ఆవిరైపోతున్న రైతుల ఆశలు

FARMER
FARMER

భ గభగ నిప్పులు కురిపి స్తున్న భానుడి ప్రతా పానికి విలవిల్లాడుతున్న ప్రజలు, వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతుల మనస్సుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. వెలవెలబోతున్న ప్రాజెక్టులు, తాగునీరు దొరకక మూగవేదనతో మూగజీవాలు. ఇది దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజల కంట కనిపిస్తున్న దృశ్యాలు. ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో సూర్యభగవానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.జూన్‌ వచ్చిందంటే చల్లని జల్లులతో నేలను తడిపే నైరుతి రుతుపవనాలు ఇటువైపు రావడానికి ముఖం చాటేశాయి. వర్షాలు కురుస్తాయనుకున్న రైతుల ఆశల మబ్బులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రుతు పవనాలు వస్తాయని కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. పొలాలు, దుక్కులు దున్ని అదనుకోసం ఎదురుచూస్తున్న కొంత మంది రైతులకు కష్టాలు తప్పేటట్టు లేవ్ఞ. ఈ పంటతోనైనా చేసిన అప్పులు కొంతనైనా తీరుతాయేమోనన్న ఆశతో ఉన్న రైతన్న వర్షాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. పాడిపరిశ్రమపైన ఆధారపడదామనుకుంటే కనీసం పచ్చగడ్డి వేసేందుకు కూడా వాతావరనం అనుకూలించకపోవడంతో బెంవేలెత్తిపోతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప తమకు గత్యంతరం లేదంటూ రైతన్నలు దేవ్ఞడిని ప్రార్థిస్తున్నారు. ఎన్ని అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు లేకపోవడంతో దుఃఖంతో ఉబికివస్తున్న కన్నీటిని ఆపలేక దిగాలు చెందుతున్నాడు. భారతదేశం గ్రామీణ దేశం. దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. వ్యవసాయం దేశానికి వెన్నుముక. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుంది. రైతన్న వ్యవసాయం చేయడం మానేస్తే దేశంలోని ప్రజలకు తినడానికి తిండికూడా దొరకదు. అలాంటి రైతన్నకు సామాజిక గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం అండగా నిలవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారనడంలో సందేహంలేదు. ప్రపంచానికి వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యత గల రంగం. ఈ రంగంలో అభివృద్ధిని సాధిస్తే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రైతు ప్రకృతిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాడు. రైతన్నలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఇతర స్వచ్ఛందసంస్థలు ముందుకురావాలి.

  • డా.అట్ల శ్రీనివాసరెడ్డి