రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలి

TECHNOLOGY DEVELOPING
TECHNOLOGY DEVELOPING

మ నదేశం అతిపెద్ద ప్రజాస్వా మిక దేశం. పెద్ద లిఖిత రాజ్యాంగం మనది. రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నియమ నిబంధన లకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగించాలి. దేశ భద్రత దృష్ట్యా కేంద్రానికి ఎక్కువ అధికార బాధ్యతలు అప్పగించబడ్డాయి. కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ సజావ్ఞగా జరగడానికి విస్తృతంగా ఏర్పాట్లు జరిగాయి. దేశంలో పరిపాలన సజావ్ఞగా సాగడానికి విభిన్నమైన వ్యవస్థలున్నాయి. న్యాయవ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం, కార్యానిర్వాహక వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయడానికి తగిన యంత్రాంగం రాజ్యాంగంలోనే పొందుపరచబడింది. స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన వ్యవస్థలు కూడా ప్రభుత్వ తప్పిదాలను, పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపడానికి, పర్యవేక్షణకు, మందలించడానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు మన రాజ్యాంగం కల్పించింది. స్థానిక సంస్థలకు కూడా రాజ్యాంగం ద్వారా ఎన్నో అధికారాలు కట్టబెట్టబడ్డాయి. భారతదేశం గ్రామాలతో కూడి ఉన్న విశాలమైన దేశం. గ్రామాలు బాగుంటేనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని గాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యం నెరవేరలేదు. ఎవరికీ వారు అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికార వికేంద్రీకరణకు మొగ్గుచూపకపోవడం వలన గ్రామాలు వెనుకబడి ఉన్నాయి. గ్రామపరిపాలన పార్టీలకతీతంగా జరగాలి. దురదృష్టవశాత్తు గ్రామీణ వాతావరణం కూడా రాజకీయాల పుణ్యమా అని కలుషితమైపోయింది. ఎన్నికలు పార్టీలకతీతంగా జరగకపోయినా గ్రామాల్లో రాజకీయ రణరంగం తప్పడం లేదు. పంచాయతీలతోపాటు, మండల, జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా పార్టీల కతీతంగా ఎన్నికలు జరగాలి. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు మినహా మిగిలిన అన్ని వ్యవస్థలు రాజకీయాలకు అతీతమైన పాలనా యంత్రాంగం కలిగి ఉండాలి. ప్రభుత్వాల జోక్యం పనికిరాదు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలలో ప్రభుత్వాల జోక్యం పనికిరాదు. ప్రభుత్వరంగంలోని వివిధ కార్పొరేషన్లను రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉంచాలి. కేవలం వీటిపై ప్రభుత్వాలకు పర్యవేక్షణ ఉండాలే తప్ప అజమాయిషీ మాత్రం ఉండకూడదు. వీటిలో జరిగే అవకతవకలను ఎత్తిచూపడానికి చట్టబద్ధమైన అధికారాలతో కూడిన స్వతంత్ర పర్యవేక్షణా సంస్థ ఉండాలి. రాష్ట్రాలు బాగుండాలంటే కేంద్రం అధికార వికేంద్రీకరణ జరిపి తన గుప్పెట్లో ఉన్న అధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలి. రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు దఖలుపరిచి, స్వతంత్రంగా పనిచేసే వాతావరణం కల్పించాలి. గవర్నర్ల వ్యవస్థ పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా ఉండాలి. గవర్నర్ల నియామకం ఏకపక్షంగా ఉండకూడదు. అన్ని రాజకీయ పక్షాలతో, విభిన్న రంగాలకు చెందిన మేధావ్ఞలతో కూడిన పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించి అందరికీ ఆమోద యోగ్యమైన పద్ధతిలో గవర్నర్ల నియామకం చేపట్టాలి. మితిమీరిన ఎన్నికల వ్యయం తగ్గించాలి. సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసిన ఈ ఆధునిక యుగంలో కూడా రాజకీయ పార్టీల ప్రచారానికి మైకుల హోరు, ప్రచారజోరు అవసరమా? దీనివలన ప్రజలకు అసౌకర్యం కలగడం లేదా? ప్రచార పటోటాపాలకు అయ్యే ఖర్చంతా అంతిమంగా ప్రజల నెత్తిపై పడక తప్పదు. అంతిమ బాధితులు ప్రజలేనన్న సత్యం అవగతం కావాలి. ప్రజలకు రాజ్యాంగం అనేక ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కాలానుగుణంగా మనం రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగినా అవి పాలకులు సౌలభ్యానికే తప్ప పాలితుల సౌకర్యానికి కాదన్న భావన ప్రజల్లో గూడుకట్టుకుపోయింది. ప్రజాసమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. చట్టబద్ధమైన వ్యవస్థలు నిర్వీర్యమవ్ఞతూనే ఉన్నాయి. స్వయం ప్రతిపత్తిగల సంస్థలన్నీ కుప్పకూలిపోతూనే ఉన్నాయి. ఎన్ని సవరణలు వచ్చినా, ఎంతగా రాజకీయ చైతన్యం పెల్లుబికినా దేశం ఇంకా వెనుకబడే ఉండడం బాధాకరం. దేశంలో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతూనే ఉంది. బాలకార్మిక వ్యవస్థ మనుగడలోనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రకటించినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రజలకు కావలసిన దీర్ఘకాలిక ప్రయోజనాలకై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అభివృద్ధితోనే ప్రజల అవసరాలు తీరుతాయి. తాత్కాలిక ప్రయోజనాలను కలిగించే పథకాలకు అన్ని రాజకీయ పక్షాలు స్వస్తివాక్యం పలకాలి. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థలు కలుగచేసుకుని రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలపై నిషేధం విధించాలి. దీర్ఘకాలిక అవసరాలపై దృష్టిసారించేటట్టు అన్ని రాజకీయపక్షాలకు దశాదిశా నిర్దేశించాలి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఓట్లకొనుగోలుతో ప్రజాస్వామ్యం పరిహాసప్రాయమవ్ఞతున్న నేపథ్యంలో అభివృద్ధిని ఆశించడం అత్యాశే కాగలదు. దశాబ్దాల తరబడి ఓట్ల వేటలో పడి అన్ని పక్షాలు ఉచితానుచితాలు మరచి, అనుచితంగా ఉచిత పథకాలతో ప్రజలకు ఓట్ల గాలం వేస్తున్నారు. యధాశక్తి మనం కూడా తాత్కాలిక ఉపశమనం కోసం వెంపర్లాడుతున్నాం. రాజకీయాలకతీతంగా ప్రజలంతా దేశ అభివృద్ధికి పాటుపడాలి. సమాజంలో ఉండే మేధావి వర్గమంతా పార్టీలకతీతంగా సమాజశ్రేయస్సుకు పాటుపడాలి. ఎన్నికల వరకే రాజకీయాలుండాలి. ఎన్నికల అనంతరం రాజకీయ భావజాలం వదిలేసి ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి.
సుంకవల్లి సత్తిరాజు

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/