మాదకద్రవ్యాల అంతం అందరి పంతం

నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం

DRUGS
DRUGS

మా దకద్రవ్యాలు శారీరక మానసిక రుగ్మతలను కలిగించడమేకాక, నైతిక విలువలను దిగజారుస్తున్నాయి. హెరాయిన్‌, కొకైన్‌, ఎక్‌స్టనీ, మారిజువా, ఎల్‌.ఎస్‌.డి, కట్టమైన్‌ గామా హైడ్రాక్సీ బుటిరేట్‌ తదితర మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవి. ప్రతి సంవత్సరం జూన్‌ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలో 15 నుండి 70 సంవత్సరాల వయస్సువారిలో 30 కోట్ల మంది గత 12 నెలల్లో ఒక్కసారి అయినా ఏదో ఒక మాదకద్రవ్యాన్ని ఉపయోగించేవారేనన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. ప్రపంచ జనాభాలో 10 శాతం మంది మాదకద్రవ్యాలకు బానిసలై ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 70 నుండి 100వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నదని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. మాదకద్రవ్యాల వ్యాపారం వల్ల సంపాదిస్తున్న డబ్బు ఆసియా, ఆఫ్రికా దేశా లలో తిరుగుబాట్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగింప బడుతున్నదని అంతర్జాతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఆప్ఘనిస్థాన్‌లో ‘పాపి (నల్లమందు) బాగా పండిస్తారు. దీనివల్ల వచ్చే డబ్బుతో తాలిబన్‌ మొదలైన ఉగ్రవాదులు బలపడుతున్నారు. పాక్‌ గుఢాచార సంస్థ పాకిస్థాన్‌ సైన్యం, మాఫియా ఏకమై మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చే డబ్బును జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిజాన్ని పోషించడానికి ఉపయోగిస్తున్నారని పరిశీలకుల అభిప్రాయం. మనదేశంలో సుమారు 15 కోట్ల మంది మాదకద్రవ్యాలకు బానిసలైనారు. కొకైన్‌ వ్యాపారం భారత్‌లోనూ బాగా సాగుతుంది. కొకైన్‌ ఒక్క గ్రాము ధర సుమారు ఇరవైవేల రూపాయలు ఉంటుంది. మనదేశంలో సంవత్సరానికి 200 కిలోల కొకైన్‌ వినియోగింపబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మెదక్‌జిల్లా, పాడేరు, కర్నూల్‌, కడప మొదలైన ప్రాంతాలలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుందని ఎక్సైజ్‌ శాఖ రికార్డులలో ఉంది. వివిధ పంటలలో అంతర్‌ పంటగా గంజాయిని సాగుచేస్తున్నారు. వివిధ రవాణా మార్గాల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారు. గంజాయికి బానిసైన యువత ఆ మత్తులో తూలుతూ తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటుంది. మధ్యదళారుల ద్వారా కళాశాలల విద్యార్థులకు గంజాయిని సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. గంజాయిని సిగరెట్టు, చుట్టలలో పెట్టి విక్రయిస్తున్నారు. యువత ధూమ పానం సేవనంలో తేలిపోతూ తమను తామే మరిచిపోయి మృత్యువ్ఞకు చేరువ అవ్ఞతున్నారు. మాదకద్రవ్యాలను గూర్చి సంపూర్ణ అవగాహనను కలిగించడమే ఈ దినోత్సవ లక్ష్యం. 1987లో మాదకద్రవ్యాలు, వాటి అక్రమ రవాణాకు వ్యతిరే కంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో చేసిన ఒక తీర్మానాన్ని అనుసరించి ప్రతియేటా జూన్‌ 26న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. 1985లో భారత ప్రభుత్వం నార్కోటిక్‌ డ్రగ్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సె స్‌ చట్టాన్ని చేసింది. ఈ చట్టం ప్రకారం మాదకద్రవ్యాల ఉత్పత్తిదారులకు. వినియోగదారులకు కనీసం పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరోను ఢిల్లీలో 17.3.1986లో ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, అక్రమ రవాణాను అడ్డుకుందాం. ప్రభుత్వం, ఎక్సైజ్‌శాఖ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలి. ప్రతి కాలేజీ ముందు నిఘా ఏర్పాటు చేసి విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటుకాకుండా చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలి. మాదకద్రవ్యాల సేవనం వల్ల కలిగే అనర్థాలపై గ్రామాలలో, యువతలో విస్తృత ప్రచారం చేపట్టాలి. స్వచ్ఛందసంస్థలు, ప్రజాసంఘాలు భాగస్వాములు కావాలి. ‘మాదకవ్య్రాల అంతం మనందరి పంతం అనే నినా దాన్ని పాటిద్దాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.

  • కామిడి సతీష్‌రెడ్డి