సర్వమానవ సమానత్వం సాధ్యమేనా?

మానవ జీవితాలలో అనూహ్యమైన మార్పులు

Is universal equality possible

జాతి వివక్షత అనేది ఆంగ్లేయులు వ్యాపింపచేసిన అంటువ్యాధి అంటారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. 18వ శతాబ్దంలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం పేద, ధనిక వర్గాల మధ్య మరింత అగాధాన్ని పెంచింది. మానవ జీవితాలలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది.

వనరుల కొరత కారణంగా ఆంగ్లేయులు వ్యాపారం పేరుతో ఆఫ్రికా, ఆసియాలలోని పలుదేశాలకు వచ్చి విభజించు, పాలించు అను సిద్ధాంతంతో ఆయా దేశాలనుతమ వలస రాజ్యాలుగా మార్చుకొన్నారు.

శ్వేతజాతీయులు అందరికంటే తామే గొప్పవారమని, తాము ఇతర దేశాల ప్రజలను సంస్కరించడానికే వచ్చామని భావించారు.

వారి అధికార బలంతో అహంభావాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చారు. వారి హక్కులను కాలరాసారు.

1960 మార్చిలో దక్షిణాఫ్రికాలోని ప్రజలు తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జరుపగా 69 మంది మరణించారు.

వారి స్మారకార్థం ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్స రం అంతర్జాతీయ జాతి వివక్షతా వ్యతిరేక దినోత్సవంగా జరుపుతుంది. జాతిపిత మహాత్మాగాంధీ సైతం దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతను ఎదుర్కొన్నారు.

ఆంగ్లేయులు తమ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, ఇతర దేశాలలో మాత్రం నియం తృత్వాన్ని ప్రదర్శించి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారు.

నల్లజాతీయులను బానిసలుగా మార్చి వారిచేత వెట్టి చాకిరి చేయించారు. వారికి కనీసం విద్య,వైద్యపరమైన సౌక ర్యాలు కల్పించలేదు.అమెరికాలో మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూని యర్‌,ఆఫ్రికాలో నెల్సన్‌మండేలా వంటిమహనీయులు నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడారు.

1948లో ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కులప్రకటన చేసినప్పటికీ ఈ హక్కులు సమాజంలో ధనిక, ఆధిపత్య వర్గాలకే లభిస్తున్నాయి.

ఈ ప్రకటన ఆధారంగా ఆయా దేశాలు సర్వమానవ సమానత్వం కోసం పటిష్టమైన రాజ్యాంగాలను రూపొందించాయి. అయితే వాటి అమలు తీరులో లోపాల వలన పేదవారికి సమానత్వం ఇంకా అందనిద్రాక్షగానే మిగిలింది.

ఆంగ్లేయులు ఆసియా, ఆఫ్రి కా ఖండాలలోని అపార సంపదను దోచుకెళ్లడమేకాకుండా అక్కడ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను కూడా నాశనం చేశారు.

అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై తుపాకుల మోతఇంకా మోగుతూనే ఉంది.హక్కులు కోల్పోయిన నల్లజాతీ యులు కొందరు నేరస్తులుగా మారి ఉండవచ్చు.

అంతమాత్రాన వారందరినీ నేరపూరితలుగా చూడటం అమానుషం. మనదేశంలో కులవివక్షత వలన నిమ్నవర్గాల వారు హక్కులు కోల్పోయారు.

పూలే, డాIIబి.ఆర్‌.అంబేద్కర్‌ వంటి మహనీయులు వెనుకబడిన, నిమ్నవర్గాల వారి హక్కుల కోసం ఎనలేని కృషిచేస్తారు.

అయినా దేశంలో ఏదో ఒక రూపంలో బలహీనవర్గాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.

అబ్రహం లింకన్‌ నుండి అంబేద్కర్‌ వరకు ఎందరో సర్వమానవ సమా నత్వం కోసం కృషి చేసినప్పటికీ ఆకలి, అనారోగ్యాలే అల్పసంఖ్యాక వర్గాల ప్రజలకు ఆస్తులుగా మిగిలాయి.

  • యం.రాంప్రదీప్‌

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/