విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం

plastic carry bag
plastic carry bag

ఎ టు చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే. మురుగు కాల్వలు, నదులు, పంట కాలువల్లో సైతం పాలిథిన్‌ సంచులే దర్శనమిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పర్యావరణానికి పెనుముప్పు తెస్తోన్న ప్లాస్టిక్‌ భూతాన్ని పెంచి పోషిస్తున్నారు. అధికారులు కళ్లప్పగించి చూస్తుండడంతో విచ్చలవిడిగా వినియోగం జరుగుతోంది. మరోవైపు న్యూస్‌పేపర్లలో చిరుతిళ్లు, ఆహార పదార్థాల సరఫరా నిషేధమని చెప్పినా చెవికెక్కని పరిస్థితి. ఫలితంగా ఆహారం మాటున ఇంటికి అనారోగ్యాన్ని మోసుకెళ్లుతున్నారనేది అక్షరసత్యం. 2016లో ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి వచ్చినా దస్త్రాలకే పరిమితమైంది. ఆ తర్వాత భారత ఆహార భద్రతా ప్రమాణాల సంఘం ఆదేశాల ప్రకారం ఆహారం ప్లాస్టిక్‌, న్యూస్‌ పేపర్లలో ప్యాక్‌ చేయడం, సరఫరా చేయడం నిషేధమంటూ ఈ ఏడాది జనవరి మూడున ప్రకటించారు. జులై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమలులోకి ఖచ్చితంగా తేవాలని సూచించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న కవర్లు వాడకూడదని చట్టం చెబుతోంది. పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, టిఫిన్‌, కర్రీపాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌, చికెన్‌, మటన్‌ సెంటర్లు కూడా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్‌ కవర్లు ఉపయోగిస్తున్నారు. వ్యాపారులు వినియోగదారులకు నిర్భయంగా ఎంచక్కా ప్లాస్టిక్‌ కవర్లలో పెట్టి ఇచ్చేస్తున్నారు. వీటితోపాటు టీ కప్పులు, ప్లేట్లు, ప్లాస్టిక్‌వే వాడుతున్నారు. ఇలా 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే కవర్లను ఉపయోగిస్తుం డటం కలవరపెడుతోంది. పట్టణ, నగర కేంద్రాలతోపాటు గ్రామాలలో సైతం ఎక్కువ మంది వీధి వ్యాపారులు, హోటళ్లు, వందకు పైగా టిఫిన్‌ సెంటర్లు, లైసెన్సు దుకాణా లలో అధిక శాతం ప్లాస్టిక్‌ కవర్లను ప్రోత్సహిస్తున్నా యి. నియంత్రణ, ప్రత్యామ్నాయం ఏవి? నిషేధిత కవర్లు అమ్ముతున్నట్లు కనిపిస్తే దుకాణదారుడికి జరిమానా విధించి కేసులు నమోదు చేయాల్సిన అధికారులు ఆ దిశలో అడుగులు వేయడం లేదు. పైగా దుకాణాదారుల వద్ద డిమాండ్‌ చేస్తూ లంచాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపి స్తున్నాయి. మరికొందరైతే పండ్లు, ఇతర పదార్థాలు తీసుకుని కవర్లు ఉన్నాయని తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ప్లాస్టిక్‌ వినియోగానికి ప్రత్యామ్నాయం జూట్‌ బ్యాగుల వినియోగం, తయారీపై దృష్టిపెట్టలేదనే చెప్పాలి. ఆహారం ఎంత శుద్ధిగా తయారు చేసినా సక్రమంగా ప్యాక్‌ చేయకపోవడం వల్ల అది విషపూరితమయ్యే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు కేన్సర్‌ సంబంధిత అనారోగ్య సమస్యల బారినపడతారు. ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాక్‌ చేసిన వేడి పదార్థాలు తినడం వల్ల కిడ్నీసమస్యలు, అన్నవాహిక, సంతానలేమి, ఇతర సమస్యల బారినపడతారు. వేడిపదార్థాలు ప్లాస్టిక్‌తో కలిసినప్పుడు ప్రమాదశాతం తీవ్రమవ్ఞతుంది. ఆహార కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులపై ప్రజా అవగాహన సదస్సులు ఆహార భద్రతా ప్రమాణ అధికారులు నిర్వహించాల్సి ఉంది. ప్లాస్టిక్‌, పేపరు వల్ల వచ్చే అనర్థాలపై నగరపాలక అధికారులు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. వారంలో ఒక మనిషి సుమారుగా ఐదు గ్రామాలు ప్లాస్టిక్‌ తీసుకుంటున్నాడని ఇటీవల ఒక అధ్యయనం తేల్చింది. తినే పదార్థాలను భద్రపరచడం మొదలు ఇంట్లో వాడే ఏ వస్తువైనా ప్లాస్టిక్‌తో చేసింది వినియోగించడమే ఇందుకు కారణం.ఇది ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/