందికి కొంత ఉపయోగపడినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక,ఆర్థిక వ్యవస్థీకృత అసమానతలను పెంచి పోషిస్తుంది.

మారుమూల గ్రామీణ ఏజెన్సీ ప్రాంతా ల నుండి వచ్చే విద్యార్థుల దగ్గర లాప్‌టాప్‌లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు మొదలైనవి లేవు. వారి ఇళ్లల్లో మంచి క్వాలిటీ టెలి విజన్‌లు ఉండవు.

ఉన్నా కనెక్టివిటీ ఉండదు. తెలంగాణాలో యూనివర్శిటీ విద్యార్థులు కూడా 95శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

దేశంలో ఉన్న పేదలలో 98శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 85శాతం, దళితుల్లో 70శాతం కుటుంబాలకు కంప్యూటర్‌లు లేవని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

-మారుపాక అనిల్‌కుమార్‌, (రచయిత: ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/