మాతృభాషా చైతన్యంతో భారత జాతీయతావికాసం

Mother Language
Mother Language

అ న్యభాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు..సకిలించు ఆంధ్రుడా.. అంటూ ప్రజాకవి కాళోజీ ఏనాడో చురుక్కుమని ఝుళిపించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 18 కోట్లకుపైగా ఉన్న తెలుగు మాట్లాడేవారి సంఖ్యాబలం ఉండనే ఉంది. ఒకానొక వేలాది సంవత్సరాల కాల చరిత్ర కారణంగా సాహితీ సాంస్కృతిక ఔన్నత్యం సంతరించుకొన్న ‘ఆంధ్ర పర్యాయపదం చారిత్రక స్థితిగతుల రాజకీయంలో రెండు రాష్ట్రాలు ఏర్పడటం వలన ఉమ్మడి నుంచి అవశేషంగా మిగిలిన ఆంధ్రప్రదేశం పేరుకే పరిమితమైనా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అమ్మభాషగా తెలుగు ఆరాధ్యనీయం అవ్ఞతోంది. స్వాతంత్య్రానంతరం భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల ఆవిర్భావానికి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగదీక్ష ఫలితంగా తెలుగు భాష దేశానికి నాంది పలికింది. ఎల్లలు, సరిహద్దులు లేని ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్రంలో, భాషలకు అస్తిత్వం లేని రోజులలో పోతన, అన్నమయ్య, గోపన్న, త్యాగయ్య వంటి మహనీయ మహాత్ములు ఎందరో మాతృభాష మాధుర్య ప్రాభవాన్ని దక్షిణ భారతావని నుండి అఖండ భారతావనికి అందించి జగత్ప్రసిద్ధులయ్యారు. కాలక్రమేణా సంస్కృతం, ఆంగ్లం, తెలంగాణాలో ఉర్దూ వంటి భాషల సంసర్గంల వల్ల భాషాపరంగా అభివృద్ధి సాధించినా మన మాతృభాష అణచివేతకు గురిఅవ్ఞతోంది. పాశ్చాత్య జీవన విధానం, భావజాలం, విద్యాఉద్యోగ ఉపాధిరంగాల వికాసం దేశీయ భాషలకు ఆదరణ తగ్గటం క్రమేపీ ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యే స్థితిగతులు తలెత్తాయి. జాతీయస్థాయిలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యాకుల ఆదరణీయ భాషగా రెండవ గుర్తింపు పొందిన మాతృభాష ఆంగ్లభాషా వ్యామోహం, విద్యా,ఉద్యోగ రంగాల అవశ్యకత దృష్ట్యా సమాజంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి అవుతోంది. భాషావికాసానికి ప్రభుత్వ ప్రోత్సాహం అంతంత మాత్రంగానే ఉంది.

తల్లిభాషలకు సమాదరణ

‘మీరు హిందీలో సమాచారం పంపిస్తే నేను తమిళంలో ప్రత్యుత్తరం ఇస్తాను అన్నారు ఒక సందర్భంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. 1968లో కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దటానికి ప్రతిపాదించబడిన త్రిభాషాసూత్రం తమిళనాడు ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రతిఘటిస్తోంది. 1950 నుంచి క్రమేపీ జాతీయ భాషా విధానంలో భాగంగా ఆంగ్లం స్థానంలో రాజభాషగా హిందీకి పట్టాభిషేకం చేయాలనే ప్రయత్నాలు ఢిల్లీ రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. 17వ లోక్‌సభ కొలువ్ఞ తీరనున్న ప్రస్తుత సందర్భంలో కొత్తగా వెలుగు చూసిన డ్రాఫ్ట్‌ జాతీయ విద్యావిధానంలోని తప్పనిసరి హిందీ ప్రస్తావనపై దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు సారధ్యంలో నిరసన వెల్లువెత్తింది. హిందీయేతర రాష్ట్రాలలో ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీషు నేర్చు కోవాలనే ప్రతిపాదన, హిందీని బలవంతంగా రుద్దే ప్రతి పాదనకు అనుమాన అవకాశ మిచ్చింది. దక్షిణాదిన కర్ణాటక తప్ప తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఎన్‌డిఎ ప్రభుత్వం పట్ల వైముఖ్యం వ్ఞండటంతో కొత్తగా తలెత్తిన భాషావివాదం మరింత రాజకీయ వ్యతిరేకతగా పుంజుకొంది.2011 భాషా సంబంధిత సెన్మస్‌ ప్రకారం ఉత్తర, సెంట్రల్‌ ఇండియాలోని 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు హిందీకి ప్రప్రథమ ప్రాధాన్యత ఇస్తుండగా దక్షిణాది రాష్ట్రాలు హిందీ ఆధిపత్యం నిరసిస్తూ తమ మాతృభాషల అస్తిత్వం గురించి ఆందోళన చెందుతున్నాయి. 1968 పార్లమెంటు అధికార భాషా తీర్మానం అమలులో భాగంగా జాతీయ స్థాయిలో త్రిభాషా సూత్రం దేశమంతటా సక్రమంగా అమలు జరగడం లేదు. పైగా హిందీ మాట్లాడే రాష్ట్రాలు, దక్షిణాది భాషలను పట్టించుకోవడం లేదు. తమిళనాడు తప్ప హిందీయేతర రాష్ట్రాలలో కూడా హిందీ భాషకు కొంతయినా ప్రాధాన్యత లభిస్తోంది. హిందీపట్ల తమిళనాడులో ఉన్నంత వ్యతిరేకత అన్ని రాష్ట్రాలలో లేదు.

భిన్నత్వంలో ఏకత్వం జాతి ఆదర్శం

ఉత్తర భారతావనిలో హిందీ హార్ట్‌లాండ్‌లో 2019 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ఏ ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడవలసిన అవసరం లేని ఆధిక్యత సాధించింది. పూర్వపు ఐఎస్‌ఆర్‌ఒ ఛైర్మన్‌ కె. కస్తూరిరంగన్‌ కమిటీ నివేదిక ఇప్పుడు తెరపైకి రావటంతో భాషా రాజకీయ వైరుధ్యం స్పష్టమైంది. కాని వెనువెంటనే ఆర్థికశాఖా మంత్రిణి నిర్మల సీతారామన్‌, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇద్దరూ తమిళ సంబంధిత ప్రముఖులు కావటంతో పరిస్థితి తీవ్రత తలెత్తకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం కేంద్ర మానవ వనరులశాఖ, తదితర మంత్రివర్గ ప్రముఖులు తీసుకోవడంతో వివాదం సద్దుమణిగి చల్లారింది. అయినా త్రిభాషా సూత్రం తప్పదు. స్వాతంత్య్రానంతరం, జాతినేతలు, బహుభాషలు, సంస్కృతుల పూలహారంగా జాతీయత, పటిష్టంగా నెలకొల్పాలని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వం, పుష్పహారంలో దారంగా సమాదరణమైంది. విశాల భారతావనిలో వివిధ మతాలు, భాషలు, సంప్రదాయాలు, సంస్కృతులు కలిసిమెలిసి జాతి ఐక్యత, సమగ్రత జాతీయతా మహోన్నత నెలకొని ఉంది. భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి అధికార భాష హక్కు ప్రసాదించింది. క్రమేపీ మాతృభాషలపై నిరాదరణ కారణంగా ఆంగ్లభాషా ఆధిపత్యం ప్రస్తుత ప్రపంచ విద్యా, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి తదితర రంగాలలోకి చొచ్చుకొనిపోతోంది. అయినా మాతృభాషలను బతికించుకోవాలనే ప్రగాఢవాంఛ తలెత్తింది. ‘గ్లోబల్‌ విలేజ్‌గా ప్రపంచం శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో దూసుకుపోతుండటంతో, పాశ్చాత్య సంపన్న సమాజంవైపు యువతరం కదులుతున్నారు. 21వ దశాబ్ద ప్రపంచస్థితిగతులలో జాతీయతాభావైక్యత సాధించే కార్యాచరణలో హిందీని బలవంతంగా రుద్దటం వలన ఎటువంటి ప్రయోజనం సిద్ధించదు. పైగా అనవసర రాద్ధాంతం అవ్ఞతుంది.

  • జయసూర్య