ఆందోళనలో తల్లిదండ్రులు.. చోద్యం చూస్తున్న పాలకులు

ఒక్కమాట
(ప్రతి శనివారం)

Children Studies
Children Studies

విద్యను వ్యాపార వస్తువ్ఞగా మార్చి అంగడి సరుకుగా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశాలు కల్పించిన పాలకులను నిలదీయాలి. ఇప్పటికైనా ప్రభుత్వపెద్దలు కళ్లు తెరవాలి. కమిటీలతో కాలం పొద్దు పుచ్చడం న్యాయం కాదు. కొత్తచట్టాలు తీసుకువస్తామంటూ భయపెట్టాలనుకున్నా ఆ రోజులు పోయాయి. ఉన్న చట్టాలు అమలు చేయలేనివారు కొత్త చట్టాలు ఎలా తెస్తారు? తెచ్చినా అమలు చేస్తారంటే నమ్మకం కలగదు. ఒకవేళ కొత్త చట్టాలు తెచ్చి అమలుకు ప్రయత్నించినా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోలేని అమాయకులు కాదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు చట్టంలోని లొసుగులను వాడుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషించక మానదు. ఇప్పుడు కావాల్సింది కమిటీలు, చర్చలు, కొత్త చట్టాలు హెచ్చరికలు, పత్రికావిలేకరుల సమావేశాలు, ప్రకటనలు కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఏయే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నారో తెలియందికాదు. అది తెలుసుకోవడం పెద్దకష్టం కూడా కాదు. ఇప్పుడు కావాల్సింది అలాంటివారిపై త్రికరణ శుద్ధిగా కఠినమైన చర్యలు తీసుకునే సత్తా పాలకులకు ఉందా? లేదా అనేదే ప్రశ్న.
ఆ శ అత్యాశగా మారితే అక్రమాలకు, అవకతవకలకు, అవినీతికి అడ్డూఅదుపు ఉండదంటారు. అత్యాశ కాస్తా దురాశగా రూపాంతరం చెందితే ఎలాంటి దుష్పరిణామాలు దాపురిస్తాయో వేరే చెప్పక్కర్లేదు. దురదృష్టం కొద్దీ ఈ పరిస్థితులు విద్యావిధానంలో చోటుచేసుకున్నాయి. రాత్రికిరాత్రే కోట్లు సంపాదించి తెల్లవారే సరికి కుబేరులుగా అవతారాలెత్తాలని ఆరాటపడే కొందరు దురాశాపరులు మొత్తం విద్యావ్యవస్థ ప్రమాణాలనే అడుగంటిస్తున్నారేమోననిపిస్తున్నది.అధ్యయనంతో విజ్ఞానం ఆర్జించి, పరిశోధనతో, మేధాసంపత్తిని పెంచి సమాజ అభ్యున్నతికి ఉపయోగపడేలా విద్యార్థినీ విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉండాల్సిన విద్యావిధానాన్ని వ్యాపార వస్తువ్ఞగా మార్చే శారు. లక్ష్మీప్రసన్నులకే సరస్వతీకటాక్షం అన్నట్లుగా పరిస్థితి దాపురించింది. డబ్బున్నవారికే నాణ్యమైన విద్య లభిస్తుంటే సామాన్యులకు ఆ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. విద్యను కొనుక్కునే సంప్రదాయం రానురాను పెరిగిపోతున్నది. వాస్తవంగా జూన్‌ ఒకటి నుంచి ప్రారంభం కావలసిన ఈ విద్యా సంవత్సరం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 11 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవ్ఞలను పొడిగించింది. అయితే ఫీజు వసూలు చేసే కార్యక్రమం మాత్రం ఏప్రిల్‌, మే నుండే కొన్ని విద్యాసంస్థలు మొదలుపెట్టాయి. ప్రభుత్వాధికారులు హెచ్చరికలు చేస్తున్నా, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు ఏ రూపంలో వసూలు చేసినా చర్యలు తప్పవని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నా కొన్ని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. వారు ఎంత చెప్తే అంత చెల్లించాల్సిందే. లేకుంటే టీసీ తీసుకొని వెళ్లండని బెదిరిస్తున్నారు. అసలు ఆ ఫీజులు ఎందుకు పెంచారో? అందుకు శాస్త్రీయత ఏమిటో తెలియదు. విద్యాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నది.ఏ తల్లిదండ్రులను కదిలించినా పెరుగుతున్న పాఠశాలల ఫీజులపై ఆవేదన, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకోలేనంతగా పెరుగుతున్న రుసుములపై హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం, బాలల హక్కుల సంఘానికి ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇక ఇంటర్నేషనల్‌ పేరిట కొన్ని పాఠశాలలు ఫీజుల పెంపుపై బరితెగిస్తున్నాయి. రుసుముల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆచార్య తిరుపతిరావ్ఞ కమిటీ 2017 డిసెంబరు లోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. ఆ నివేదికపై పాలకులు ఇప్పటివరకు ఒకస్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. 2017-18 విద్యాసంవత్సరంలో వసూలు చేసిన రుసుములనే 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజులు వసూలు చేయాలని గత ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు హైకోర్టును ఆశ్రయిం చాయి. అధికంగా తీసుకునే రుసుములను ప్రత్యేక ఖాతాలో జమచేయాలని హైకోర్టు తీర్పుచెప్పింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఏ పాఠశాల యాజమాన్యమైనా తాము అధికంగా వసూలు చేసిన ఫీజులను ప్రత్యేక ఖాతాల్లో ఉంచారా? లేదా? అనే విషయంపై ఈనాటికీ తనిఖీ చేసినట్టు లేదు. ఈ ఫీజుల పెంపుపై ఆందోళ నలు కూడా జరుగుతున్నాయి. ఇవి రాష్ట్రమంతా వ్యాపించే సూచ నలు కన్పిస్తున్నాయి. పెంచిన ఫీజులు చెల్లించలేక ప్రజలు పడు తున్న ఇక్కట్లు పాలకులకు తెలియదా? కమిటీలు వేయాల్సిన అవసరం ఉందా? పాలకుల్లో త్రికరణశుద్ధి ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అనే అనుమానాలు రాకతప్పవ్ఞ. ఈ కమిటీలు, అధ్యయనాలు, నివేదికల వల్ల తెగేది తెల్లరేదీ ఏమీ లేదనేది చాలా మందికి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ కమిటీ ముందుకు కూడా చాలా మంది వాస్తవాలు చెప్పేందుకు రావడం లేదు. ప్రైవేట్‌ విద్యావ్యాపారం అధికారులు అదుపు చేయలేనంత స్థాయికి ఎదిగిపోయింది. చివరకు ఎలాంటి అనుమతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ అనధికారికంగా పాఠశాలలు నడుపుకుంటుంటే కళ్లుమూసుకున్న అధికారగణాన్ని ఏమనాలి? ప్రైవేట్‌ విద్యాసంస్థ యాజమాన్యాలే అటు పాలకులను, ఇటు అధికారులను నియంత్రిస్తున్నారేమోననిపిస్తుంది. ఈ వ్యాపారం ఇంత బరితెగించిపోవడానికి ముందుగా నిందించాల్సింది ప్రభు త్వాన్నే. సామాన్యులే కాదు, రోజువారీ కూలీలు సైతం ప్రైవేట్‌ విద్యపై మొగ్గుచూపుతున్నారు. అవ్ఞనన్నా కాదన్నా ఏ అవకాశం లేక ఆర్థికస్తోమత లేనివారే మరో గత్యంతరం లేక విధిలేని పరిస్థితుల్లో సర్కారు బడులకు పంపుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. హైదరాబాద్‌లోనే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో గత మూడేళ్లలో వంద నుండి రెండువందల శాతం ఫీజులు పెంచిన యాజమాన్యాలున్నాయి. ఏడాదికి ఐదో, పదో శాతం పెంచితే అర్థం చేసుకోవచ్చు. వంద, రెండువందల శాతం పెంచితే ఏమ నుకోవాలి? అంతేకాదు పుస్తకాలు కూడా తాము చెప్పినవే, తమ వద్దనే, తాము నిర్ణయించిన ధరలకే కొనాలనేది కొన్ని పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు విధిస్తున్నాయి. స్కూలు యూని ఫారం దుస్తుల ఎంపిక నుండి చివరకు బ్యాడ్జీల అమ్మకాల్లో కూడా కమిషన్‌లకు అలవాటుపడిన యాజమాన్యాలు లేకపోలేదు. ఈ దోపిడీ ఒక్క పాఠశాలలకే పరిమితం కాలేదు. జూనియర్‌ కాలేజీలు, ప్రొఫెషనల్స్‌ కాలేజీల్లో కూడా తారాస్థాయిలో ఉంది. ఇంత బాహాటంగా దోపిడీ జరుగుతున్నా పాలకులు పట్టించుకోక పోవడం వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణ కొట్టిపారేయలేం. చట్టాలు లేవని కాదు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా పాలకులకు ఉందా అనేదే ప్రశ్న. అధిక ఫీజులు వసూలు చేయడం ఇప్పటికిప్పుడు ప్రారంభం కాలేదు. ఏనాటి నుంచో కొనసాగుతున్నా ఇప్పుడు అదుపు లేకుండాపోతున్నది. ఈ విషయంలో 1983లోనే చర్యలు తీసుకోవాలని ఆనాటి పాలకులు పావ్ఞలు కదపడం ఆరంభించారు. అప్పట్లోనే కొన్ని నిబంధనలు విధించారు. క్యాపిటేషన్‌ పేరుతో వసూలు చేస్తున్న కొన్ని సంస్థలపై చర్యలు తీసుకోవడం ఆరంభించారు. అయితే కొందరు రాజకీయ పెద్దల జోక్యంతో అది మధ్యలోనే ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత 1994లో ఏకంగా ఒక జివో జారీ చేశారు. ఆ తర్వాత ఎన్నో ప్రకటనలు. కానీ అవన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలని తేలిపోయింది. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ 2007లో ఎనిమిది మంది సభ్యులతో కమిటీ నియమించారు. ఆ కమిటీ సమగ్ర అధ్యయనం తర్వాత ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆయా స్కూళ్లు కల్పిస్తున్న సౌకర్యాల ప్రకారం ఎ,బి,సి, అంటూ మూడు కేటగిరిలుగా పాఠశాలలను విభజించారు. దీనిప్రకారం ఏయే స్కూళ్లు ఎంతెంత ఫీజు వసూలు చేయాలని సూచిస్తూ ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఇప్పటిదాకా దాని అతీగతీలేదు. కొంతకాలం అవి ఎలా అమలు చేయాలో సూచించేందుకు కూడా మరో కమిటీని వేశారు. ఈ కమిటీలు అన్నీ కాలయాపన కోసమేననేది అందరికీతెలిసిందే. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఏకంగా ముగ్గురు కేబినెట్‌ మంత్రులు పత్రికావిలేకరుల సమావేశం పెట్టి ఇక నుంచి అధిక ఫీజులు వసూలు చేసేవారిపై ఉక్కుపాదం ఉంటుందని బహిరం గంగా ప్రకటించారు. కానీ ఫీజుల వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి. వారు ఎందుకు అలా మాట్లాడుతు న్నారో తమకు తెలుసు, వారికీ తెలుసు అన్నట్లుగా కొన్ని ప్రైవేట్‌ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఏ ఒక్క సంస్థపై పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవ్ఞ. ఇందుకు ప్రైవేట్‌ యాజమాన్యాలను తప్పుపట్టాల్సిన పనిలేదు. విద్యను వ్యాపార వస్తువ్ఞగా మార్చి అంగడి సరుకుగా స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశాలు కల్పించిన పాలకులను నిలదీయాలి. ఇప్పటికైనా ప్రభుత్వపెద్దలు కళ్లుతెరవాలి. కమిటీలతో కాలం పొద్దుపుచ్చడం న్యాయం కాదు. కొత్తచట్టాలు తీసుకువస్తామంటూ భయపెట్టాలనుకున్నా ఆ రోజులు పోయాయి. ఉన్న చట్టాలు అమలు చేయలేనివారు కొత్త చట్టాలు తెచ్చి ఎంచేస్తారు? తెచ్చినా అమలు చేస్తారంటే నమ్మకం కలగదు. ఒకవేళ కొత్త చట్టాలు తెచ్చి అమలుకు ప్రయత్నించినా ఎలా తప్పించుకోవాలో తెలుసుకోలేని అమాయకులు కాదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు చట్టంలోని లొసుగులను వాడుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషించక మానదు. ఇప్పుడు కావాల్సింది కమిటీలు, చర్చలు, కొత్త చట్టాలు హెచ్చరికలు, పత్రికావిలేకరుల సమావేశాలు, ప్రకటనలు కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఏయే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నారో తెలియందికాదు. అది తెలుసుకోవడం పెద్దకష్టం కూడా కాదు. ఇప్పుడు కావాల్సింది అలాంటి వారిపై త్రికరణశుద్ధిగా కఠినమైన చర్యలు తీసుకునే సత్తా పాలకులకు ఉందా? లేదా అనేదే ప్రశ్న.

  • దామెర్ల సాయిబాబ