భేషైన చర్యలు తీసుకున్న కేంద్రం

security at border
security at border

ఇటీవల పూల్వామా జిల్లా, అవంతీపూర్‌ వద్ద శ్రీనగర్‌- జమ్మూప్రధాన రహదారిపై సిఆర్పీఎఫ్‌ (ది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్ల వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడికి మొత్తం దేశ ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కి పడి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ దాడిని నిరసిస్తూ యావత్‌ భారతజాతి నిరసన చేపట్టి దాడిలో చనిపోయిన 40మంది అమరజవాన్లకు ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా యావత్‌ భారత పౌరులు జైషే ఎ మహ్మద్‌ తీవ్రాద సంస్థకు, అలాంటి ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తున్న పాకిస్థాన్‌ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి భారత ఐక్యతను మరోసారి గుర్తుచేశారు. భారతదేశంపైగల అచెంచలమైన దేశభక్తిని ప్రజలంతా మరోసారి చాటారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ దేశాన్ని ఏకాకిని చేయడం కోసం అనేక చర్యలు చేపట్టింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తనదైనశైలిలో చక్కనినిర్ణయాలు తీసుకొంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తీవ్ర భావోద్వేగానికి గురై ఉగ్రవాద నిర్మూలన ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదులు పెద్దతప్పు చేశారని, వారు తప్పకుండా భారత్‌ నుండి అంతేస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని అన్నారు. భారత్‌లో గల అన్ని పార్టీలు ఐక్యతను ప్రదర్శించి దేశసార్వభౌమత్వాన్ని కాపాడటంలో తమవంతు సహకారం అందిస్తామని అన్నాయి.

భిన్నత్వంలో ఏకత్వం అనే విశేషమైన లక్షణం భారతదేశాన్ని కాపాడటంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాయని కాంగ్రెస్‌ పార్టీ, అనేక ఇతర పార్టీల అధినేతలు, ప్రతినిధులు చెప్పారు. అలాగే దేశంలో గల వివిధ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు, ప్రతినిధులు హోంమంత్రి అధ్యక్షన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా అమరవీరజవానుల మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. పాకిస్థాన్‌ దేశానికి ఉన్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎం.ఎఫ్‌ఎన్‌) హోదా ఉపసంహరణ తక్షణమే చేయడం కూడా జరిగింది.

దీని ద్వారా పాక్‌ను ఆర్థిక ఇబ్బందుల చట్రంలోకి వెళ్లేటట్లు చేయడం, దానిలో భాగంగా పాక్‌ నుంచి దిగుమతి అయ్యేసరుకులపై ప్రాథమిక కస్టమ్స్‌ సుంకాలను 200 శాతానికి పెంపు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 1986లో ఐరాసలో భారతదేశం ప్రవేశపెట్టిన ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం తక్షణమే ఆమోదం పొందేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని కూడా భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సి.సి.ఎస్‌)లో నిర్ణయించింది. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గల అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా రాయబారులతో పాక్‌ దురాగతాలను తెలియచేస్తూ విదేశీ వ్యవహారాల శాఖ చర్చలు జరిపింది.

అంతేకాకుండా జె.ఇఎమ్‌ అధినేత మసూద్‌ అజర్‌ పేరును ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో చేర్చాలనే భారత డిమాండ్‌ను మరొకసారి పైకి తీసుకువచ్చింది.పుల్వామా దాడి ఘటన గతంలో జరిగిన ఉగ్రదాడుల కన్నా దారుణమైన సంఘటన. ఉగ్రవాద నిర్మూలన దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం పట్లభారత్‌లో గల యావత్‌ ప్రజలు కేంద్ర ప్రభుత్వం చొరవకు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఉగ్రదాడి సంఘ టన జరిగిన తర్వాత అమాయకులపై, ముఖ్యంగా మైనార్టీలపై దేశవ్యాప్తంగా, దేశసరిహద్దు ప్రాంతాలలో ఎలాంటి దాడులు జరగ కుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

ఈ విషయమై ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని తగు బందో బస్తును ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీ వర్గాలు నివసించే ప్రాంతాలలో రక్షణ ఏర్పాట్లు చేయాలి. మైనార్టీల హక్కు లు కాపాడటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాజీలేని పోరాటం చేయాలి. ఇలాంటి సందర్భంలో దేశసమగ్రతను, సార్వభౌమాధికా రాన్ని కాపాడటంలో దేశంలో గల పార్టీలన్నీ చిత్తశుద్ధితో వ్యవహ రిం చాలని, ఓట్ల ఎరవేతగా చూడకూడదు. 2017 సంవత్సరం లో కేంద్ర హోంశాఖ ‘భారత్‌ కే వీర్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉగ్ర వాదుల దాడుల్లో అసువ్ఞలు బాసిన సైనికుల కుటుంబాలకు అండ గా నిలిచేందుకు ఆర్థిక సహాయం అందించే వెసులుబాటును ప్రజ లకు కల్పించింది.

తెల్లవారుజామున జరిగిన భారత వాయుసేన మెరుపుదాడులకు ముజఫరాబాద్‌ దగ్గరలో గల జైషే మహమ్మద్‌, ఇతర ఉగ్రవాద సంస్థల శిక్షణాశిబిరాలు భారత వైమానిక బాంబు దాడికి నిట్టనిలువ్ఞనా మట్టిగొట్టుకుపోయాయి. అలాగే సుమారు 300 మంది దాకా ఉగ్రవాదుల ప్రాణాలు అనంతవాయువ్ఞల్లో కలిసిపోయాయి.తీవ్రవాద సంస్థలకు, తీవ్రవాదాన్ని పెంచిపోషి స్తున్న పాక్‌కు దీటైన జవాబు మన సైన్యం ఇచ్చింది.

  • పిల్లా తిరుపతిరావ్ఞ