బాలగోపాల్‌ గాంధేయవాదా! నక్సలైటా?

నేడు బాలగోపల్‌ వర్థంతి

Prof. Balagopal (File)

కృషి ఉంటే మనుషులు రుషులౌతారోలేదో కానీ, మహాపురుషులు మాత్రం అవ్ఞతారు. వ్యవస్థాగతంగా, వ్యక్తిగతంగా, సంస్థాగతంగా మంచి పేరుతో చెడు చేసి బలాదూర్‌గా చెలామణి అయ్యే నేటి వ్యవస్థలో నూటికో, కోటికో నికార్సైన వాళ్లు పుడతారు. చరిత్ర పుటలపై చెరగని ముద్ర వేస్తారు. అప్పుడే తెలుస్తుంది ఉద్యమాల పేరుతో అమ్ముడుపోయే వాళ్లు అసలైన వాళ్లకు తేడా. స్వచ్ఛమైన మనస్సుతో స్వేచ్ఛకోసం పోరాడి, అమరుడైన అరుదైన వ్యక్తి బాలగోపాల్‌. బాలగోపాల్‌ అంటే ప్రతి మనిషికి తెలియకపోయినా దేశంలో, రాష్ట్రంలో ప్రధాన సమస్యలకు ఆయన తెలుసు. ప్రజల సమస్యలు ఎక్కడుంటే, బాలగోపాల్‌ అక్కడుండేవారు. దిక్కుమొక్కులేని జనానికి ఆయనే పెద్దదిక్కుగా అండగా నిలబడ్డారు. అందుకు ఆయన కుహనా ఉద్యమకారుల్లా, ఆర్భాటానికి ప్రచార పటోటానికి దూరంగా ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, సేవే ధ్యేయంగా ప్రజలపక్షం వహించారు. ఇంతటి గొప్ప మానవతా వాది, మేధావి, ప్రజల మనిషి ఆకస్మిక మరణం అందరిని కలచి వేసింది. ‘మానవ హక్కులు లక్కుగా వ్యవస్థ నుంచి అందుతున్న నేపథ్యంలో మూడు దశాబ్దాలు హక్కుల ఉద్యమానికి ఊపిరి లూదారు. తన తుదిశ్వాస వరకు మానవ హక్కులు పేద ప్రజలపైనే ఆయన ప్రేమ, ధ్యాస. హక్కులకు అడ్డుతగిలిన ప్రతిచోట, చెట్టు, పుట్ట, రాళ్లు రప్పలు లెక్కచేయకుండా ప్రతి గ్రామానికి ఆయన పయనం సాగింది. వ్యవస్థమీద ఎక్కుపెట్టిన హక్కుల ఉద్యమంలో కొంత సాధించారు. మరికొంత న్యాయపోరాటం చేశారు. అందుకు ఆయన అధ్యయన, పరిశీలన, పర్యటన అనే మూడు మార్గాలు ఎంచుకున్నారు. ఈ మూడింటిలో ఎన్నో కష్టనష్టాలను ఒడిదుడుకులను తెగించి ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆరోగ్యాన్ని ఆదమరిచారు. తాను ఎంతకాలం బతుకుతాడో తెలియనంత మొండిగా తన ఆశయం కోసం కృషి చేశారు. ఎన్నో పోలీసు బెదిరింపులే కాకుండా గ్రీన్‌ టైగర్స్‌ పేరుతో చావు చివరి అంచులకు వెళ్లి వెరవక, రాజీపడకుండా హక్కులసాధనంలో రాటుదేలారు.బాలగోపాల్‌ గ్రేట్‌ మ్యాథమేటిషియన్‌. ఇరవై ఏడేళ్ల వయస్సులో పదిహేడు నెలల్లో ఆర్‌ఈసి వరంగల్‌లో పిహెచ్‌డి చేసిన గొప్ప మేధావి. లెక్కల చిక్కుముడులిప్పే జీనియస్‌లంతా, ప్రతిపనిని తార్కికంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, కార్యాచరణ సంబంధం ఎరిగి చేస్తారట. అది బాలగోపాల్‌ విషయంలో నిజమైంది. దానికితోడు మార్క్సిజం లెనినీజం పై అధ్యయనం ఆయన మెదడుకు మరింత పదునుపెట్టాయి. ఆయన నిశిత పరిశీలన సమాజం లోతుల్లోకి దించింది. ఆ లోతుల్లోనించి వచ్చిన ప్రజల ఆవేదన, గుండెచప్పు డులు హక్కుల ఉల్లంఘన, వ్యవస్థలో లోపాలు అన్నిపత్రికల్లో ఆవిష్కరించారు. బాలగోపాల్‌ ఏ సమకాలీన సమస్యపైన వ్యాసం రాసినా, మాట్లాడినా,మీడియా పండితులు దాని తూకపు రాయిగా ప్రామాణికంగా తీసుకునేవారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకూడదని ఆయన జీవితంలో రుజువయ్యాయి. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. తన ప్రతిభ, సామర్థ్యం మేధస్సుతో జీవితానికి కావల్సిన హంగులు సౌకర్యాలు సమకూ ర్చుకోగలరు.హ్యాపీగా, సాఫీగా జీవితాన్ని అవలీలగా కొనసాగించ వచ్చు.కానీ కావాలని ఏరికోరి సామాన్యుడికష్టాల నివారణకు హక్కుల ఉద్యమాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే పని మానుకుని, సామాజిక సమస్యలపై హక్కుల ఉల్లంఘనపై పత్రికల్లో పాఠాలు చెప్పి సమాజాన్ని చైతన్య పరిచారు. కాశ్మీర్‌ సమస్య నుంచిరైతుల ఆత్మ హత్యలు,ఎన్‌ కౌం టర్‌లు,సెజ్‌లు, లాకప్‌డెత్‌లు, పోలీసుల దాష్టీకం, మహిళలపై అత్యాచారాలు, బల హీన వర్గాల హక్కుల ఉల్లంఘన తదితర విషయాలు నిశిత పరి శీలనతోలోతైన అవగా హనతో ఆయన రాయని పత్రిక, మాట్లా డని వేదికలేదు.సనాతన పండిత కుటుంబంలో పుట్టినా దళితులు, ఆదివాసీలకు ఆయన సహవాసి.అనంతపురంలో పుట్టినా, వరంగల్‌ వాసులతో వివిధ జిల్లాలోని గిరిజనులతో ఆయన విడదీయరాని బంధం.ఆయన మరణాంతరం ఆయన విగ్రహాన్ని పెట్టింది ఆది వాసీలే. సమాజంలో సగటుమనిషి జీవితానికి దర్పణం ఆయన జీవితం.

ఆయన విస్తృతమైన ప్రజాసంబంధాలు కలిగినవ్యక్తి. అన్ని వర్గాల వారు ఆయన మేధస్సు,వ్యక్తిత్వం,మానవత్వాన్ని అభిమా నించేవారు ఎందరో ఉన్నారు. ఆయన కష్టాలను చూసి, చలించి సహకరించడానికి ముందుకొచ్చినా, సున్నితంగా తిరస్కరించేవారు. పత్రికల పబ్లిసిటీతో మార్కెట్‌ను సృష్టించుకునే ఉద్యమాలు, ఆయ న్ని చూసి సిగ్గుపడతాయి. ఏనాడూ ఆయన పత్రికల ప్రాచుర్యానికి ప్రయత్నించలేదు. పత్రికలు ఆయన వ్యాసాల కోసం అర్రులు సాచాయి. ఆయన వ్యాసాలు చదివిన వారు చైతన్యవంతులయ్యా రు. సామాజిక అన్యాయాలను ప్రశ్నించడం ఆయన నేర్పారు. కొద్దిపాటి పబ్లిసిటీతోనే సమాజాన్ని మోసం చేస్తూ, అడ్డదిడ్డంగా సంపాదించే వాళ్లున్న నేటి స్థితిలో బాలగోపాల్‌ ఆదర్శజీవితం భావితరాలకు ఆదర్శం అవ్ఞతుంది. ఆయన భావాలను సిద్ధాంతా లను వ్యతిరేకించేవారు కూడా ఆయన చిత్తశుద్ధిని, నిబద్ధతను ఆదర్శ జీవితాన్ని గౌరవించారు. ప్రపంచీ కరణ, కార్పొరేట్‌ కల్చర్‌ పెరుగుతున్న నేటి సామాజిక వ్యవస్థలో సమాజం గురించి మాట్లా డేవారు కరవవ్ఞతున్నారు. పక్క ఫ్లాట్‌లో దొంగలుపడితే పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయే యాంత్రిక సమాజం తయారవ్ఞతున్న నేటి స్థితిలో మానవత్వం, హక్కులు, సామాజిక, అన్యాయాలపై ఆరా టపడేవారికి,ఆలోచించేవారికి, పోరాడే వారికి దివంగత బాలగోపాల్‌ జీవితం ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తుంది.నీతిగా ఉండటం, న్యాయంగా మాట్లాడటం, అవినీతికి పాల్పడని వారిని అమాయకులుగా, చేతకానివారిగా ముద్రవేస్తున్న నేటి సమాజంలో బాలగోపాల్‌ది ఓ అపురూప వ్యక్తిత్వం.

ఓ అపూర్వజననం, సమా జాన్ని ఆలోచింపచేసిన మరణం.ఆయన ఉద్యమ తీరులో విభిన్న మైన కోణాలు కనిపిస్తాయి. ప్రజాస్వామ్యకంగా ఉద్యమించడం, అహింసాయుతంగా ఉండటం, సాదాసీదా తనం,శాంతం,పట్టుదల, పర్యటన, నిరంతర శ్రమ, ఒకరినినొప్పించ కుండా ఉండటం తది తర లక్షణాలతో గాంధేయవాదం కనిపిస్తుంది. పోలీసులు ఎదురు కాల్పుల పేరుతో అమానుషంగా నక్సలైట్లను కాల్చి చంపుతున్నా రని వ్యవస్థనే ప్రశ్నించారు. ఆయనకూడా లీగల్‌గా నక్సల్స్‌కి ప్రతినిధని పోలీసులు ముద్రవేశారు. దీన్ని నమ్మేవాళ్లందరికీ బాల గోపాల్‌ హింసావాదిగా కనిపిస్తారు. భిన్న పార్శ్వవాలతో ఈయన కొంతకాలం ఎవరికి అర్థంకాలేదు.

నాటి సమకాలీన పరిస్థితిలో గాంధీని నమ్మారు. ఆయనను ఆచరించారు. నేదంతా బ్రాందీ వాదమేఉంది. మళ్లీ గాంధీ పుట్టొచ్చి గాంధేయ వాదం చెప్పినా నమ్మి ఆచరించేవాళ్లు ఎవరైనా ఉంటారా! ఉంటే సాదాసీదా జీవి తం,పేదప్రజలకు సేవచేయాలనే గొప్ప ఆశయం.సహనం, శాంతం కలిగిన బాలగోపాలే అభినవ గాంధీగా కనిపిస్తారు. ప్రజాస్వామ్యం ఖరీదు పెరుగుతుంది.చట్టం కలిగినోళ్లకు చుట్టం అవ్ఞతున్న నేప థ్యంలో గాంధేయవాదం చివరి అంచు అహింసా! హింస చివరి అంచు గాంధేయవాదమా! ఇది తేలాలంటే భిన్న పార్శ్వవాలున్న బాలగోపాల్‌ మళ్లీ పుట్టాలి.1998లో మానవ హక్కుల వేదిక ఏర్పాటుచేసుకుని,పేదోళ్ల లాయరుగా, న్యాయపోరాటం, మానవ హక్కుల పోరాటంచేశారు.కమిట్‌మెంట్‌, కాన్సెప్ట్‌, చిత్తశుద్ధి, సమా జం పట్ల అంకితభావం ఉన్న వ్యక్తులు బహుఅరుదు. అటువంటి వాళ్లలో బాలగోపాల్‌ ఒకరు. అరుదైన వ్యక్తులను సమాజం హఠా త్తుగా కోల్పోవటం, సమాజానికే తీరని నష్టం. ఆ నష్టాన్ని దేనితో కొలువలేం. పూడ్చలేం. హక్కుల ఉద్యమంవల్ల తాను ఆశించింది ఏమీ లేదు.సామాజిక విషయాలపై నిరంతర సంఘర్షణలోపడి ఆరోగ్యాన్ని మరిచారు. అర్థాంతరంగా ఎభైఏడేళ్లకే సమాజానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి వెళ్లిపోయారు.

  • సాధం వెంకట్‌, సీనియర్‌ జర్నలిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/