నడిచే దేవుడు.. నడిపించే గురువు

Kanchi Sri Jayendra Saraswathi Shankaracharya
Kanchi Sri Jayendra Saraswathi Shankaracharya


అపార కరుణాసింధుం జ్ఞాణదం శాంతరూపిణమ్‌
శ్రీచంద్ర శేఖర గురుం ప్రణమామి ముదాన్వహమ్‌..
పరమాచార్య, మహాస్వామి, నడిచే దేవుడు, మహాపెరియవార్‌, పెరియ పెరియవార్‌.. ఇలా ఎన్నో నామాలతో భక్తిగా, ఆత్మీయంగా పిలిచే కాంచి కామకోటి పీఠాధిపతి, జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఇంకా తమతోనే ఉన్నారని భక్తుల విశ్వాసం. వారిని నేరుగా దర్శించుకొన్న అనుభూతులతో ఎంతో మంది ఆనందంగా జీవిస్తున్నారు. శతాబ్దకాలం జీవించిన ఆయన కాలం ఒక శతాబ్ధం. వారిచర్యలు విస్మయపరిచే విశేషాలు. సన్యాస ధర్మానికి ప్రతిరూపం, సనాతన ధర్మానికి ఆదర్శం.
శ్రీమతి మమాలక్ష్మీ అమ్మాళ్‌, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి దంపతులకు రెండవ సంతానంగా తమిళనాడులోని విల్లుపురంలో 1894లో జన్మించిన స్వామినాథన్‌ తన 13ఏళ్ల వయసులో జగద్గురు పీఠాన్ని అధిరోహించారు. హఠాత్తుగా తనకు సన్యాసం ఇవ్వబోతున్నారని తెలిసినా ఏమాత్రం చలించక చిన్నవయసులోనే అతి పెద్ద బాధ్యతలను సంతోషంగా స్వీకరించారు. ప్రపంచానికి ప్రణవాన్ని ఉపదేశించిన కుమారస్వామి గురువు అయినట్లు, ఆయన పేరుతో స్వామినాథన్‌ అని పిలువబడే ఈయన జగద్గురువైనారు.
తల్లి వద్ద శ్లోకాలు, తండ్రివద్ద సంగీతం చిన్ననాడే నేర్చుకున్న స్వామినాథన్‌, మిషనరీ స్కూలులో బైబిల్‌ కంఠస్థం చేసి బహుమతి పొందాడు. షేక్‌స్పియర్‌ ఆంగ్ల నాటకంలో ముఖ్యపాత్ర పోషించి ప్రశంసలందుకున్నారు. తరువాతి కాలంలో ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌ భాషలలో ప్రావీణ్యాన్ని పొందారు.
స్వామినాథన్‌ 1907, ఫిబ్రవరి13న శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామిగా అవతరించిన తర్వాత మళ్లీ తన తల్లిదండ్రులను కలవలేదు. తనకు సన్యాసదీక్షనిచ్చే గురువు లేనందున స్వయంగానే దండం, కషాయమంత్రం స్వీకరించిన ఈయనను ‘స్వయంభూ స్వామిగా పిలిచేవారు.
కుంభకోణంలో 1907,మే 9న ఛత్రపతి శివాజీవారసులు, ఎందరెందరో జమిందారుల సమక్షంలో జగద్గురువుగా పట్టాభిషిక్తులయ్యారు. 1911-14 కాలంలో వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వీణావాదనం, శిల్పశాస్త్రం, పురావస్తుశాస్త్రం, తాళపత్రగ్రంథ పరిష్కరణంలో నిష్ణాతులయ్యారు. 1918 నుంచి 1939 వరకు 21ఏళ్లు సంపూర్ణ భారతదేశాన్ని పాదయాత్ర ద్వారా పవిత్రం చేస్తూ, అన్ని మతాల వారిని గౌరవిస్తూ, దైవం ఒక్కటే అని బోధిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో కొత్తవెలుగులు నింపారు. పాదయాత్రలో భాగంగా రామేశ్వరంలో 3 కి.మి రైలు వంతెనపై నడిచారు. పాదయాత్ర సమయలో దేశ స్వాతంత్య్రం కోసం పరితపిస్తూ పోరాడుతున్న ఎంతో మంది దేశభక్తులను కలిసారు. 1931లో చిత్తూరు, కాళహస్తి మీదుగా సంచరిస్తూ 1934లో హైదరాబాద్‌ చేరి ఫిబ్రవరి 12 అప్పటి నైజాం నవాబు చేత అసాధారణ గౌరవాన్ని పొందారు. 1939లో మళ్లీ కుంభకోణంలోని తమమఠానికి చేరి దీనజనోద్ధరణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో ప్రముఖమైనది ‘పిడి అరసి దిట్టం (పిడికలి బియ్యం). ప్రతిరోజు వంటచేసేముందు ప్రతి ఇల్లాలు ఒక పిడికిలి బియ్యం, ఒక రూపాయి కాసు, డబ్బాలో వేసి నెలకోకసారి ఆ ఊరి గుడిలో సమర్పించాలి. ఆ ద్రవ్యంతో అన్న సంతర్పణ అన్ని ఊళ్లలో అనునిత్యం జరిగేది.
1927,అక్టోబర్‌ 15న మహాత్మాగాంధీ కేరళలో ఉన్న మహాస్వామి వద్దకు వచ్చారు. అప్పుడు గాంధీజి వయసు 57ఏళ్లు. స్వామికి 33ఏళ్లు.వీరి సంభాషణలో దేశం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను స్వామి సూచించారు. స్వదేశీ ఉద్యమాన్ని తాను కూడా అనుసరిస్తూ విదేశీ వస్తు బహిష్కరణతో పాటు విదేశీ భావజాలాన్ని వదులుకోవడం ముఖ్యమని సూచించారు.
1947,ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, భారత పతాకంలోని అశోక ధర్మచక్రం యొక్క అర్థాన్ని, గొప్పతనాన్ని వివరిస్తూ నైతికవిలువలు కాపాడుకోవాలని ఎన్నో ప్రసంగాలు చేసారు. భగవద్గీతలోని ‘ఏవం ప్రవర్తితం చక్రం అనే శ్లోకంలో భగవంతుడు ఉపదేశించినది ఇదే అని వివరించారు.
1967లో స్వామివారు 60ఏళ్లు పీఠాధిపతిగా వెలుగొందిన సందర్భంలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు సంస్కృతంలో స్వాగతం పలికారు. 1978లో 84 సంవత్సరాల వయసులో పాదయాత్ర మళ్లీ ప్రారంభించారు. రోజుకు 25కి.మి నడిచేవారు. 90ఏళ్లల్లో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించారు.
టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా 1991లో చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామిని దర్శించి ‘ఓంన్లీ మంక్‌ ఆఫ్‌ సెంచరీ అని ప్రశంసించారు.
వీరి అనుగ్రహవిశేషాలను, తపోశక్తి వైభవాలను ఇప్పటికీ ఎంతో మంది చర్చించుకుంటూనే ఉంటారు. ప్రపంచానికి సన్మార్గాన్ని ఉపదేశించి, సనాతన ధర్మాన్ని పరిపుష్టం చేసిన ఈ జగద్గురువు జగత్తు తన గురువని భావించారు. ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవాయ యుగేయుగే అనువచనం సార్థకమని నిరూపించారు. ఆయనను స్మరించడమే ఒక పుణ్య విశేషం.
-గుళ్లపల్లి శ్రీనివాస్‌
రిజిస్ట్రార్‌, శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వమహావిద్యాలయం,
కాంచీపురం.