జారుడు మెట్లపై దేశ విద్యారంగం

                        జారుడు మెట్లపై దేశ విద్యారంగం

education system
education system

నాటికీ ఎంతో మంది పేదవాళ్లు మన దేశంలో ఉన్నత విద్యను పొందగలుగుతున్నారంటే అది కేవలం మన దేశాన్ని సుదీర్ఘకాలంపాటు పరిపాలించిన బ్రిటీషువారి చలవే అని చెప్పుకోక తప్పదు. ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని, ఈనాటికీ ఎన్నో విమర్శలకు లోనవుతూ, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని విజయవంతంగా నడుస్తున్న మన విద్యావ్యవస్థ ఒకప్పటి బ్రిటీషువారు ప్రారంభించిందే. అబ్దుల్‌కలామ్‌ వంటి దేశం గర్వించ తగ్గ వ్యక్తులు, అత్యంత దిగువ స్థాయి నుండి ఉన్నతమైన స్థానాల కు ఎదగగలిగారంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలు/కళాశాలల వల్లే ఇది సాధ్యపడింది. ఒకప్పుడు పల్లెటూర్ల దగ్గర నుండి చిన్న పట్టణాల వరకు కలెక్టరు కొడుకు నుంచి, కార్మికుడి కొడుకు వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యనభ్యసించినవాళ్లే. ఇంజినీరింగైనా, మెడిసిన్‌ అయినా విశ్వవిద్యాలయంలోని ఉన్నత చదువైనా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ కళాశాలలే కామధేనువులుగా నిలిచేవి.కాలక్రమేణా అన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నట్టే, విద్యావ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుని, నేడు పతనావస్థలో అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టమిట్టాడుతోంది.

ఆత్మహత్యా సదశ్యమైన మొట్టమొదటి తప్పటడుగు, 1960లోనే పడింది. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్వదేశీ అభిమానంతో, బ్రిటీషువారి మీదనున్న ద్వేషభావంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల భాషను రద్దు చేశాయి. ఆ దెబ్బతో చాలామంది ఉన్నత విద్యావంతులైన తల్లిదం డ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపటం మాన్పిం చారు. రెండో తప్పటడుగు ప్రాథమికోన్నత విద్యను ప్రారంభించి నప్పుడు పడింది. ప్రతి రాష్ట్రం ప్రాథమికోన్నత విద్యకోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి, విధి విధానాలనైతే రూపొందించింది కానీ ఆచరణలో మాత్రం చతికిలపడిందనే చెప్పవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే అరకొర సౌకర్యాలతో, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాయి నేటి ప్రభుత్వ పాఠ శాలలు. దీనికితోడు విద్యారంగంలో కూడా మాఫియా చొరబడి, పరీక్షా పత్రాలను బహిరంగపర్చటం, సామూహింకగా కాపీలు కొట్టించటం వంటి అనేక అనైతిక కార్యకలాపాలకు తెరలేపాయి.

ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో నడుస్తున్న పాఠశాలల ప్రతిష్ట దిగజారటంతో ఎంతోమంది విద్యార్థులు సి.బి.ఎస్‌.ఇ. లేదా ఐసిఎస్‌. ఇటువంటి కేంద్ర ప్రభుత్వం హయాంలో నడుస్తున్న పాఠశాలలకు తరలిపోయారు. ఈ రెండో దెబ్బతో తెలివిగల విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి కూడా చూడటం మానుకున్నారు. 1960 నాటినుంచే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీలు తమ పునాదులు ఏర్పరచు కున్నాయి. ముఖ్యంగా వామపక్ష పార్టీలు యువతను తమవైపు తిప్పుకోవటంలో సఫలీకతులయ్యారు. గత కొంత కాలంగా ఎన్నో నష్టదాయకమైన విధానాలు విద్యారంగంలో అమలవుతూ వస్తున్నా, ఎవ్వరూ వీటిపై ఆందోళన వెలిబుచ్చకపోవటం మన దేశంలో విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులను పట్టించుకోకుండా ఐఐటిలు, ఐఐఎమ్‌లు లక్షల్లో ఫీజులు పెంచినప్పుడు ఒక్కరు కూడా ఇది అన్యాయమని ప్రశ్నించినవాళ్లు లేరు. అధిక ఫీజులు, అరకొర ఉద్యోగావకాశాలతో విద్యార్థులకు వత్తి విద్యలపై మొహమెత్తి ప్రైవేటు కళాశాలల వైపు కన్నెత్తి చూడకపోవటంతో 50 శాతంకు పైగా కళాశాలల్లో సీట్లు ఖాళీగా మిగులుతున్నాయి.

సంప్రదాయ కోర్సుల పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా తయారైంది. పేరొందిన కళాశాలల్లో సైతం పెద్ద ఎత్తున సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ రోజున అసలు యువత తామేమి చదువుతున్నాం అనే దానిగురించి ఏమాత్రం చింతించకపోవటం ఆలోచించాల్సిన విషయం. ఏమి చదివినా ఏ ఉపయగోం లేదని వారి మనసులో నాటుకుపోయింది.దేశంలో విద్య ఖరీదైన వస్తువుగా మారటంతో, ఆ ఖర్చే విదేశాల్లో పెడితే ఉద్యోగాలన్నా వస్తాయని, తెలివిగల విద్యార్థులందరూ విదేశాలకు తరలివెళ్లటం మొదలయ్యింది. మేధో వలసల వల్ల ఒకప్పుడు విజ్ఞాన భాండాగారంగా వెలుగొందిన దేశం అజ్ఞానపు చెత్తకుండీగా మారుతోంది. ట్రంప్‌ విధానాల వల్ల కొంత వలస తగ్గినా, మరో దేశం వైపు విద్యార్థులు చూపు మర్చలకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దేశంలో విద్యావ్యవస్థను గాడిలో పెట్టటానికి కేంద్ర ప్రభుత్వం యు.జి.సి., ఎ.ఐ.సి.టి, ఎమ్‌.సి.ఇ. వంటి అనేక నియంత్రణా సంస్థలను స్థాపించింది. వాటి పనితీరు ఏమాత్రం చెప్పుకోతగ్గ స్థాయిలో లేదని, 2009లో యు.జి.సిని, ఎ.ఐ.సి.టి. రెండింటిని కలిపి, ఎన్‌.సి.హెచ్‌.ఇ.ఆర్‌. అనే ఒకే జాతీయ సంస్థను స్థాపించాలని చూసింది కేంద్ర ప్రభుత్వం.

2017లో ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లి, దాని స్థానంలో ‘హీరా అనే నియంత్రణ సంస్థను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇది తెరవెనకకు జరిగి కొత్తగా హెచ్‌.ఇ.సి.ఐ. తెరమీదకు వచ్చింది. హెచ్‌.ఐ.సి.ఐ. తన కార్యకలాపాలు మొదలెట్టకముందే దేశవ్యాప్తంగా ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దీనికి కారణం హెచ్‌.ఇ.సి.ఐ.కి ఎటువంటి ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవటమే. పేర్లు మార్చినంత మాత్రాన, పైపై మెరుగులు దిద్దినంత మాత్రాన విద్యావ్యవస్థలోని లోపాలను అధిగమించగలం అనుకోవటం మన అధికారుల అవగాహనా రాహిత్యమే. మన దేశంలో విద్యావ్యవస్థ తిరిగి పునర్వైభవం సాధించాలంటే, పునాదులను మళ్లీ పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం నేడు ఎంతైనా వుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి విద్యను పనర్నిర్విచించాల్సిన అవసరం వుంది. ఐఐటీలు,ఐఐఎమ్‌ లో సీటు సాధిస్తే వాళ్లు తెలివిగలవాళ్ల కింద పరిగణించటం మనకు అలవాటయ్యింది.

ఇంటర్‌లో 900 మార్కులు పైబడి సాధించిన లక్షల మందిలో కేవలం 20000 మంది కూడా ఐఐటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారంటే వీరందరిని తెలివి గలవాళ్లనాలా? ఇటువంటి జ్ఞానం లేనివారితో ఉన్నత విద్య ఉన్న త శిఖరాలకు చేరుతుందనుకోవటం అజ్ఞానమే అవుతుంది. 2014-15లో 1,10,337 కోట్ల రూపాయలున్న విద్యాశాఖ బడ్జెట్‌, 2017-18 నాటికి 79,685 కోట్లకు పడిపోయింది. విద్యారంగంపై వెచ్చిస్తున్న బడ్జెట్‌ ప్రపంచ సగటు 4.8 శాతం వుండగా, మన దేశంలో ఇది సగానికి సగం అనగా జడిపిలో కేవలం 2.4 శాతం. ఇంత తక్కువ ఖర్చుతో అద్భుతాలు చెయ్యాలంటే ఏ దేశంలోని విద్యా వ్యవస్థకు సాధ్యంకాదు. దీనినిబట్టే అర్థమౌతోంది మన ప్రభుత్వాలు మన విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగం వైపు నెడుతున్నారని. ఎన్నో రకాల కోర్సులు, విద్యలున్నా కేవలం ఉపాధిని దష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది విద్యార్థులు కేవలం ఇంజినీరింగ్‌ వంటి కోర్సుల వైపే మళ్లటంతో సమాజంలో సమతుల వాతావరణం సన్నగిల్లింది.

చరిత్ర, సామాజిక శాస్త్రం, గ్రామీణాభివద్ధి వంటి కోర్సులు చదివేవారు కరువయ్యారు. తద్వారా విద్యార్థుల్లో సామాజిక స్పృహ కరువై నేరాల సంఖ్య పెరుగుతోంది. ఒకే రకమైన కోర్సులను అందించే కళాశాలలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం కూడా ఈ పరిణామాలకు మరో కారణం. కళాశాలల సంఖ్య పెరగటంతో నాణ్యత లోపించి, అరకొర చదువులతో బయటపడే విద్యార్థులకు ఉద్యోగం దొరకటం కష్టంగా మారుతోంది.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి విద్యావ్యస్థపై సమగ్ర అధ్యయనం చేసి, ప్రక్షాళనకు పూనుకోకపోతే ముందు తరాల భవిష్యత్తును కాలరాసినవాళ్లమౌతాం. అమెరికా సామాజికవేత్త మాల్కమ్‌ అన్నట్లు- రేపటికోసం పాటుపడే నేటి యువతకు, విద్య భవిష్యత్తుకు పాస్‌పోర్టు లాంటిది. కేవలం ఆకర్షణీయమైన పథకాలు, ప్రణాళికలు, సదస్సులు, సమావేశాలతో దేశంలో 1.4 బిII యువత భవిష్యత్తు పట్టాలపైకి ఎక్కించలేం. దానికి చిత్తశుద్ధి, చెమటోడ్చే తత్వం, ఉదారంగా నిధులు కేటాయించే ప్రభుత్వం కావాలి. అప్పుడు తప్పకుండా మార్పును చూడగలుగుతాం.
– ఈదర శ్రీనివాసరెడ్డి