బొగ్గుతో మానవాళికి ముప్పు!

Coal Mining
Coal Mining

భారతదేశంలో భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. వీటిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పర్యావరణ నిపుణుల హెచ్చరికల్ని ఖాతరు చేయడం లేదు. తగినంత బొగ్గు దేశీయంగా లభ్యం కాకపోవడంతో ఆస్ట్రేలియా, మలేషియాల నుంచి పెద్దఎత్తున దిగుమతులకు కూడా వెనుకాడటం లేదు. ఇందుకోసం ఆయా దేశాల్లోని భారీ బొగ్గు గనుల్ని ఇప్పటికే భారత్‌కు చెందిన విద్యుత్‌ పారిశ్రామికవేత్తలు చేజిక్కించుకున్నారు. అక్కడ బొగ్గు తవ్వితీసి సముద్రం ద్వారా ఇక్కడకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ బొగ్గు దిగుమతిని దృష్టిలో పెట్టుకుని గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం నుండి పోర్టుల్ని మరింత విస్తరించారు.

ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంపై అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై ఆంక్షలు విధించాయి. ఉత్పత్తిని నెమ్మదిగా తగ్గించుకునేందుకు సిద్ధపడు తున్నాయి. ఈ మేరకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ఉత్తర్వుల్ని కూడా విడుదల చేశాయి. గత దశాబ్దంలో అమెరికాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు బొగ్గు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయి. విద్యుత్‌ అవసరాలకు అణుఇంధనంపై ఆధారపడు తున్నాయి. అణుఇంధన ఉత్పత్తికి తగినంత థోరియం భారత్‌లో అందుబాటులో ఉంది. అవసరమైన యురేనియం సరఫరాకు రష్యాతో సహాపలు దేశాలు ముందుకొస్తున్నాయి. మూడు దశాబ్దాల పాటు భారత్‌పై కొనసాగిన ఆంక్షల్ని గత ఏడాదే అంతర్జాతీయ సమాజం సడలించింది. అయినప్పటికీ మన పాలకులు ప్రత్యామ్నాయ విద్యుత్‌ ఉత్పాదక వ్యవస్థపై దృష్టిపెట్టడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తమవంతు సహకారం అందించాలన్న ఆకాంక్ష వీరిలో వ్యక్తం కావడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి వినియోగాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడ్డాయి. అంతకుముందు కేవలం జల విద్యుత్తే అందుబాటులో ఉంది. కానీ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా జలవిద్యుత్‌ ఉత్పత్తి వృద్ధికాలేదు. దీంతో కేంద్రం జాతీయస్థాయిలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ కేంద్రాలను నెలకొల్పింది. నాలుగు దశాబ్దాల తర్వాత సరళీకృత ఆర్థికవిధానాల నేపథ్యంలో విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేట్‌ పెట్టుబడులకు కేంద్రం తలుపులు తెరిచింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు విద్యుత్‌ కేంద్రాలు పెద్దఎత్తున ఏర్పాటవ్ఞతున్నాయి. గత దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వినియోగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి.

ఇందుకు కారణం వేడెక్కుతున్న పర్యావరణం, జీవజలాలపై దాని ప్రభావం. బొగ్గు విద్యుత్‌ కేంద్రాల వల్ల పర్యావరణంలోకి కార్బన్‌ డైయాక్సైడ్‌ విపరీతంగా విడుదలవ్ఞతోంది. ఇది ఉష్ణోగ్రతల్ని పెంచుతోంది. గాలిలో తేమ శాతాన్ని తగ్గిస్తోంది. ఈ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును 2400 సెంట్రిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో మండిస్తారు. అనంతరం దాన్ని చల్లబర్చేందుకు నీటిని వినియోగిస్తారు. ఈ నీటిని తిరిగి వాతావరణంలోకి విడుదల చేస్తారు. కూలెంట్‌గా ఉపయోగపడే ఈ నీరు అత్యధిక ఉష్ణోగ్రతతో వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇది గాల్లోకి ఆక్సిజన్‌ను హరిస్తోంది. ఇది ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. మనిషి జీవక్రియను కూడా చంపేస్తుంది.

జీవ్ఞల్లో అనూహ్య శారీరక మార్పులకు కారణమవ్ఞతోంది. మనిషి మెటబాలిజమ్‌ను నిర్వీర్యం చేస్తుంది. ఎంజైమ్స్‌ విడుదలను నిలిపివేస్తుంది. వాతావరణంలో టాక్సిన్స్‌ని పెంచుతోంది. ఇవి విపరీతమైన రేడియేషన్‌ను కలిగి ఉంటాయి. జీవ్ఞల్లో కేన్సర్‌ కారక క్రిముల్ని ప్రేరేపిస్తాయి. వాతావరణ మార్పులు జీవ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఇప్పటికే పలురకాల జీవరాశులు ఈ వాతావరణ కాలుష్యంతో కనుమరుగయ్యాయి. వాతావరణంలో ఈ విషపదార్థాలు జీవ్ఞల్లో పునురుత్పత్తి సామర్థ్యాన్ని హరించేస్తున్నాయి. ఇది కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో భూమి ఉష్ణమండలంగా మారిపోతుందన్న భయం ప్రపంచానికి పట్టుకుంది.

ఇప్పటికే ఏటా 15 కోట్లమంది శిశువ్ఞలు పూర్తిగా పురుడుపోసుకోకముందే ఈ వాతావరణ కాలుష్యం కారణంగా చనిపోతున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాతావరణ కాలుష్యంలో మూడింట ఒకొంతుకు బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలే కారణమని తేల్చారు. దీంతో గత దశాబ్దకాలంలోనే పలు దేశాలు బొగ్గు వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఆఖరుకు అమెరికా కూడా నిర్ణీత వ్యవధిలో మొత్తం బొగ్గు వినియోగాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అమెరికా పారిశ్రామిక కాలుష్యంలో 75 నుంచి 82 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల వల్ల జరుగుతున్నట్లు గుర్తించారు. 2000వ సంవత్సరం నుంచే అమెరికాలో బొగ్గు వినియోగాన్ని తగ్గించారు. 2014 వరకు ఏటా 176 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చొప్పున వినియోగాన్ని తగ్గించుకున్నారు. అలాగే కెనడా ఈ 14 ఏళ్లలో ఏటా 21 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, స్పెయిన్‌ ఏటా 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వినియోగాన్ని తగ్గించాయి.

అమెరికా అయితే బొగ్గు ఉత్పత్తికి ఇస్తున్న సబ్సిడీల్ని పూర్తిగా రద్దు చేసింది. వీటితోపాటు పరస్పర ఆర్థిక అభివృద్ధి సహకార సంఘంలోని పశ్చిమ ఐరోపాకు చెందిన మొత్తం 34 దేశాలు కూడా బొగ్గు వినియోగాన్ని 2020 నాటికి పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించుకున్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన గ్రీన్‌పిన్‌ సంస్థ అయితే 2090 నాటికి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు వినియోగాన్ని రద్దు చేయాలని భావిస్తోంది.

ఇందుకనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి ఒత్తిళ్లు తెచ్చిమరీ అమలు చేయిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులు, హృద్యోగాలు, ఆస్తమాలకు ప్రధాన కారణం బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఉత్పత్తవ్ఞతున్న విషపూరిత రసాయనాలేనని మార్క్‌జడ్‌జాకబ్సన్‌ అనేశాస్త్రవేత్త 20ఏళ్ల పాటు పరిశోధించి ఐక్యరాజ్యసమితికి నివేదిక సమర్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం బొగ్గు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి బదులుగా అణువిద్యుత్‌ను ప్రోత్సహించాలి.

-పుట్టా సోమన్నచౌదరి