మహాత్ముని స్వయం క్షౌర సాధన

గాంధీజీ తన న్యాయవాద వృత్తికి సంబంధించి ప్రిటో రియా నగరానికి వెళ్లారు. మార్గం మధ్యలో ఒక రాత్రి జోహన్స్‌బర్గులో గడపవలసి వచ్చింది. గాంధీజీ ఒక టాక్సీ మాట్లాడుకుని ఒక పెద్ద హోటల్‌కు తీసుకెళ్లమ ని డ్రైవర్‌కు చెప్పారు. అక్కడ హోటల్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లి గది కావాలని అడిగారు. ఆ ఇంగ్లీషువాడు గాంధీజీని నఖశిఖపర్యంతం తేరిపారజూచి, ‘సారీ అన్నీ నిండిపోయాయి. ఏవీ ఖాళీగా లేవు అన్నాడు. చేసేదేమీలేక, తన క్లయింట్‌ స్నేహితుడి దుకాణంలో ఆయన ఆ రాత్రి గడిపారు. జరిగినదంతా అబ్దుల్‌గనీ సేఠ్‌ అనే మిత్రుడికి చెప్పారు.

హోటల్‌లో బస దొరుకుతుందని మీరెలా అనుకున్నారు? అని మిత్రుడు అడిగాడు.ఎందుకు దొరకదు? అని గాంధీజీ ఆశ్చర్యపడ్డాడు. సరే సమయమొచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారు. అని ఆయన బదులిచ్చారు.దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరిగే అవమా నాలన్నీ గాంధీజీకి అనుభవమే. ఆయనను కొట్టారు. తన్నారు, రైలులో నుంచి ఫ్లాట్‌ఫాం మీదికి గెంటేశారు. ఇదంతా ఎందుకంటే ఆయన చామనఛాయగల భారతీయుడు కాబట్టి. ఇంత జరిగినా ఈ తెల్లవాళ్లంతా అలా ఎందుకు ప్రవర్తిస్తారో, నల్లవాళ్లని అలా ఎందుకు కించపరుస్తారో గాంధీజీకి అర్థమయ్యేది కాదు. అందరూ ఆ దేవ్ఞని బిడ్డలుకాదా? క్రైస్తవ మతం ప్రేమమయమేగదా! అను కునేవారు. ఒకరోజున ఆయన క్షవరం కోసం ప్రిటోరియాలోని ఒక క్షౌరశాలకు వెళ్లారు.అక్కడ తెల్ల క్షురకుడున్నాడు. ఏంకావాలి? అని నిలదీశాడు. క్షవరం చేయాలి అన్నారు గాంధీజీ. ఆ తెల్ల క్షురకుడు  నీకు క్షవరం చేయను పో అన్నాడు చేయనంటే సరిపోయేది,కానీ తిరస్కరించేసరికి గాంధీజీ భరించలేకపోయారు.ఇది చాలా ఘోర అవమానంగా గాంధీజీ మనసులో ముద్రపడిపోయింది. బాధపడి నా, పత్రికలకెక్కినా ప్రయోజనం ఉండదని ఆయన భావించారు. ఆయన స్వయంభువ్ఞ. తన పనులను తానే చక్కబెట్టుకునేవారు. వెంటనే ఒక జతక్లిప్పర్లను (జుట్టును చిన్నగా కత్తిరించడానికి వినియోగించే సన్నని  కత్తెర్లు) కొనుక్కని ఇంటికి వచ్చారు. ఒక అద్దం ముందు కూర్చుని జుట్టు కతిరించుకోవడం ఆరంభించారు. గడ్డం చేసుకున్నంత సులభం కాదుగదా తమకు తామే క్షవరం చేసుకోవడమంటే! అందులోనూ క్షవరం చేసుకోవడం ఒక వకీలు చేయవలసిన పనికూడా కాదు!ఎలాగైతేనేం, ఆయన పూర్తి చేశారు. తల వెనుకభాగం మాత్రం అడ్డదిడ్డంగా  తయారైంది.  గాంధీజీ అలాంటివేమీ పట్టించుకునే వ్యక్తి కాదు. కాబట్టి యధావిధిగా ఆ మారునాడు కోర్టుకు హాజరయ్యారు. బఫూన్‌ జుట్టులా తయారైన గాంధీజీ క్షవరాన్ని చూసి ఆయన మిత్రులంతా పగలబడి నవ్వారు. క్షవర ప్రక్రియలో ఈ తొలిప్రయోగం చేసేనాటికి గాంధీజీకి 28 ఏళ్లు. అటుమీదట ఆయనే తన క్షవరాన్ని తానే చేసుకునేవారు. దక్షిణాఫ్రికాలోని ఆయనఆశ్రమాలలో క్షురకులతో సేవలందుకోవడం నిషిద్ధమయింది. ఆశ్రమవాసులంతా ఒకరినొకరు వంతులవారీ క్షవ రం చేసేవారు.
ఆశ్రమవాసులంతా నిరాడంబరమైన జీవితాన్ని గడ పాలనేది గాంధీజీవాంఛ. ఎలాంటి షోకులుగానీ, స్కూలుబూట్లు గానీ, చవ్ఞలూరించే శాకపాకాదులుగానీ ఆశ్రమ ఛాయలకు రాని చ్చేవారుకాదు. ఒక ఆదివారం పొద్దునే బాలురందరూ స్నానాదు లకు బయలుదేరారు. గాంధీజీ వారినందరినీ ఒకరి తరువాత ఒక రిని పిలిచి శుభ్రంగా క్షవరం చేసి పంపారు. పిల్లలకు జుట్టు చిన్న దిగా కత్తిరించడం నచ్చేదికాదు.కానీ తప్పేదికాదు. గాంధీజీ ఒకసారి ఆశ్రమ బాలికల పొడుగు జుట్టును సైతం చిన్నగా కత్తిరించేశారు. ఒకసారి సేవాగ్రామంలోని హరిజన సేవకుడొకడు ఒకరోజు తాను వార్ధా వెళుతున్నానని చెప్పాడు. ఎందుకని గాంధీజీ ప్రశ్నించాడు. క్షవరంకోసం వెళుతున్నానని ఆ హరిజనుడు బదులిచ్చాడు. ఈ గ్రామంలోనే చేయించుకోలేవా? అన్నారు. సవర్ణక్షురకులు నాకు క్షవరం చేయరు. ఇక్కడ హరిజన క్షురకులు  ఎవరూ లేరు అన్నా డు. అయితే నేను మాత్రం ఆ క్షురకునితో ఎలా చేయించుకోగలను అని ఆ రోజునుంచి గాంధీజీ ఆ క్షురకునితో క్షవరం చేయించు కోవ డం మానేశారు. గాంధీజీ క్షణం తీరికలేకుండా నిత్యం గ్రామాలను సందర్శించేవారు.కనీసం గడ్డం గీసుకోవడానికైనా సమయం ఉండే దికాదు. అలాంటప్పుడు క్షురకుని  అవసరం ఏర్పడేది.