ఏమైపోయారు? పటంచాకళ్లు!

Rajakulu (file)

దక్షిణ భారతదేశంలో వన్నన్‌, మన్నన్‌, మడేవాల,దోభిగా పిలువబడిన చాకలి కులానికి ఆశ్రితులుగా, ఉపకులంగా బసవేశ్వరుని కాలం నుండి 9 శతాబ్దాలు చాకలి కుల పురాణాన్ని గానం చేస్తూ,రాజుల కాలంలో రాగిసన్నత్‌ హక్కుపత్రంగా పొంది, జీవించిన పటంచాకళ్లు నేడు సుమారు లక్ష మంది జనాభా ఉండ వలసిన ఈ సాంస్కృతిక దళాలు కేవలం రెండు,మూడు వందల కుటుంబాలు మాత్రమే! తమ జాతి అవశేషాలుగా తెలుగుగడ్డపై నేడు వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే దర్శనం ఇవ్వడం వీరి దుస్థితిని తెలియచేస్తుంది.

1948 సంవత్సరం నుండి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో చాకలి కులం ‘రజక కులంగా నాటి ప్రభుత్వ గెజిట్‌లో పేరు మారిన తర్వాత కూడా పటంచాకళ్లు గంజి కూటి చాకళ్లు, చాకలి కులం ఉపకులాలుగా పేర్కొనబడి ఈ చారిత్రక కళాకారులు పౌరాణిక కులగానం నేడు మూగబోయింది. హిందూ సమాజం కోల్పోతున్న మూలాలకి వీరి దుస్థితి దర్శనంగా భావిం చవచ్చు! వీరికి బ్రాహ్మణవాద పిడివాదం వీరు పురాణగానం ఆలపించే గొంతును నొక్కి వీరిని కనుమరుగవ్ఞతున్న ఉపకులంగా లిఖించబడింది! తమ వంశాచారంగా వస్తున్న పటం( రంగులు అద్దబడ్డ గుడ్డ) ద్వారా ఆరుగురు సభ్యుల బృందం, పటం ద్వారా ప్రతి చాకలి గడ్డపై (శెట్టి పురాణం) సృష్టి పురాణం, శివపురాణం, శివ పార్వతుల కళ్యాణం, వీరభద్ర విజయం, మడేలు పురాణా లను కొన్ని శతాబ్దాలు తెలుగుగడ్డపై ఆలపించిన సాంస్కృతిక కళాబృందాలు, పటం చాకాళ్లు.

వివిధ కులాల ఉపకులాలు నేడు కూడా సంచార తెగలుగా ఎస్టీ,ఎస్సీ, ఎమ్‌బిసి, సామాజిక కేటా యింపులలో స్థానం పొంది ఉండటం పటంచాకళ్లు మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఎమ్‌.బి.సిలుగా గుర్తిస్తారని ఆశపడుతున్నారు. రజక కుల వృత్తి లేక, కేవలం చాకలి కులం ఆశ్రితులుగా జీవించిన వీరిని ఆదరణ కోల్పోతున్న సంచారు జాతిగా గుర్తించవలసిన నైతిక ధర్మం పాలకులపై ఉంది. తమ కుల గురువ్ఞలుగా తమ కుల గానాన్ని 9 శతాబ్దాలు కీర్తించిన తమ ఆశ్రిత ఉపకులానికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రజక కులంపై ఉంది. తెలుగుగడ్డపై నేడు సుమారు 70 లక్షల మంది రజక జనాభా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో 25 లక్షల జనాభా ప్రభుత్వ లెక్కలలో కనిపిస్తున్నారు.

నవ్యాంధ్రలో పటంచాకళ్లు జాడకనిపించడం లేదు. ఈ పరిణామక్రమ దుస్థితిలో రజకుడిని ఇంటి పెద్దబిడ్డగా భావించి ఆదరించే సంస్కృతి కలిగిన రాయలసీమ బిడ్డగా నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ ఆచారంగా రజక కుటుంబానికి సంవత్సరానికి 10వేలు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి నెల్లూరు జిల్లా తడ వరకు రజక జాతికి తరతరాలుగా సంక్రమిస్తూ వస్తున్న ఈనాం భూములు, వృత్తిమాన్యాలు, శ్రోతియం భూములు రాబందులు హస్తాలలో నలిగి, నలిగి రెవెన్యూ రికార్డులలో తారుమారైవ్ఞన్న సుమారు 25వేల ఎకరాల భూమిని ప్రభుత్వ రికార్డులలో దేవస్థానం రికార్డులలో సరిచేస్తే అదే పదివేలు.నాటి బ్రాహ్మణవాదం, నేటి ఆధునీకరణ శాపమై నిరాదరణతో తమ కులగానం మరిచి, అపురూపమైన సాంస్కృతికి కళాబృందాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతూ కనుమరుగైపోవడం కూడా శోచనీయం.

ఇది ముమ్మాటికి సామాజిక విషాదకరం! రాజుల రాజ్యాలలో హక్కుపత్రాల ద్వారా జీవించిన పటంచాకళ్లు అవశేషాలుగా, గంజికూటి చాకళ్లు గల్లంతై ఉండగా, ముస్లిం పాలనలో ‘ముస్లిం దోభిలు అవతరించి ముస్లిం ఉపకులంగా, అలాగే బ్రాహ్మనాయుడు కాలంలో పుట్టిన మాలచాకళ్లు ఎస్సీ ఉపకులాలలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో పటంచాకళ్లు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. వీరిని కనుమరుగవ్ఞతున్న జాతిగా భారత ప్రభుత్వం గుర్తించాలి. నేడు పౌరసత్వ చట్టంపై పోట్లాడే పార్టీలువిదేశీ రోహ్యింగుల కోసం కొట్లాడే పార్టీలు వాటి శాఖలు భారత అంతర్భాగంలో పుట్టి, అంతరంగంగానే జీవిస్తూ నేడు కనుమరుగువ్ఞతున్న సాంస్కృతిక జాతులపై దృష్టి పెట్టాలి. లేకపోతే మన జాతిని మనమే మరచిపోతున్న సామాజిక ద్రోహులుగా భావితరాలు మనల్ని ఈషడించుకుంటాయి.

80వ దశాబ్దంలో ఎన్‌.టి.ఆర్‌ ఆరంభించిన రజక ఫెడరేషన్‌కు నేదురమల్లి జనార్ధన్‌రెడ్డిగారు మొదటిసారి కృష్ణాజిల్లా వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించారు. కాలక్రమేణ గత మూడు దశాబ్దాలలో అనేక మంది నిర్వహించగా కాందిశీకుడైన బర్మాదేశస్తుడిని, వలసల ద్వారా వచ్చిన వారిని రజక ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా, డైరెక్టర్లుగా నియమించి మాజీ ముఖ్యమంత్రి రజక జాతి తిరోగమనానికి, స్థానిక విచ్ఛిన్నతికి పీఠం వేశారు. ఈ రాజకీయస్థితి, రజకజాతి అనిశ్చితికి, అనైక్యతకు దారితీస్తుంది. పాలకుల నిర్లక్ష్యానికి జాతి నిర్వీర్యానికి దారితీస్తుంది.

80వ దశకం వరకు తెలుగుగడ్డపై రజకజాతి ఆశ్రితులుగా ఉపకులంగా తమకుల గానాన్ని వినిపించిన అమాయక పటంచాకళ్లను గుర్తించాలి. వీరికి సంక్షేమ ఫలాలు అందించాలి. తెలంగాణ బిసి కమిషన్‌ ఇలాంటి హిందూ సాంస్కృతిక తెగలను గుర్తించి గౌరవించి జీవనమార్గాన్ని, వసతులు కల్పించాలి. అంతరించిన 300 లిపిలేని భాషలు మాదిరిగా సామాజిక ఉపకులాలు సాంస్కృతిక తిరోగమనానికి పాలకులు పాటు పడవద్దు.

వింజమూరు మస్తాన్‌బాబు
(రచయిత: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్‌ రజక అభివృద్ధి సంస్థ-

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/