జలవనరులకు ఒకే ట్రిబ్యునల్‌

Krishna Water
Krishna Water

జలవనరులకు ఒకే ట్రిబ్యునల్‌

దక్షిణాదికి చెందిన ఆరు రాష్ట్రాల జలవనరుల తొలి సమావేశంలో తీసుకున్న తీర్మానాలపై హైదరాబాద్‌ డిక్లరేషన్‌ వెలువడింది. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి ఆర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ నేతృత్వంలో తాజాగా జరిగిన హైదరా బాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జల వనరుల ప్రాంతీయ సదస్సు లో స్పష్టం చేశారు. జల వివాదాలను పరిష్కరించుకునేందుకు జాతీయ స్థాయిలో ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునళ్లు ఉండవు,

నదుల వారీగా ట్రిబ్యునల్‌ వల్ల డబ్బు వృధా అవుతుందని, కాలయాపన జరుగుతున్నదని కేంద్రమంత్రి అన్నారు తమిళనాడు-కర్ణాటకల మధ్య జలవివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆరు వారాల్లో కావేరి మేనేజ్‌మెంట్‌ బోర్డు, కావేరి రెగ్యులేటర్‌ అథారిటిని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకటించారు. రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు పెంచుతాం. నాబార్డు వంటి సంస్థలు లేదా ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు చేయిస్తామని తెలియజేశారు.

దక్షిణాది రాష్ట్రాల జలవనరుల సమావేశం హైదరాబాద్‌ డిక్లరేషన్‌గా పిలవవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య జలజగడాలు జాతీయ అభివృద్దికి ఆటంకమని కేంద్ర జలవనరుల సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ అన్నారు. జల వివాదాలకు చరమగీతం పాడవలసి ఉందన్నారు. కోర్టులు, ట్రిబ్యునల్‌ వల్ల కాలయాపన, వృధా ఖర్చు జరుగుతోందని చెప్పారు. ఏళ్ల తరబడి జాప్యం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. సమస్య ఎంత త్వరగా పరిష్కారమైతే అంత త్వరగా అభివృద్దికి వీలవుతుందని తెలిపారు. ఈ సదస్సు రొటీన్‌ సమావేశం కాదన్నారు. ఇందులో చేసే తీర్మానాలతో జల వివాదాల పరిష్కారం దిశగా రోడ్‌ మ్యాప్‌ సిద్దమవు తోందని కేంద్ర మంత్రి అన్నారు. జల వివాదాల పరిష్కారం ప్రధాని నరేంద్రమోడీ ప్రాధాన్యతలలో ఒకటని అర్జున్‌రామ్‌ గుర్తు చేశారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి ఆయా సమస్యల ముగింపునకుగాను కార్యాచరణ ఖరారుకు తనను కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ పంపారని తెలిపారు. జలవివాదాలు సత్వరం పరిష్కరించాలని ప్రధాని కోరుతున్నట్లు అర్జున్‌రామ్‌ చెప్పారు. సంక్లిష్టమైన వ్యవహారాలను ఇంకా జటిలం చేయొద్దని ఆయన దక్షిణాది ఇరిగేషన్‌ మంత్రులు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో సహా ఆరు రాష్ట్రాల అధికారులు,ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీలు, కేంద్ర జలసంఘం చైర్మన్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జల వివాదాలపై జాతీయ స్థాయిలో ఒకే ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు కేంద్ర జలవనరుల మంత్రి అర్జున్‌రామ్‌ చెప్పారు. మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్‌ సమావేశాలలో ఈ బిల్లును ఆమోదించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. జల వివాదాలకు సంబంధించి ఒక రాష్ట్రం కోసం ఒక ట్రిబ్యునల్‌ పెట్టడం వల్ల ఏళ్ల తరబడి కాల యాపన జరుగు తున్నదని మంత్రి హరీష్‌రావు అన్నారు. దీంతో దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కరించలేక పోతున్నట్లు తెలిపారు.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఇప్పటి వరకు తుది తీర్పు రాలేదన్నారు. ఏపి ఫిర్యాదులు, అభ్యంతరాల పట్ల కేంద్ర మంత్రి విస్మయం ప్రకటించారు. తెలంగాణలో సాగునీటి వసతి పెరిగితే అది దేశానికే మంచిదని, పాకిస్తాన్‌కు కాదని ఆయన ఏపికి చురకలంటించారు. ఆర్డీఎస్‌ ఆధునీకరణ పనులకు ఏపి అవరోధాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు.

కేంద్రం జోక్యం చేసుకుని సత్వరం ఆర్‌డిఎస్‌ ఆధునీకరణ పనులు పూర్తయ్యేలా చూడాలని మంత్రి కోరారు. తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదని, పాతవి, ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం పాత ప్రాజెక్టు అని కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించిన విషయాన్ని గుర్తు చేశారు.

– వైఎన్నార్‌