క్యాంటీన్ల నిర్వహణలో లొసుగులు

డెబ్భైనాలుగోవ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు చతికిలపడుతున్నాయి. నిధుల లేమితో అభివృద్ధి కార్యక్రమాల పనులు నిమ్మకు నీరెత్తినట్లు సాగుతున్నాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం కారణంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకపోవడంతో అలానే రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మ్యాచింగ్‌ గ్రాంట్లు అందివ్వకపోవడంతో మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. అభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో కిందిస్థాయి నుంచి రావాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైన ఈ రాజ్యాంగ బద్ధసంస్థలు పన్నుల ద్వారా రాబడి వస్తున్నా విపరీతమైన అవినీతి వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

పన్ను కట్టే ప్రతి పౌరునికి జవాబుదారీగా ఉండాలనే నియమాన్ని మరిచి నేడు అనేక పర్యాయాలు నగర పాలక కార్యాలయాల చుట్టూ తిరిగినా పౌరులకు పనులు కాని పరిస్థితి నెలకొని ఉంది. పౌర చార్టర్‌ల ద్వారా జవాబుదారీతనం, పారదర్శకత పెంచే కృషి చేసినా నేటికీ ఉత్తమ సేవలను పొందే అవకాశం సామాన్య పౌరులకు అందని ద్రాక్షగానే ఉంది. అవినీతిని అరికట్టడానికి భవన నిర్మాణ పరిషన్లు మొదలుకొని నల్లా కనెక్షన్లు అందివ్వడం దాకా ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలలో దరఖాస్తు స్వీకరణకు ఆన్‌లైన్‌ వంటి సాంకేతిక తను ఉపయోగించుకోవడం జరుగుతుంది.

వార్డు కమిటీలను నిర్వీర్యం చేయడం ద్వారా చర్చకు రావలసిన ప్రజాసమస్యలు ముఖ్యమైన విషయాలు పక్కదారి పడుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు అనేక మున్సిపాలిటీలు విద్యుత్‌ బిల్లులు సైతం చెల్లించలేక బకాయిలుపడటం చూస్తూ ఉన్నాం. ఆడిట్‌లు కూడా నామమాత్రంగా జరుగుతుండడంతో ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం లేకుండాపోయింది. ఎన్నికలు లేని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో స్పెషల్‌ ఆఫీసర్లతో నెట్టుకువస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకుందామనుకుంటే అధికారులు అందుబాటులో ఉండటం కష్టమైపోయింది. అభివృద్ధి ప్రణాళికల్లో పట్టణ, స్థానిక సంస్థలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల అవసరాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వటంలో విఫలమవ్ఞతు న్నాయి.

సాంఘికంగా, ఆర్థికంగా దేశం పురోగతి సాధించాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాల రూపకల్పన జరగాల్సిఉంది. ప్రత్యేకంగా మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరాల అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాల్సిన అవశ్యకత ఉంది. పెట్టుబడులను పర్యాటకులను ఆకర్షించాలంటే ఆయా నగరాల్లో మౌలికవసతులతోపాటుగా, నమ్మకం,విశ్వాసం, భద్రత అనేవి కీలక భూమికలుగా పోషిస్తాయి.

మహానగరాలకు వలసలు పెరుగుతుండడంతో అక్కడి ఇంటిఅద్దెలు అధికంగా ఉన్నాయి. ఆదాయం సగభాగం ఇంటి అద్దెలకు పోతుండడంతో కుటుంబ పోషణకు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుంది. పనిచేసే ప్రదేశాలకు నిర్ణీత వేళలో చేరుకోవాలనే ఉద్దేశ్యంతో దగ్గర్లోని ఇళ్లని అద్దెకు తీసుకోవడంతో అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. మధ్యతరగతి, పేద,బడుగు, బలహీనవర్గాలకు సరైన ఆహారపోషణ అందించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రభుత సహకారంతో నడిచే క్యాంటీన్లు దినసరి వేతనా నికి పనిచేసే కార్మికులు మొదలుకొని మధ్యతరగతి వారివరకు ఆహార అవసరాలను తీరుస్తున్నాయి.

కేవలం ఐదునుండి10 రూపా యలకే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి వంటి నగరాల్లో భోజన సౌకర్యాలు కల్పించడంతో భోజన ఖర్చులు చాలావరకు తగ్గాయి. స్థానికసంస్థలు, స్వయం సహాయక బృందాలు, ఎన్‌జిఓ ల సమన్వయంతో నిర్వహిస్తున్న వీటిని మిగిలిన నగరాల్లో కూడా ప్రారంభించాల్సి ఉంది. తద్వారా పట్టణ పేదలకు ఆహార భద్రత సమకూరడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కొన్నినగరాల్లో ఈ క్యాంటీన్లు మూడుపుటలా ఆహారాన్ని అందిస్తుండగా మరికొన్ని క్యాంటీలు మధ్యాహ్నవేళల్లో మాత్రమే ఆహారాన్ని అందిస్తున్నాయి.

పిపిపి పద్ధతుల్లో నడుస్తు న్న క్యాంటీన్ల విషయానికివస్తే సుమారు 70శాతం వరకు వ్యయా లు స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తుండగా 20 శాతం వరకు వినియోగదారుల ద్వారా, మిగిలి నది సేవాసంస్థలు, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. సిఎస్‌ఆర్‌ నిధులను దీనితో అనుసంధానించడం ద్వారా మరెన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి.

నిర్వహణ, సమన్వయ బాధ్యతల్లో అస్పష్టతల కారణంగా ఆహార నాణ్యత తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ప్లేట్లు, వాటర్‌ప్యాకెట్ల సేకరణ, చెత్త నిర్వహణ సౌకర్యాల లేమి, చేతులు శుభ్రపరచుకోవడానికి నీటి సరఫరాలో లోపాలు వంటి సమస్యలు ఎదురవ్ఞతున్నాయి. పై సమస్యలకు పరిష్కార మార్గాలతోపాటుగా అసంఘటిత రంగంలోని కార్మికుల సౌకర్యార్థం ఆదివారంలో కూడా ఈ క్యాంటీన్లు నడిచేలా చూడడం, మహిళల భాగస్వామ్యం మరింత పెంచడం, కూర్చుని భోజనం చేసే ఏర్పాట్లు కల్పించడం ద్వారా ఇది మరింత మందికి ప్రయోజనకారి కాగలదు.

  • సముద్రాల వంశీకృష్ణ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/