కాదేదీ అవినీతికి అనర్హం!

Corruption
Corruption

అవినీతి నిర్మూలనకు సరైన చట్టాలు లేని కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.అవినీతి మహమ్మారి ఎయిడ్స్‌, క్యాన్సర్‌ వ్యాధులకన్నా ప్రమాదకరం.నేడు మనదేశంలో రాజకీయరంగంలో అవినీతి తారాస్థాయికి చేరింది. సామాన్య పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్తే చెయ్యి తడపనిదే ఫైలే కదిలే పరిస్థితి లేదు. లంచం, లంచం, లంచం అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అటెండర్‌స్థాయి నుంచి పైస్థాయి అధికారులవరకు జలగల్లా రక్తాన్ని పట్టిపీడిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం నుంచి మనదేశం అభివృద్ధిచెందుతున్నా దీనంగానే పరిగణించబడుతుందంటే కారణం అవినీతియే.


లం చం తీసుకునే వాడికే కాదు, ఇచ్చేవారికి కూడా ఇకపై కఠిన శిక్షలు పడుతున్నాయి. ఈ మాటలు మనం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వింటున్నాం. విన్నప్పుడు బాగానే అనిపిస్తుంది. కానీ ఏదైనా ప్రభుత్వ ఆఫీసుకు వెళ్లితే మన జేబులకు చిల్లుపడుతున్న పరిస్థితి నేటికీ ఉంది. ఇప్పటికీ అవినీతి కట్టడి కోసం దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ చాలామంది అధికారులు వాటిని ఖాతరు చేయడం లేదు. దీంతో పాత అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ తాజాగా బిల్లును పార్లమెంటులోని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి పద్ధతిలో ఓటింగ్‌ జరగగా సభ్యులు ఏక గ్రీవంగా మద్దతు తెలిపారు. నిబంధనల సవరణతో ఇకపై లంచం తీసుకునేవారికి మూడు నుంచి ఏడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించొచ్చు.

అలానే లంచం ఇచ్చేవారికి కూడా ఇదే తరహాలో ఏడేళ్ల వరకు జైలుశిక్ష జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనలు వ్యక్తులకే కాదు, సంస్థలకి కూడా వర్తించనున్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వచ్చినవారు వారం రోజుల్లోపు అవినీతి నిరోధక అధికారులకు సమాచారం అందించి శిక్ష నుంచి మినహాయింపు పొందవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. అవినీతి కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈ మేరకు నియమ నిబంధనలను సవరించి నట్లు ఆయన వివరించారు. ఇక ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంది.. అవినీతి నిర్మూలనకు సరైన చట్టాలు లేని కారణంగా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

రోజురోజుకీ అవినీతి పెచ్చరిల్లిపోతోంది. అవినీతి మహమ్మారి ఎయిడ్స్‌, క్యాన్సర్‌ వ్యాధులకన్నా ప్రమాదకరం.నేడు మనదేశంలో రాజకీయరంగంలో అవినీతి తారాస్థాయికి చేరింది. సామాన్య పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్తే చెయ్యి తడపనిదే ఫైలే కదిలే పరిస్థితి లేదు. లంచం, లంచం, లంచం అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అటెండర్‌స్థాయి నుంచి పైస్థాయి అధికారులవరకు జలగల్లా రక్తాన్ని పట్టిపీడిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం నుంచి మనదేశం అభివృద్ధిచెందుతున్నా దీనంగానే పరిగణించబడుతుందంటే కారణం అవినీతియే. భారతదేశంలో అవినీతి మర్రిచెట్టు ఊడల్లా బలంగా వేళ్లూనుకుని ఉంది.

ఇక ప్రతి సంవత్సరం అమెరికా కేంద్రంగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ నివేదికలో ప్రపంచదేశాల్లో మన భారతదేశం అవినీతిలో ముందంజలో ఉండటం బాధాకరం. నేపాల్‌ శ్రీలంక,పాకిస్థాన్‌ లాంటి దేశాల్లో అవినీతి మనదేశం కన్నా తక్కువే. కొత్తగా ఏర్పడ్డ 29వ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రెవెన్యూ ట్రెజరరీ, సబ్‌-రిజిస్ట్రార్‌, ఆర్డీఏ, పోలీస్‌, ఫైర్స్‌, పంచాయతీరాజ్‌,విద్యుత్‌శాఖ, సచివాలయం, అబ్కారీ,వైద్య విధాన పరిషత్‌, పరిశ్రమలు, విద్యాశాఖ, న్యాయస్థానాలు మొదలగు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి కేరాఫ్‌ అడ్డాలుగా మారాయి. అవినీతి అధికారులు ఇండ్లపై దాడులు చేస్తూ వారిని ప్రత్యక్షంగా పట్టుకునే పరిస్థితి లేదు.

నిత్యం టీవీల్లో,న్యూస్‌ పేపర్లలో ఎసిబి అధికారులు అవినీతిపరులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చూడని రోజంటూ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. వేల లంచావతారుల్లో ఎప్పుడో ఎక్కడో, ఒక్కరో, ఇద్దరో దొరుకుతారు. అది కూడా లంచం బాధితులు ఇచ్చే సమాచారం పుణ్యమా అని దానికి ఎసిబి అధికారులు వెంటనే స్పందించి రంగంలోకి దిగితేనే. లంచావతారులు మెక్కింది మొత్తం తామే అయినా, ఇతర నీతి నిజాయితీ అధికారులకు ఇందులో వాటాలు అని మరీఎక్కువ నొక్కేస్తారు. ఒక్కసారి ఈ వ్యసనానికి అలవాటుపడితే అధికారులు ఫుల్‌స్టాప్‌ పెట్టలేరు. అవినీతి అధికారులను పట్టుకున్నప్పుడు ప్రముఖంగా మీడియా ప్రచారమే ఎక్కువగా చూపిస్తుంది.

అవినీతి అధికారులను పట్టుకున్నప్పుడు వారి యావత్‌ ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకున్నట్లయితే మన చట్టాల్లో కూడా మార్పులు చేస్తే కేంద్ర,రాష్ట్ర సంస్థల్లో అవినీతి అంతమవ్ఞతుంది. ఇందుకు కేంద్ర న్యాయశాఖ, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో కీలకపదవ్ఞల్లో ఉన్న అన్ని రాజకీయ నాయకులతోపాటు అధికారులు నడుం బిగించాలి. నిత్యం లంచాలకు నిలయమైన కొన్ని అతి కీలక ఉన్నత పదవ్ఞలకు లక్షల్లో, కోట్లల్లో, రాజకీయ ప్రముఖ వ్యక్తుల పైరవీలు అని అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియాల్లో వార్తలు చూస్తుంటాం. ఎసిబి అధికారులు నిత్యం నిఘా ఉంచితే ఆదిలోనే అంతం పలకవచ్చు.

అతికీలక పదవ్ఞల్లో ఉన్నవారు ప్రతి ఆరు లేక మూడు నెలలకి తమ స్థిర,చరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని వారిపై సదా నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇక గ్రామాల్లో నిశితంగ పరిశీలిస్తే అవినీతి మూలంగా సిసిరోడ్లు నాలుగు నెలలకే పగుళ్లు పడడం, రేషన్‌ తూకంలో మోసాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని గుడ్లు, పాలు సహా సరుకులు బ్లాక్‌ మార్కెట్లోకి తరలడం. ఇక రెవెన్యూ పట్టాదారు పాసుపుస్తకాలు సాదా బైనామాలలో డబ్బులు ఇవ్వనిదే పనులు కాకపోవడం, హెల్త్‌ సెంటర్ల నుంచి మందులు ప్రైవేట్‌ మెడికల్‌ షాపులకు తరలడం, అక్రమ విద్యుత్‌ వినియోగంతోపాటు వాటర్‌ వర్క్స్‌లో అక్రమ నల్లా కనెక్షన్‌, వరకు అవినీతే.

ఇక మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇండ్ల పర్మిషన్లు, డెత్‌సర్టిఫికెట్లు, పుట్టినతేదీ సర్టిఫికెట్లతోపాటు కులం, ఆదాయం, రేషన్‌కార్డు తదితరాలు అవినీతికి అడ్డాగా మారాయి. ఇటీవల ఇసుక దందా రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. అటవీ ప్రాంతాల్లో కొంత మంది అవినీతి ఫారెస్టు అధికారులే టేకు కలపను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. రెండోసారి బంగారు తెలంగాణాకు ముఖ్యమంత్రి అయిన కెసిఆర్‌ గతంలో వరంగల్‌ సభలో మాట్లాడుతూ ‘లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అని పత్రికలు, మీడియా మాధ్యమాల్లో వచ్చినా ముఖ్యమంత్రి మాటలను ఆచరణలో ఎవరూ పాటించడం లేదు.

అందుకే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెంటర్లలో ప్రభుత్వ ప్రకటనల్లో, ప్రభుత్వ యార్డులలో రైతుల పాసుపుస్తకాల్లో, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు పోస్టర్లు పౌరసేవా పత్రాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామపంచాయతీ గోడలు మొదలుకొని ముఖ్యమంత్రి ఆఫీసు గోడల దాకా ఎసిబి సమాచారాన్ని తెలపాలి. ప్రతి పౌరునికి ఎసిబి సమాచారం తెలియచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అవినీతిపై నిరంతరం పోరాటం మండల ఆపీసు నుంచి సచివాలయం వరకు సాగాలి. వ్యవస్థలను అవినీతితో తమకు అనుకూలంగా మలుచుకుంటున్న ప్రైవేట్‌రంగంపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ పని ఎవరు చేయాలి?ప్రభుత్వం తగు అవినీతి వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేసి పనిచేయించాలి. ఈ పోరాటంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. తాము ఏదైనా సమాచారం అందిస్తే అధికారులు గోప్యత పాటించి చర్యలు తీసుకుంటారన్న భరోసా ప్రజలకు కల్పించాలి. శాశ్వతంగా అవినీతి పరులను ఉద్యోగాల నుంచి తొలగించినప్పుడే అవినీతి రూపుమాపవచ్చు. అందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చేస్తే, అవినీతి లేని భారతదేశం మార్పుకు నాంది పలుకుతుంది. లేని పక్షంలో అభ్యుదయ రచయిత శ్రీశ్రీ చెప్పినట్లు ‘కాదేదీ అవినీతికి అనర్హం అన్న పదాలు ఇంకా మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు వినియోగించాల్సి ఉంటుంది.

మన్నారం నాగరాజు(అధ్యక్షుడు తెలంగాణ లోక్‌సత్తా పార్టీ)