బడ్జెట్‌లో ఆదివాసులకు మొండిచేయి

   బడ్జెట్‌లో ఆదివాసులకు మొండిచేయి

TRIBES
TRIBES

తల్లిగర్భం నుంచి చరమాంకం వరకు ప్రతి దశలోను సంక్షేమం అమలు చేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం మాదే అంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఒకవైపు సకలజనుల శ్రేయస్సు, మరోవైపు ఆర్థిక సంక్లిష్టలు, ఇంకోవైపు ఎన్నికల ముంగిట నిలిచిన రాజకీయ అనివార్యత నేపథ్యంలో రాష్ట్ర భారీ బడ్జెట్‌పై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ మూడింటిని సమతుల్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

సంక్షేమ మంత్రాన్ని జపిస్తే ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నికల బడ్జెట్‌ను ఆవిష్కరించింది. ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన వర్గాలకు, సకల జనులకు కేటాయింపుల విందు భోజనం వడ్డించింది. దేశ వృద్ధి రేటు 7.3 శాతం ఉందని ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటు 10.6 ఉందని పేర్కొన్నారు. వ్యవసాయరంగం, పారిశ్రామికరంగం, సేవారంగం వృద్ధి ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతం వృద్ధిరేటు ఉంటుందని అంచనా వేశారు. జాతీయ సగటు తలసరి ఆదాయం 14.4 శాతం ఉందని రాష్ట్ర సగటు ఆదాయం 71 శాతం పెరిగిందని తెలిపారు.

అంటే జాతీయ ఆదాయం కన్నా తన రాష్ట్ర తలసరి ఆదాయం చాలా ఎక్కువ అని వివరించారు. ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమానికి అరకొర కేటాయింపులు ఎందుకు? 2019-20 ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2,26,117.53 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఖర్చు ఒక లక్షాఎనభై వేల 369.33 కోట్లు ఉంటుందని తెలిపారు. మూలధనం 29,596.33 కోట్లు మాత్రమే. కృంగదీస్తున్న రెవెన్యూలోటు రెవెన్యూ ఖర్చుకు, రెవెన్యూ ఆదాయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రెవెన్యూలోటు అంటాం.

రాష్ట్ర విభజన అనంతరం ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు కనిపిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 సంవత్సరంలో 14వ ఆర్థికసంఘం పేర్కొన్న ప్రకారం లోటును భర్తీ చేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చి నెరవేర్చలేదు. వాటి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయలేదు. 2014-15లో 16వేల 078.50 కోట్లు రెవెన్యూ లోటుగా లెక్కించారు. ఇందులో కేంద్రం 3970.50 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగతా 12,099.26 కోట్లు ఇప్పటికీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నులు, ఇతర ఆదాయాలు కాకుండా ప్రత్యేకసాయం కింద నిధులు దక్కుతాయని రాష్ట్ర అధికారులు భావించి ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌ పెంచారు.

దాదాపు 32 వేల కోట్ల రూపాయలు నెటికీ రాష్ట్రానికి అందలేదు. ఇందులో రెవెన్యూ లోటుతోపాటు పోలవరం ప్రాజెక్టు కోసం ఆశించిన 9వేల కోట్లు కూడా రాలేదు.ఈ ఏడాది రెవెన్యూలోటు 32వేల 398 కోట్లుగా చూపించారు. గత బడ్జెట్‌తోపోలిస్తే 20.3 శాతం అధిక లోటు పెరిగింది. ఆదాయం తక్కువగా ఉండటమే కాదు. భారీ రెవెన్యూలోటు మధ్య కేటాయించిన బడ్జెట్‌ ఆచరణలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 2,26,176 కోట్లతో సమర్పించిన బడ్జెట్లో ఆ స్థాయి ఆకాంక్షలు నెరవేరాలంటే ఆదాయం రాబట్టుకోవడం ప్రధానం.

ఈ బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయంగా రూ. 1,78,270 కోట్లని ఆర్థికశాఖ లెక్కించింది. ఇందులో సొంత ఆదాయం 75,438 కోట్లుగా లెక్కించారు. కేంద్రం నుండి పన్నుల రూపంలో రూ. 36,360 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. అన్నింటికన్నా కీలకమైంది కేంద్రం నుంచి వివిధ పథకాల కింద ఇతర రూపంలో 60,721వేల కోట్లు స్వయంగా దక్కుతుందని చూపించారు. ఆంధ్రరాష్ట్రంలో 34 గిరిజన తెగల ఆదివాసులు జీవిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 27 లక్షల 39వేల మంది ఉన్నారు. షెడ్యూల్‌ ప్రాంతమైన ఐదు జిల్లాలు 38 మండలాలు 4737 గ్రామాల్లో 5.53 శాతం మంది ఆదివాసులు ఉన్నారు.

మిగిలిన ఎనిమిది మైదాన జిల్లాల్లో గిరిజనులు నివసిస్తున్నారు. ఆదివాసుల ఉన్నత అభివృద్ధికి, సామాజిక ఆర్థిక అభివృద్ధికి పాలకులు కృషి చేస్తున్న ట్లు ఆర్భా´టంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం తోపాటు ఆదివాసీ నిరుద్యోగులకు నైపుణ్యం అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో ఉపాధి చూపిస్తున్నట్లు చెబుతున్న ఆచరణలో మాత్రం అంత ప్రయోజనం లేదు. సామాజిక సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ఆర్భాట ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర భారీ బడ్జెట్‌లో గిరిజనుల వాటా ఎంత?

గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర విభజన తర్వాత నేటి వరకు రాష్ట్ర బడ్జెట్లో 6770 కోట్లు మాత్రమే కేటాయించారు. మొత్తం కేటాయింపులో 4724 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో కూడా ఆదివాసుల పేరుతో కోట్లాది రూపాయలు దారిమళ్లించారు. మిగిలిన రెండువేల 46 కోట్లు ఖర్చు చేయలేదు. కేటాయించిన బడ్జెట్‌లో కూడా విద్యారంగానికి 59 శాతం ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులకు ఆహారం, ఉద్యోగులకు, టీచర్లకు జీతభత్యాలు చెల్లించడానికి సరిపోతుంది. అయినా నేటికీ 13 ఆదివాసీ తెగలు ప్రాథమిక పాఠశాలస్థాయిలో కూడా చేరుకోవడం లేదు.

ఆదివాసీ గ్రామాలలో మౌలిక వసతుల కల్పన కోసం, సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గిరిజన దళిత సంఘాలు పోరాట ఫలితంగా ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. చట్టం వచ్చినప్పటికీ రూల్స్‌, రెగ్యులేషన్స్‌ లేకపోవడం వల్ల ఇష్టానుసారంగా సబ్‌ప్లానింగ్‌ నిధులను దారి మళ్లీస్తున్నారు. ఆదివాసి ప్రాంతంలో ఉన్న సహజవనరులపై ఉన్న దృష్టి గిరిజన అభివృద్ధిలో లేదని మరోసారి రుజువైంది.
– పి.అప్పలనర్స (రచయిత: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంఘం)