అటు కరవు,ఇటు వరదలు

drought, floods
drought, floods

కృష్ణానదికి ఇంత ఉధృతంగా వరద రావడం 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అందుబాటులో ఉంది. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటున్నాయి. మరి ఈ 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ వరదలెందుకు, కరవ్ఞలెందుకు? వేల సంఖ్యలో జనం చావడమెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో 2,3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు, అందులో కరవ్ఞ, విపత్తుల నివారణ, ప్రాజెక్టుల పరిపూర్తికి వేలకు వేలు కేటాయించినట్లు చెప్తున్నారు. కానీ ఇవన్నీ శుష్కవాగ్దానాలు, శూన్యహస్తాలని తెలుస్తుంది. ఇప్పటికైనా పాలకులు ఓట్లు, సీట్ల రాజకీయాలకే పరిమితం కాకుండా జనఘోష పట్టించుకోవడం మంచిది.

కృ ష్ణా, గోదావరి నదుల వరద ఒకవైపు ముంచెత్తుతూ ఉంటే ఇంకోవైపు సీమలో తాగునీరు లేక జనం అల్లాడిపోతున్నారు. ఇదిఏమి వైపరీత్యమో. ఆగస్టు నాలుగు నుంచి పదిహేను తేదీ వరకు గోదావరి, కృష్ణా నదులకు నీటి ప్రవాహ ఉధృతి పెరిగి వరద రూపంలో పొంగి పొరలి నీరు సముద్రుడి గర్భంలో కలిసిపోతున్నది. మన రాష్ట్రంలో తక్కువే అయినా ఎగువ రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల వల్ల మన దగ్గర కృష్ణా,గోదావరి నదుల ఆధారంగా నిర్మితమైన అన్ని డ్యాములు, రిజర్వాయర్లు నిండిపోయి నీరు కిందకు వదలడం వల్ల వందల టియంసిల నీరు సముద్రపాలవ్ఞతుంది. సీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు ఆరు జిల్లాలు పూర్తి కరవ్ఞతో నలిగిపోతున్నాయి. రాయలసీమ నాలుగు జిల్లాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. గోదావరి, కృష్ణా నదుల వరదలతో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు విలవిల్లాడు తున్నాయి. కరవ్ఞలు, వరదలు ప్రకృతి ప్రకోపం వల్ల సంభవిస్తూ ఉంటాయని సాధారణంగా జనం భావిస్తుంటారు. కానీ దశాబ్దాల కరవ్ఞ- వరదల మూలంగా చిత్రహింసలు అనుభవిస్తూ సర్వస్వం కోల్పోయి విగత జీవ్ఞలుగా మారిన జనం పక్షాన నిజాయితీగా ఆలోచిస్తే ఈ ఉపద్రవాలు ముమ్మాటికీ పాలకుల పాపం, నిర్లక్ష్యం వల్లే సంభవిస్తున్నాయని బోధపడుతుంది. గతంలో ప్రతి మూడేళ్లకు, రెండేళ్లకు కరవ్ఞలు వస్తుండేవి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కరవే. సగటు వర్షపాతం 570.మి.మి ఉంటే కరవ్ఞ అని శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఒక చిత్తూరు మినహా మిగిలిన మూడు జిల్లాల్లో ఎప్పుడూ 570 మి.మి వర్షపాతం నమోదుకాలేదు. సగటు కన్నా 50,60 శాతం తక్కువ వర్షం ఆ ప్రాంతాల్లో కురుస్తున్నది. ఈ పరిస్థితి నుండి రాయలసీమ ప్రాంతాన్ని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకోవడానికి 1983-86 సంవత్సరాలల్లో ప్రారంభించిన నీటి పారుదల ప్రాజెక్టులు తెలుగుగంగ, గాలేరు-నగరి గండికోట, హింద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదు. 30-35 సంవత్సరాల కాలంలో తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు నీరురాలేదా? అక్కడ పూర్తి రిజార్వయర్‌ సామర్థ్యం దాటిన తర్వాత కిందకు సముద్రంలోకి నీళ్లుపోలేదా? నీటి పారుదల రంగంలో నిపుణులు ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం గడచిన 30 సంవత్సరాలలో 20 సంవత్సరాలు కృష్ణానది నీళ్లు సగటున సంవత్సరానికి వెయ్యి టియంసిలు సముద్రంలో కలుస్తున్నాయని తేల్చారు. మరి అటువంటప్పుడు సీమలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఉండి ఉంటే జనానికి నేడు ఈ దురవస్థ ఉండేదికాదు కదా! రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా, తీసుకురావాలన్నా శ్రీశైలం డ్యాంలో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులు ఉంచాలి. ఇది సాధ్యపడనందున కృష్ణకు వరద వచ్చే 30 రోజుల్లో 120 నుండి 150 టియంసిలు వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా బెనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుండి ఎస్‌ఆర్‌బిసి (గాలేరునగరి- గండికోట) ఎస్‌ఎల్‌బిసి( తెలుగుగంగ)ల ద్వారా ఇవ్వడానికి పోతిరెడ్డిపాడును 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. గత పాలకుల నిర్లక్ష్యం, ముందుచూపు లేనందున వల్ల అది నేటికీ పూర్తికాలేదు. నేడు శ్రీశైలం పూర్తి రిజర్వాయర్‌ నీటి మట్టం 885 అడుగులుంటే 880,883 అడుగులకు చేరింది. మరి 44వేల క్యూసెక్కుల నీరు 834 అడుగుల దగ్గరే రాయలసీమకు ఇవ్వొచ్చు. 829 అడుగుల నీటి మట్టం నుండే హంద్రీ నీవాకు నీళ్లు ఇవ్వొచ్చు. ఇవ్వలేకపో వడానికి కారణం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ కాలువలు పూర్తిసామర్థ్యంతో నీటిని పంపడానికి వినియోగంలో లేవ్ఞ. రెండు రోజుల్లోనే ఆగస్టు 12,13న 100 టియంసిల కృష్ణానది నీరు సముద్రంలో కలిసిపోయింది. హంద్రీనీవా కింద నిర్మించాల్సిన రిజర్వాయర్లు-ఎత్తిపోతలు పూర్తికాలేదు. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో రాయలసీమలో నిర్మించిన 34వేల చెరువ్ఞలు పాలకులు ప్రారంభించి పూర్తికాని ప్రాజెక్టుల కింద ఉన్న రిజర్వాయర్లు గోరఖల్లు, అవ్ఞకు, గండికోట, వెలుగోడు, వెలుగొండ, రాజోళిబండ డైవర్షన్‌ స్కీం కుడికాలువ, గుండ్రేవ్ఞల, వేదవతి ఎత్తిపోతల, చిత్రావతి, పిఎబిఆర్‌, హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, కె.సి.కెనాల్‌ లాంటి వాటి అన్నింటిని పూర్తి చేసి ఆధునికీరించి వరద సమయంలోనైనా నీరు నింపుకొనే వెసులుబాటు కల్పించి ఉంటే నేడు ఈ దుర్గతి, వలసవెళ్లిపోయే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకొనే దౌర్భాగ్యం పట్టేదికాదు. ఇది పాలకుల తప్పిదం కాక మరేమవ్ఞతుంది. 2018-10 సంవత్సర కరవ్ఞ పరిస్థితి అయితే మరింత దారుణాతిదారుణంగా ఉంది. పోయిన సంవత్సరం రాయలసీమ జిల్లాల్లో ఆరు ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేయడానికి 70వేలు సరాసరి ఖర్చు చేశారు. కాడిఎద్దుల మేతకు 40వేలు ఖర్చు చేశారు. 80 సన్నజాజి చెట్ల ద్వారా సంవత్సరా నికి రెండు నుండి మూడు లక్షలు వచ్చే ఆదాయం బోరుబావ్ఞల్లో నీళ్లు లేక పంటలు మలమలమాడిపోయాయి. 300 గ్రాములు ఉండాల్సిన దానిమ్మ 30 గ్రాములకు బక్కచిక్కిపోయాయి. ఈ సంవత్సరం కడప, అనంతపురం జిల్లాల్లో 59వేల ఎకరాల్లో వేసిన పండ్లతోటలు ఎండిపోయాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఈ పంటల రక్షక తడుల నీటి కోసం నాలుగు జిల్లాల్లో 120 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. ప్రభుత్వం ఈ పని చేయలేదా? ఇక గోదావరి, కృష్ణానదుల వరద బాధితుల గోడు ఇంకోరకం. గోదావరి నదిలో పోలవరం డ్యాం నిర్మాణానికి నిర్మిస్తున్న కాఫర్‌ డ్యాం పనులు పూర్తికానందున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజి కింద ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వనందున అక్కడి ప్రజలను చేజేతులా వరదముంపునకు గురి చేశారు. వాస్తవానికి ధవళేశ్వరం దగ్గర 2,3 ప్రమాద సూచికలు దాటితే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం దగ్గర దేవిపట్నం మండలంలోకి వరదనీరు వస్తుంది. కానీ ఈసారి మొదటి ప్రమాద సూచిక హెచ్చరిక రాకముందే పోలవరంలో నిర్మిస్తున్న కాఫర్‌ డ్యాం పూర్తికానందున అక్కడ 27.2 మీటర్లు నీరు చేరి వెనక్కి తట్టి స్పిల్‌వేపై రెండు మీటర్ల ఎత్తున నీరు ప్రవహించింది. దీనివల్ల జిల్లాలో 87 వేల మంది ప్రజలు అవస్థలకు గురయ్యారు. 18 మండలాల పరిధిలో 202 గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. ఒక దేవిపట్నంలోనే 27 గ్రామాలు వారం రోజుల పాటు జలదిగ్భందంలో పడిపోయాయి. బయటి ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా తెగిపోయి జనజీవనం స్తంభించింది. కాఫర్‌డ్యాం నిర్మాణం తాత్కాలిక అవసరమే అయినా కృష్ణాడెల్టాకు నీళ్లు ఇవ్వాలని నిర్మించినా దీన్ని పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలతో పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి దాపురించేదికాదు. పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండలాలు 2018 గ్రామాలకు వరదముప్పు తప్పేది. ఇక కృష్ణానది లోతట్టు ప్రాంతాల జలమయం గురించి ఒకమాట చెప్పుకోవాలి. ప్రకాశం బ్యారేజికిపైన, కింద కరకట్టల కింద వరద ప్రవాహం సాఫీగాపోకుండా అడ్డుకట్టవేసినట్లు అక్రమ కట్టడాలు, పెద్దపెద్ద భవంతుల నిర్మాణం జరిపినందున ఈ పరిస్థితి ఏర్పడిందని వార్తలు వచ్చాయి. కృష్ణానదికి ఇంత ఉధృతంగా వరద రావడం 10 సంవత్సరాల కాలంలో జరగలేదు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అందుబాటులో ఉంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటున్నాయి. మరి ఈ 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ వరదలెందుకు, కరవ్ఞలెందుకు? వేల సంఖ్యలో జనం చావడమెందుకు? ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో 2,3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు, అందులో కరవ్ఞ, విపత్తుల నివారణ, ప్రాజెక్టుల పరిపూర్తికి వేలకు వేలు కేటాయించినట్లు చెప్తున్నారు. కానీ ఇవన్నీ శుష్కవాగ్దానాలు, శూన్యహస్తాలని తెలుస్తుంది. ఇప్పటికైనా పాలకులు ఓట్లు, సీట్ల రాజకీయాలకే పరిమితం కాకుండా జనఘోష పట్టించుకోవడం మంచిది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/