అర్హతకు తగిన ఉద్యోగ కల్పనతోనే అభివృద్ధి

employment
employment

అర్హతకు తగిన ఉద్యోగ కల్పనతోనే అభివృద్ధి

భారతదేశంలో స్వయం ఉపాధికంటే స్థిరమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుం దని ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. భారత స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాల నాటికి 2047 ప్రపంచ మధ్యతరగతి జాబితాలో చేరాలనే లక్ష్యం నెరవేరాలంటే స్వయం ఉపాధి కన్నా శాశ్వత ఉద్యోగాలు పెరుగుదలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచబ్యాంకు తెలిపింది.

సిస్టమేటిక్‌ కంట్రీ డయా గ్నస్టిక్‌ డ్రాఫ్ట్‌ ఫర్‌ ఇండియా పేరిట విడుదలైన ఈ నివేదిక భారత్‌పై రూపొందించడం ఇదే తొలిసారి. ఇదే అంశాన్ని మరో సందర్భంలో నీతి అయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రస్తావిస్తూ భారతదేశం లోని యువతకు తాము చదివిన చదువ్ఞకు తగ్గ ఉద్యోగాలు దొర కక, తక్కువ స్థాయి ఉద్యోగాల్లో సర్దుకుపోలేక తీవ్ర నిరాశలో కూరు కుపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువ జనాభా కల మనదేశంలో ఇటువంటి పరిణామాలు సంభవించడం దేశాభివృద్ధికి అతిపెద్ద విఘాతం అని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థి తులను గ్రహించకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఐదంకెల జీతం తో కూడిన వైట్‌ కాలర్‌ ఉద్యోగాలను కోరుకోవడంతోనే అసలు సమస్య తలెత్తుతోంది.

భారతదేశం ఆర్థికరంగంలో ప్రపంచ దేశాల తోపోటీపడుతున్న ఈ సమయంలో ఉద్యోగ కల్పన అధిక ప్రాధా న్యం సంతరించుకుంది. ఒకపక్క సాంకేతిక విజ్ఞానం పెరుగుతున్న ఈ యుగంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్‌, రాబోటిక్స్‌ వంటి నూతన అంశాలు ప్రతి రంగంలో చొచ్చుకుపోతుండడంతో ఉద్యోగ కల్పన పెనుసవాలుగా మారుతోంది. తీవ్ర అసమానతలు నెలకొన్న భారత్‌లో క్రమబద్ధమైన, వేతనాలతో కూడిన ఉద్యోగాలు సృష్టిం చడం తక్షణ ప్రాధాన్యత సంతరించుకుని ఇలాంటి ఉద్యోగాలతోనే దేశంలో పేదరిక నిర్మూలన సాధ్యమవ్ఞతుంది. కేవలం ఉద్యోగాల సంఖ్య పెరగడం ముఖ్యంకాదని, ఏ తరహా ఉద్యోగాలనేది కూడా ముఖ్యం. ప్రపంచ మధ్యతరగతి జాబితాలో భారత్‌ చేరాలంటే వేత న జీవ్ఞలు ఎక్కువ మంది ఉండాలి.

భారత్‌లో మధ్యతరగతి ప్రజల కోసం సృష్టించబో తున్న ఉద్యోగాల్లో కేవలం ఐదవంతు మాత్రమే వేతనాలతో కూడిన ఉద్యోగాలు ఉన్నాయి. 2017-18 ఆర్థిక సర్వే ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం ఏడాదికి 6.5 శాతం పెరు గుతుందని తెలిపారు. దీని ప్రకారం 2020 నాటికి ఎగువ మధ్య తరగతి ఆదాయంగల దేశంగా భారత్‌ మారుతుందని ప్రపంచ బ్యాంక్‌తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో తలసరి ఆదాయం 6,588 డాలర్లు. ఇది అమెరికా కొనుగోలు శక్తిలో 12 శాతం. పెరుగుతున్న యువజనాభాకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యో గాల కల్పనలో అధిక జనాభా భారత్‌కు అవరోధం కానుంది.

2005 నుంచి 2012 మధ్యకాలంలో భారత్‌ ఆర్థికవ్యవస్థ ఏడాదికి మూడు మిలియన్ల కొత్త ఉద్యోగాలు సృష్టించింది. అయితే ప్రతి ఏ డాది పనిచేసే వయస్సు జనాభా 13 మిలియన్లు పెరిగిందని తెలిపింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సమాచారం ఆధారంగా గత ఏడాది ఏడు మిలియన్ల ఉద్యోగాలు కల్పించబడినట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక తెలిపినట్లు బ్యాంక్‌ పేర్కొంది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఊహాలోకాల్లో విహ రిస్తున్న యువత తమకు దొరుకుతున్న చిరుద్యోగాలలో ఇమడలేక నిరాశానిస్పృహలతో నిండి ఉంది. వారిని ఈ పరిస్థితుల నుండి బయటపడేయాలంటే వారినైపుణ్యాలను పెంపొందించాల్సిన అవస రం ఉంది. అంతర్జాతీయ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ప్రపంచ వస్తు ఉత్పత్తి దేశాలైన దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, చైనా వంటి దేశాలతో పోటీపడాలంటే ‘మేకిన్‌ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లిఅంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఉత్పత్తి సాధించగలిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మరోపక్క చైనా వంటి దేశాల్లో శ్రామికుల వయస్సు మీద పడడం, వారికి చెల్లిస్తున్న వేతనాలు అధికంగా ఉండడంతో ఆ దేశ పరిశ్రమలు మన యువ శ్రామిక శక్తివైపుదృష్టి సారిస్తున్నాయి. జాతీయ సాంపిల్‌ సర్వే సంస్థ జరిపిన సర్వేప్రకారం దేశంలో జరుగుతున్న అభివృద్ధి ఉద్యోగర హిత అభివృద్ధిగా వర్ణించింది. గత మూడు దశాబ్దాలుగా స్థిరమైన, తక్కువ శాతం నిరుద్యోగిత దేశంలో నమోదవ్ఞతోంది. సమస్య ఉద్యోగిత కాదు. అర్హతలు కన్నా తక్కువ ఉపాధి లభించడం. అతి తక్కువ వేతనాలకు పనిచేయాల్సి రావడం.

ఈ సమస్యను అధిగ మించానికి 2017-18 నుండి 2019-20 కాలానికి కార్యాచరణ ప్రణాళికను మనదేశ మేధోనిధి అయిన ‘నీతి ఆయోగ్‌ రూపొందిం చింది. ఈ ప్రణాళికలో భాగంగా ప్రాంతీయ ఉద్యోగ కేంద్రాలను స్థాపించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలను పారిశ్రామిక అవస రాల కోసం ఆకర్షించడం ప్రధాన అంశం. ఇటువంటి విదేశీ సంస్థలు రంగప్రవేశం చేసినట్లయితే దేశీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా పోటీని తట్టుకోవడానికి తమ ఉత్పత్తులు పెంచుకోవడానికి, ఎక్కువ వేతనాలతో కూడిన ఉద్యోగాలను కల్పిస్తాయి. కార్మిక చట్టా ల్లో కూడా మార్పులు తీసుకువచ్చి తాత్కాలికాలిక ఉద్యోగాల స్థానం లో ఒప్పంద ఉద్యోగాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించబడిం ది. ఇప్పటికే వస్త్రపరిశ్రమలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది.

మరిన్ని రంగాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. ఈ విధానం వల్ల కాలాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రాజెక్టును బట్టి నిర్ణీతకాలానికి ఉద్యోగులను నియమించుకోవడం వల్ల వారికి అధిక వేతనాలు అందుతాయి. మనదేశంలో ఉన్న 72 శాతం వస్తు ఉత్ప త్తి పరిశ్రమల్లో 20 మంది కన్నా తక్కువ మంది పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో దేశ జిడిపిలో కేవలం 12 శాతం మాత్రమే వాటా కలిగిఉన్నాయి. దేశంలోని 650 అతిపెద్ద సంస్థలు 88 శాతం సేవ లను అందిస్తూ కేవలం రెండు శాతం కార్మికులకు మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. అదే విధంగా 49 శాతం శ్రామికులకు ఉపాధి కల్పి స్తోన్న వ్యవసాయరంగం కూడా జిడిపిలో కేవలం 17 శాతం మా త్రమే వాటా కలిగి ఉంది. ఇప్పటికే ఈ రంగాల్లో ఇద్దరు, ముగ్గురు చేసే పనిని ఒక్కరి చేత చేయించడం వల్ల ఉత్పత్తి తగ్గి, వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈసంస్థలున్నాయి. ఇటువంటి రంగాల్లో అధికోత్పత్తికి తోడ్పడే ఉద్యోగాలకు రూపకల్పన చేయాలి.

ఇంజినీ రింగ్‌ వస్తువ్ఞల తయారీరంగాలైన ఆటో,పరికరాలు, ఫార్మాస్యూటి కల్‌ వంటి పరిశ్రమల్లో ఉత్పత్తి వేతనాలు ఎక్కువగా ఉన్నా ఎగు మతుల స్థాయికి చేరుకోవాలంటే మరింత చేయూత ఈ పరిశ్రమ లకు అవసరం. అంతర్జాతీయ ఎగుమతుల మార్కెట్లో మనదేశం వాటా కేవలం 1.7 శాతం.(మొత్తం విలువ 17 ట్రిలియన్‌ డాలర్లు) అదే చైనా వాటా 13 శాతం. రానున్న ఐదు సంవత్సరాలలో కనీ సం ఈవాటాను నాలుగు శాతం పెంచగలిగితే ఉద్యోగాల్లో వృద్ధి కూడా సాధ్యమవ్ఞతుంది. ఐదవ ఉద్యోగ-నిరుద్యోగ సర్వే ప్రకారం గత ఐదు సంIIగా నిరుద్యోగిత పెరుగుతూ వస్తున్నది. ఆడ,మగ మధ్యవ్యత్యాసం కూడా పెరుగుతూ వస్తోంది. ప్రతి వెయ్యి మందికి 503 మందికి మాత్రమే ఉపాధి దొరుకుతోంది. అంతుకుముందు ఈ సంఖ్య 529గా ఉన్నది.

గతంలో 3.8శాతంగా ఉన్న నిరుద్యో గం ఇప్పుడు ఐదు శాతంగా నమోదయింది. 2015-16 గణాంకాల ప్రకారం 15 సంII వయస్సున్న వారిలో 750 మంది మగవారికి ఉద్యోగాలు దొరకగా, 237 మంది ఆడవారికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతున్నాయి.మగవారిలో నిరుద్యోగిత నాలుగుశాతంగా వ్ఞంటే అదే ఆడవారిలో అది 8.7 శాతంగా ఉంది.ఇటువంటి వ్యత్యాసాల వల్ల సామర్థ్యం,సమానత్వాలకు విఘాతం కలగనున్నాయి. బంగ్లా దేశ్‌, చైనా వంటి దేశాల్లో ఎగుమతి ప్రధాన పరిశ్రమల్లో మగవారితో సమానంగా మహిళలు కూడాఎక్కువవేతనాలకు పనిచేస్తున్నారు. లింగవివక్ష వల్ల దేశజిడిపిలో 27 శాతం సగటు ఆదాయాన్ని నష్టపో వాల్సివస్తుందని 2013 ఐఎమ్‌ఎఫ్‌ నివేదిక పేర్కొంది. 2015 నుండి కీలకరంగాలైన వస్త్ర, లోహ, ఐటి పరిశ్రమలు గుర్తించదగ్గ స్థాయిలో ఉద్యోగాలను కల్పించగలిగాయి.

2014లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఈ రంగాలు కల్పించగలిగితే 2015లో 1.35 లక్షలఉద్యోగాలు మాత్రమే కల్పించగలిగాయి. గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత 10శాతంగా ఉంది.దొరుకుతున్న ఉద్యో గాల్లో కూడా వేతనాలు తక్కువగా ఉండటం వల్ల వీరి కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలైన బొగ్గు,చమురు, ఎరువ్ఞలు, విద్యుత్‌ వంటిసంస్థల్లో ఉద్యోగ నియామకాలు క్షీణిస్తున్నాయి. కార్మి కుల నైపుణ్యాలు పెంచే బదులు కార్మిక వర్గాల్లో నైపుణ్యాల అంత రాల్ని తగ్గించాలి. నైపుణ్యాలు సాధించిన వారిలో ముఖ్యంగా ఆడ వాళ్లలో 88 శాతం మంది ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు.

కాబట్టి నైపుణ్య శిక్షణా పథకాల వల్ల ఏమాత్రం ప్రయోజనం కలు గుతుందో ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక చట్టాలను సులభతరం చేయడం,పరిశ్రమల స్థాపన మరింత సులభతరం అయ్యేటట్లు చట్టాలకు రూపకల్పన చేయాల్సి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పన్నుల్లో వెసులుబాటు , వ్యాపార ప్రోత్సాహకాలు,అవినీతిని నిర్మూలించడం వంటి చర్యల వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన పెరుగుతుంది.

తద్వారా ఉద్యోగిత సాధ్యపడుతుంది.ఐదేళ్లపాటు పన్ను మినహాయింపులు ఈ పరిశ్రమ లకి ఇవ్వగలిగితే అనతికాలంలోనే లాభాల బాటపట్టి పనికి తగ్గ వేతనాలు చెల్లించే స్థాయికి వస్తాయి.సరైన వేతనం లభించినప్పుడు మాత్రమే తన పూర్తి సామర్థ్యాన్ని శ్రామికుడు వినియోగిస్తాడు. అప్పుడే ఉత్పత్తి పెరిగి దేశం అభివృద్ధి బాటపడుతుంది.

– ఈదర శ్రీనివాసరెడ్డి