మద్యం రాబడికి ప్రత్యామ్నాయం కొబ్బరి

cocanut tree
cocanut tree

మద్యపాన నిషేధంతో ఆంధ్ర ప్రదేశ్‌రాష్ట్రం 2023 నుండి ప్రతియేటా 18వేలకోట్ల ఆదాయ రాబడిని కోల్పోతుంది.ఒకపక్క ప్రభుత్వం ప్రజాసంక్షేమ పథకాల ద్వారా,అభివృద్ధి కార్యకలాపాలకి, జీతభత్యాలకి, భారీస్థాయిలోనే వెచ్చించాల్సివస్తోంది. మరి ఇలాం టి సమయంలో ప్రభుత్వం ఇంకా అప్పులపై ఆధారపడక తప్పదు. ఇప్పటికే రాష్ట్ర సిఎస్‌డిపిలో అప్పులు 25.9శాతం మించరాదు,కానీ 32.30 శాతానికి చేరిందని ‘కాగ్‌ నివేదిక2019జూన్‌నెలలో హెచ్చరికతో కూడిన సూచనలు చేసింది. ఇలాంటి ఆర్థికదుర్భర పరిస్థితులలో రాష్ట్రం వివిధ మార్గాలలో ఆదాయాన్ని సమకూర్చుకొనేలా కొంత దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కొబ్బరి మొక్కల విస్తీర్ణాన్ని పెద్దమొత్తంలో సాగుకి ప్రోత్సహించాల్సిఉంది. 2013 ఏప్రిల్‌ నెలలో కొబ్బరి అభివృద్ధిబోర్డు సంస్థ ఛైర్మన్‌ టి.కె జోష్‌ ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొబ్బరి సాగుని, వ్యవసాయపరంగాను గృహాల పరిధిలోకలిపి ఒక లక్ష హెక్టార్ల లో మాత్రమే సాగుచేస్తున్నారు.దీన్ని ఐదులక్షల హెక్టార్లకి విస్తరింపచేసే దిశలో వెళ్లాల్సిన అవసరం ఉంది. విచిత్రం ఏమిటంటే 2018 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరిని కేవలం 1,03071 హెక్టార్లకు మించలేదు. కోస్తాతీరప్రాంతం, కృష్ణా,గోదావరి నదుల పరివాహక నేలల్లో ఈ కొబ్బరి సాగు అత్యంత అనుకూలమైంది.అందుకే దేశంలోనే అధిక వార్షిక సగటు ఉత్పాదకత హెక్టార్‌కి 14,038కొబ్బరి కాయలు అంది స్తాయి. 2016 నాటికి కేరళరాష్ట్రంలో మొత్తం 136 మిలియన్‌ల కొబ్బరి చెట్లు ఉంటే ఉత్పాదకత ఒక్కకొబ్బరి చెట్టు నుండి వార్షికంగా 46 కొబ్బరికాయలనేపొందుతున్నారు. కర్ణాటకలో 88మిలియన్‌ల కొబ్బరి చెట్లుఉంటే సగటున ఒక చెట్టు నుండి 57కొబ్బరికాయలు లభిస్తున్నాయి.ఇక తమిళనాడులో80 మిలి యన్‌ల చెట్లు ఉంటే ఒక్క చెట్టు నుండి 87 కొబ్బరికాయలు, అదే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 21 మిలియన్స్‌ (2 కోట్ల పదిలక్షల) కొబ్బరి చెట్లు ఉంటే ఒక్క చెట్టునుండి వార్షికంగా 89 కాయలను అందిస్తూ దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నది.
బహుళప్రయోజనకారి కొబ్బరి
కొబ్బరి చెట్టు పురాతన కాలం నుండే కొబ్బరిమట్ట, కొబ్బరి బోండా, కాయలు, కుడకలు, చీపుర్లు, కొబ్బరి పీచుతో చేసే కుర్చీలు,సోఫాలు, ‘నీర అనే పానీయం ఇలా ఎన్నో విధాలుగా బహుళ ప్రయోజనకారిగా ఉంది కాబట్టే, కల్పవృక్షంగా పేర్కొం టారు. దేశంలో కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా కొబ్బరి సాగు, వాటి ఆధారిత ఉత్పత్తులైన కొబ్బరి నూనె, వంటనూనె,కొబ్బరి కొబ్బరి పాల ఉత్పత్తులు, అంతేకాకుండా బేకరీ ఉత్పత్తుల్లో కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతియేటా కేరళరాష్ట్రం 15వేల కోట్ల ఆదాయాన్ని పొందుతుందని అంచనా. ‘నీర అనే పానీయాన్ని కూడా కొబ్బరి నుండే తీసి సాఫ్ట్‌డ్రింక్‌గా, హెల్త్‌ డ్రింక్‌గా 300 ఎమ్‌ఎల్‌, 500 ఎమ్‌ఎల్‌ బాటిల్స్‌, ప్యాకెట్స్‌ రూపంలో సరఫరాచేసి విక్రయించడం ద్వారా అదనంగా ప్రతి యేటా 20వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టాలని కేరళ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నీర అనే పానీయాన్ని ‘నాన్‌- ఆల్క హాల్‌, హెల్త్‌డ్రింక్‌గా కేరళరాష్ట్రంగుర్తించింది. దీనిలో ఆల్కహాల్‌ శాతం కేవలం నాలుగుశాతంలోపే. అదే ‘కల్లు 8శాతం వరకు ఆల్కహాల్‌ ఉంటుంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషియన్‌ శాస్త్రవేత్తలు సైతం ‘నీర పానీయం ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుందని పేర్కొన్నా రు.అనేక పర్యాయాలు తమ పరిశోధనా పత్రాల ద్వారా వెల్ల డించారు.100 ఎమ్‌ఎల్‌ పరిమాకం గల నీరాలో పోటాషియం 146 నుండి 180 మిల్లీగ్రాములు, సోడియం 69 నుండి 110, పాస్పరస్‌ 2 నుండి 6, జింక్‌ 0.026,ఐరన్‌ 0.049 మిల్లీ గ్రామ్‌లు కలిగి కండరాలకి, నాడీ వ్యవస్థకి ఎంతో బలం చేకూర్చుతుంది.అంతేకాక అమైనోయాసిడ్స్‌,నికోటినిక్‌ యాసిడ్స్‌ (విటమిన్‌ బి3, విటమిన్‌ బి2)అస్క్రోబిక్‌ ఆసిడ్‌ కలిగిన నీర పానీయం కేన్సర్‌ కారక సూక్ష్మజీవిని నియంత్రించే గుణాలు, మలబద్ధకం, కంటిచూపు తదితర సమస్యలని నివారించే లక్ష ణాలు పుష్కలంగా కలిగి ఉంది. ఇన్న సుగుణాలు గల నీరా పానీయం ఒక కొబ్బరి చెట్టునుండి రోజుకి 2లీటర్ల నుండి నాలుగు లీటర్లవరకు పొందవచ్చు. కనీసం ఒక గృహంలో నాలుగు కొబ్బరి చెట్లు పెంచుకోవడంతో ఆ కుటుంబం ఆర్థికం గా భద్రత పొందుతుంది. ఈ నీర పానీయాన్ని గొప్ప ఎనర్జీ డ్రింక్‌గా మార్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చొరవ తీసుకోవా ల్సిన అవశ్యకత ఏర్పడింది. సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజికల్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (మైసూర్‌), నేషనల్‌ కెమికల్‌ లేబరేటరీ (పూణె) వారి సహకారంతో నూతన ఫార్ములాన్ని సృష్టించేలా చేస్తే ఆర్థికంగా అటు కొబ్బరి రైతులు, ఇటు రాష్ట్రప్రభుత్వానికి ఆదాయరాబడి పెద్దమొత్తంలో సమకూరుతుంది. ఉదాహరణకి ఆస్ట్రియా దేశానికి రెడ్‌బుల్‌ అనే ఒక ఎనర్జీడ్రింక్‌ ని ఫార్ములని ‘డైట్రిచ్‌ మెషిజ్‌ అనే వ్యక్తి 1981లో సృష్టించి నేడు 170 దేశాలలో అమ్ముడుపోతుంది. 2017లో 600కోట్ల రెడ్‌బుల్‌ టిన్స్‌ అమ్ముడై సుమారు ఐదు బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ నమోదు చేసుకుంది.(35వేల కోట్ల రూపాయలు) ఇలా తరహా లో ‘నీర పానీయాన్ని సృష్టించే అవకాశాలు, సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మెండుగాఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు జిల్లాలలో కొబ్బరిని సాగు చేస్తున్నారు.తూర్పుగోదావరిలో 50,285 హెక్టార్లలో సాగచేస్తుంటే వరుసగా పశ్చిమగోదావరి లో 21,561 హెక్టార్లు, శ్రీకాకుళంలో 14,480 హెక్టార్లు, విశాఖపట్నం 6796, విజయనగరం 2711, కృష్ణాజిల్లాలో 2116 హెక్టార్లు ఇలా మొత్తంగా 10,3071 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రపంచంలోనే అధికంగా ఒక హెక్టార్‌లో20,820 కొబ్బరికాయల దిగుబడితో పశ్చిమగోదావరి జిల్లా ముందుంది. ప్రతియేటా సెప్టెంబర్‌-2వ తేదీని ప్రపంచ కొబ్బరిదినోత్సవం గా జరుపుకుంటూ అనేక సెమినార్స్‌,ఎగ్జిబిషన్స్‌ నిర్వహిస్తూ కొబ్బరిఉత్పత్తుల ప్రాముఖ్యతను, కొత్తవంగడాలు,ఆవిష్కరణల ని తెలియపర్చుతుంటారు.ప్రపంచంలో అధికంగా సాగుచేస్తూ ఫిలిప్పీన్స్‌ దేశం35 లక్షల 65 వేల హెక్టార్లతో మొదటిస్థానం రెండవస్థానం ఇండోనేషియా 34 లక్షల 42వేల హెక్టార్లతోను, 3స్థానంలో 20 లక్షల 90వేల హెక్టార్లతో భారత్‌ ఉంది. ్ద
-కనుకుల యాదగిరి రెడ్డి