ఉపాధికి ..ఉద్దీపనలేకాదు కఠిన చర్యలూ అవసరమే!

Employment requires stimulation and stringent action!
Employment requires stimulation and stringent action!

తాజా పారిశ్రామిక మాంద్యంతో కార్పొరేట్‌ వాహన రంగాల డిమాండ్ల మేరకు కేంద్రం భారీ ఉద్దీపనలు ప్రకటించింది. ఏ రంగంలోనైనా వినియోగం గరిష్టస్థాయికి చేరిన పిమ్మట నెమ్మదించడం సహజం. వాహనాల వినియోగ విషయాని కొస్తే ఇప్పటికీ మన ప్రజల స్థాయి, అవసరాలను మించి చౌకరుణాలతో వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మనది ఉష్ణమండలం, అధిక జనాభా, జనసాంద్రత ఉన్నదేశం. డ్రైవింగ్‌ సక్రమంగా రాని, తాగి, పిల్లల డ్రైవింగులతో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్‌ కాలుష్యాలతో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని జరుగుతుంది. తమ ఉత్పత్తుల డిమాండు తగ్గి నష్టాలొస్తే కార్పొరేట్‌ సంస్థలు మొదట లక్షల్లోనున్న ఉద్యోగుల జీతాలు, ఓటీలు కోట్ల రూపాయల్లో ఉన్న ఉన్నతాధిపతుల పారితోషికాలు, వృధా ఖర్చులు సాధ్యమైనంత తగ్గించుకోవాలి కానీ ప్రభుత్వరాయితీలు, చౌకరుణాలు కాదు. హాలెండ్‌, డెన్మార్క్‌, న్యూజిలాండ్‌ వంటి ధనిక యూరోపియన్‌ దేశాల్లో మంత్రులు, కోటీశ్వరులు సైతం సైకిళ్లు విరివిగా వాడుతుంటే మనపేదల దేశంలో మంత్రులు మందీ,మార్బలంతో వాహనశ్రేణిలో ప్రయాణిస్తుంటే అనుచరులనబడేవారు కడుపులో నీళ్లు కదలకుండా వాహన ర్యాలీలతో ప్రజలను ఇబ్బందులపాలు చేస్తుంటారు. ఇక తరచూ గల్ఫ్‌సంక్షోభాలతో ఇంధన ధరలు పెరుగుతుంటాయి.

మన విదేశీ మారకపు నిల్వల్లో అధికభాగం పెట్రోదిగుమతులకేపోతుంది. ఈ క్లిష్టపరిస్థితిలో అంతా మన మంచికే అని భావించి ప్రభుత్వ రవాణా పెంచి, వ్యక్తిగత వాహన వినియోగం, పెట్రోదిగుమతులు తగ్గిస్తే ఖజానాపై పెనుభారం తగ్గి రూపాయి బలపడుతుంది. ఇక గత 45 సంవత్సరాల్లో గరిష్టస్థాయికి చేరిన నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఉద్దీపనలతో కార్పొరేట్‌ రంగంపైనే ఆధారపడకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఖాళీగానున్న లక్షలాది ఉద్యోగ భర్తీలను చేపట్టాలి.

పెరిగిపోతున్న సంక్షేమ పథకాల్లో ప్రైవేట్‌, సంస్థల్లోని అవినీతి, అక్రమాలను నియంత్రించి పరిపాలన సజావ్ఞగా నడపాలంటే తగినంత యువ సిబ్బంది కూడా కావాలి. వేతనాలు భారం ఎక్కువైతే, తాత్కాలిక ప్రాతిపదికపై ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. అమెరికావలె అధికవేతనాలు, తక్కువ ఉద్యోగుల వ్యవస్థతో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వాలు ప్రజల సగటు ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అంతేకాక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయస్సు కూడా గతంలో వలె 58 సంవత్సరాలకు కుదించి, ఖాళీలను సత్వరమే భర్తీ చేస్తే లక్షలాది మంది పేద నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. ఇప్పటికీ బతుకుతెరువ్ఞ లేకుండా ఏటా ఐదారువేల మంది నిరుద్యోగులు నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడటం, సైబర్‌ నేరాలు పెరగడం చూస్తున్నాం.సామాజిక న్యాయం జరిగితేనే దేశంలోని వివిధ నేరాలు తగ్గుతాయి. జిడిపి, రెండెంకెల వృద్ధి, సెన్సెక్స్‌ పెరు గుదలతో సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీలేదు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్మార్ట్‌నగరాలు, హైవేలకేగాక, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు కూడా ప్రాధాన్యత పెంచి ఎక్కువ నిధులు విడుదల చేయాలి. వ్యవసాయం, పాడిపశువ్ఞల కొనుగోళ్లకు నామ మాత్రపు వడ్డీకే రుణాలు మంజూరు చేయాలి. సమగ్ర గ్రామీణా భివృద్ధితోనే పట్టణ వలసలు తగ్గుముఖం పడతాయి.

  • తిరుమలశెట్టి సాంబశివరావు

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/