విలక్షణ పోలీస్‌ బాస్‌

వార్తల్లోని వ్యక్తి

(ప్రతి సోమవారం)

DGP Mahendera Reddy
DGP Mahendera Reddy

విలక్షణ పోలీస్‌ బాస్‌

మొన్న 12వ తేదీన తెలంగాణ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పదవీస్వీకారం చేసినముదిరెడ్డి మహేందర్‌ రెడ్డి విలక్షణ పోలీస్‌ అధికారి అని చెప్పవచ్చు. తనకున్న అధికార పరిధిలో ఆయన పోలీస్‌ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టారు. వాటిని గురించి తెలుసుకున్నప్పు డు బహుశా భారత దేశంలోనే పోలీస్‌శాఖలో ఎక్కడాలేని మార్పులు, చేర్పులను ఆయన చేపట్టినట్టు స్పష్టమౌతుంది.

పోలీస్‌ శాఖలో సాధారణ కానిస్టేబుల్‌ను అటు శాఖాధికారు లేమి, ఇటు ప్రజానీకమేమి చులకనగా పరిగణిస్తారు. అలాంటిది మహేందర్‌రెడ్డి కానిస్టేబుల్‌ను ‘కానిస్టేబుల్‌ సార్‌ అని సంబోధించే పద్ధతిని ప్రవేశపెట్టారు.సాధారణంగా ఉన్నతస్ధాయిలోవున్న పోలీస్‌ అధికారులు తమకింది పోలీసుఅధికారులను చులకనగా చూస్తారని ప్రతీతి. ఈ విషయాన్ని 1954లొ వచ్చిన ‘అగ్గిరాముడు చిత్రం లో హాస్యాత్మకంగా చిత్రించారు కూడా. అలాంటిది సాధారణ కానిస్టేబుల్‌ను కూడా గౌరవప్రదంగా చూడాలని ఆయన నిర్దేశించడం బహుశా దేశంలోనే ఎక్కడా కనిపించదు. ఇక, రెండవది ఆయన హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వున్నప్పుడు ఆయా పోలీసుస్టేషన్‌ల పరిధులను ప్రజాభిప్రాయం మేరకు ఏర్పాటు చేశారు. అంటేకాదు కొన్ని స్టేషన్ల పరిధుల నిర్ణయంలో ఆయన ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయాల ను వారి ఓట్ల ద్వారా సేకరించి, నిర్ణయించారు. పోలీస్‌స్టేషన్ల పరిధులను ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయించడమనేది, ఆ సందర్భంగా ప్రజల ఓటింగ్‌ తీసుకోవడమేనేది ఇంతవరకు భారత దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పవచ్చు. పోలీసుశాఖలో ఆయన ప్రజాస్వామ్యవాది. మూడవది,

మహేందర్‌ రెడ్డి సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వున్న కాలంలో ఆ కమిషనరేట్‌లోని పోలీసుస్టేషన్‌లన్నింటికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్లు లభించాయి. ఇలాంటిది దేశంలో ఇది వరకు ఎన్నడూ జరిగినట్టు కనిపించదు. కేంద్రంతో నిర్మొహమాటంగా… నాల్గవది, మహేందర్‌రెడ్డి ఇంటెలిజెన్స్‌ ఐజి గాను, ఆ తరువాత అడిషనల్‌ డిజిగాను పనిచేసినప్పుడు ఒక ఆసక్తికరమైన విశేషం జరిగింది. ఆ సమయంలోనే 2014 జూన్‌లో సమైక్యాం ధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్ర విభజన జరగడానికి ముందు దాని పరిణామాలపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే, తెలంగాణాలో నక్సలైట్ల విజృంభణ జరుగుతుం దని అప్పటి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు రాష్ట్ర మంత్రులు కేంద్రాన్ని హెచ్చరించినట్టు ప్రతీతి. దీనిపై కేంద్రం ఇంటిలిజెన్స్‌ అడిషనల్‌ డిజి మహేంద్రరెడ్డిని పిలిపించి, అభిప్రాయం అడగ్గా ఆయన అలాంటిది ఏవిూఉండద ని, ప్రత్యేక తెలంగాణాలో నక్సలైట్ల బెడద పెరగదని కేంద్ర హోంశాఖ అధికారులకు నిర్మొహమాటంగా చెప్పారట! తన రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయానికి భిన్నంగా ఆ రాష్ట్ర పోలీసు అధికారి కేంద్రానికి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం మరో విశేషం. అయిదవది, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మహేం దర్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తారు.

ఆయన ఇతర సమయాలలో ఎంత సౌమ్యుడో శాంతి భద్రతల పరిరక్షణలోను, సంఘ వ్యతిరేకశక్తుల అణచివేతలోను అంత కఠినుడు. ఆరవది, పోలీసింగ్‌ విషయంలో ఆధునిక సాంకేతిక పరమైన సాధనాలను వినియోగించుకోవడంలో ఆయన ఆది నుంచి ముందంజ వేస్తూవచ్చారు. నేరాల నివారణలోను, నేరస్తులను కనుగొనడంలోను సిసి కెమెరాలు ఎంతో ప్రయోజనకరమైనవని ఆయన ఎప్పుడో చెప్పారు.

మొన్నటి వరకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా వున్న ఆయన జంట నగరాలలో లక్ష సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని అకాక్షించారు. ఏడవది, ఆయన ప్రజలతో కలిసిమెలిసి తిరగాలని కోరుకుంటా రు. అందువల్లనే ‘ప్రజామిత్రత్వ పోలీసింగ్‌ సిద్ధాంతానికి ఆయన ఆధ్యుడు. కాగా, ఇప్పుడు తెలంగాణకు ఏకంగా డిజిపి కావడంవల్ల ఆయన పోలీసుశాఖలో ఎన్నో సంస్కరణలను చేపట్టాలని కోరుతున్నారు. వాటిని ఇతర రాష్ట్రాలలోని అధికారులు కూడా పరిశీలించడం, పరిగణించడం అవసరం.

మహేందర్‌రెడ్డిది ఖమ్మం జిల్లా క్రిష్ణాపురం స్వస్ధలం. ఆయన సాధారణ రైతుకుంటుంబంలో జన్మించారు. చిన్పప్పుడు తల్లిదండ్రులకు పొలం పనులలో చేదోడువాదోడుగా వుండేవారు. వరంగల్లు రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆయన సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని రెండు స్వర్ణ పతకాలతో సహా సాధించారు. ఆ తరువాత సివిల్‌ పరీక్ష రాసి, ఐపిఎస్‌ సాధించారు. తెలంగాణా డిజిపి పదవి వచ్చేనెలలో రానున్న తన జన్మది నోత్సవ కాన్క అని చెప్పవచ్చు. మహేందర్‌ రెడ్డి వయస్సు 55సంవత్సరాలు.

– డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు

(”పద్మశ్రీ అవార్డు గ్రహీత)