కేన్సర్‌ రోగుల కోసం ఆన్‌లైన్‌ ఉద్యమం

Online movement for cancer patients

నోషేవ్‌ నవంబర్‌ ఇది 2009లో అమెరికాలో ప్రారంభమైన నినాదం. యువత షేవింగ్‌ మాని విరాళాలిస్తోంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రాం లాంటి యాప్‌ల ద్వారా సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇది ఎలా మొదలైందంటే? 2009లో అమెరికాకు చెందిన ‘మొవంబర్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ పురుషుల్లో కనిపించే కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతోఈ ప్రచారాన్ని చేపట్టింది.

అదే ఏడాది చికాగోకు చెందిన మాథ్యూహిల్‌ అనే వ్యక్తి కేన్సర్‌తో మరణించడంతో చలించిపోయిన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ సామాజిక ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. ‘నో షేవ్‌ నవంబర్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రత్యేక ప్రచార పేజీని ప్రారంభించారు. ఆరంభంలో పశ్చిమదేశాలకే ఇది పరిమిత మైనప్పటికీ ఇప్పుడు సోషల్‌ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఐదారేళ్లుగా ఈ ఉద్యమానికి ఆదరణ క్రమేణా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువకులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఈ ఉద్య మంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

పైగా గడ్డం పెంచడం కొన్నేళ్లుగా ఫ్యాషన్‌గా కూడా మారడంతో యువత ఈ ఉద్యమానికి తమవంతు మద్దతుగా గడ్డం పెంచి అవగాహన కల్పిస్తున్నారు. ‘నో షేవ్‌ నవంబర్‌ హ్యాష్‌ట్యాగ్‌కు సోషల్‌ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. దీని ద్వారా అవగాహన కలిగించడంతోపాటు విరాళాలు సేకరించ గలుగుతారు. నెలమొత్తం గడ్డం చేసుకోకుండా ఆ డబ్బును కేన్సర్‌ పేషెంట్లకు విరాళంగా ఇవ్వడమే ‘నో షేవ్‌ నవంబర్‌ ఉద్యమం.

సాధారణంగా అక్టోబర్‌ నెలను మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించే నెలగా నిర్వహిస్తూ విస్తృత ప్రచారం కల్పిస్తారు. అదేవిధంగా పురుషుల్లో కనిపించే టెస్టికల్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నవంబర్‌ మొత్తం పురుషులంతా ఇలా గడ్డం పెంచాలన్నది ఈ ఉద్యమ ధ్యేయం. కేన్సర్‌ చికిత్స తీసుకుంటున్న వారు వినియోగించే మందులు చాలా శక్తివంతమైనవి. వాటి వల్ల తలెత్తే దుష్ప్రభావాల కారణంగా కేన్సర్‌ రోగులకు జుట్టు మొత్తం రాలిపోతుంది. అందుకే కేన్సర్‌ ట్రీట్‌మెంట్‌ రోగుల్లో చాలా మంది గుండుతో కనిపించడం చూస్తుంటాం.

ఇలాంటి పేషెంట్లకు విగ్గుల కోసం చాలా మంది తమ జుట్టును కూడా ఇస్తుంటారు. ఇలా కేన్సర్‌ పేషెంట్లు పడే ఇబ్బందులన్నింటిపై అవగాహన కల్పించేందుకు నవంబర్‌ నెల మొత్తం షేవింగ్‌ మానేసి మీసాలు, గడ్డాలు పెంచేస్తున్నారు. ఈ ఉద్యమంలో రెండు భాగాలున్నాయి. మొదటిది నెల మొత్తం ముఖంపై రేజర్‌, కత్తెరలు పడకుండా గుబురు గడ్డం, మీసాలు పెంచాలి. షేవింగ్‌ కోసం మిగిలిన డబ్బును విరాళంగా ఇవ్వాలి.

అది ఎంత మొత్తం అన్న విషయంలో ఎలాంటి షరతులు లేవ్ఞ. నో షేవ్‌ నవంబర్‌ షాపింగ్‌ అని గూగుల్‌లో టైప్‌ చేయగానే పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన నో షేవ్‌ నవంబర్‌ లోగోలు ఉన్న ఉంగరాలు, రిస్ట్‌బ్యాండ్లు, టీషర్టులు, గాగుల్స్‌ కనిపిస్తాయి. వీటిని కొంటే అందులో కొంత మొత్తాన్ని కేన్సర్‌ రోగుల వైద్యానికి, కేన్సర్‌పై ప్రయోగాలు చేసే సంస్థలకు విరాళంగా పంపుతారు. 2013లో అమెరికన్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ కూడా తోడవడంతో ప్రపంచవ్యాప్తంగా దాతలు స్పందించి మిలియన్‌ డాలర్లు సమకూరుస్తున్నారు.

పాశ్చాత్యదేశాల ట్రెండ్‌ను ఫాలో అవ్వడం మనకు కొత్త కాదు. ఇది కూడా ఈ కోవకు చెందినదే. అమెరికాలో పుట్టిన ఈ కొత్త ట్రెండ్‌ను మన భారతీయులు వెర్రెత్తినట్లు ఫాలో అవ్ఞతున్నారు. ఆ దేశంలో నవంబరు నెల మొత్తం గడ్డం గీసుకోవడం లేదు. షేవింగ్‌ చేసుకోకుండా మిగిల్చిన సొమ్మును కేన్సర్‌ పేషెంట్లకు విరాళంగా అందిస్తున్నారు. అయితే భారత్‌లో కేవలం ట్రెండ్‌ను మాత్రమే ఫాలో అవ్ఞతున్నారు. విరాళాలు ఇవ్వాలనే విషయంపై ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేదు. దీంతో కొంత మంది మాత్రమే తమ విరాళాన్ని స్వచ్ఛందసంస్థలకు అందిస్తున్నారు. ఇదే ‘నో షేవ్‌ నవంబరు వెనుక ఉన్న ముఖ్యఉద్దేశ్యం. అయితే నేటి యువత అందరికీ ఆదర్శంగా నిలవాలంటే ఈ ట్రెండ్‌ ఫాలో కావాలి. విరాళాలు సేకరించాలి.

  • ఆత్మకూరు భారతి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/