కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర!

సన్నాయి నొక్కులే కానీ సంగీతం లేద న్నట్లుగా ఈ ధరల నియంత్రణ విష యంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరు. అదుపూ ఆజ్ఞలేకుండా పెరిగిపోతున్న ధరలను నియంత్రిస్తాం, నల్లబజారుదారులపై ఉక్కుపాదం మోపుతాం అంటూ పాలకులు పదేపదే మాటలు చెప్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం చేయలేకపోతు న్నారు. అధికారంలోకి ఎవరు వచ్చినా ఇదే పరిస్థితి. స్వరం మారుతున్నదే తప్ప పాట మాత్రం పాతదే

అన్నట్లుగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరల విషయంలో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసి రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన పెద్దలే అధికారంలోకి రాగానే మారిపోతున్నారు. పెరిగిపోతున్న నిత్యావసర ధరలతో సామాన్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. తాజాగా ఉల్లిధర ఊహించని రీతిలో కిలో వంద రూపాయలకు చేరుకోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది.

నిన్నమొన్నటి వరకు రైతుల వద్ద పంట ఉన్నప్పుడు కొనే వారు లేక కొన్నా తెచ్చిన రవాణా ఛార్జీలే రాక రైతులు రోడ్లపై పారబోసిన సంఘటనలున్నాయి. ఈసారి ఉల్లి సాగు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష్యానికి మించే చేసినా అతివర్షాల కారణంగా పంట దెబ్బతిన్నది. దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన కొద్దిపాటి దిగుబడులు కూడా తడిసి చాలా వరకు ఉల్లిగడ్డలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన కొందరు వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని పెద్ద ఎత్తున నిల్వలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రైతుల వద్ద ఉన్న కొద్దిపాటి ఉల్లి నిల్వలు కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఏకంగా కిలో వందరూపాయలకు చేర్చారు. గురువారం మార్కెట్లో ఎనభై నుంచి వంద రూపాయల వరకు ఉల్లిధర పలికింది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలే అంటున్నాయి. ఉల్లివాడకం రానురాను పెరుగుతుండడం, సాగు అంత కంతకు తగ్గుతుండడం వల్ల పరిస్థితి ఇలా ఏర్పడుతు న్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఇంత లాభదాయ కంగా ఉండే ఉల్లిసాగు పట్ల రైతులు ఎందుకు విముఖత చూపుతున్నారో అధికారగణం అన్వేషించలేకపోతున్నది. గతంలో ఇచ్చే సబ్సిడీలు కూడా తగ్గిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసినా 140 దేశాల్లో రైతులు ఉల్లిపంటను సాగు చేస్తున్నారు. అయితే దిగుబడుల్లో సగం శాతం భారత్‌, చైనాలదే. ప్రపంచంలోనే భారత్‌ ఐదోవంతు ఉల్లిని ఉత్పత్తి చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో రైతులకు ఉల్లే ప్రధాన పంటగా ఉంది. కానీ సరాసరి ఉల్లి దిగుబడుల్లో మాత్రం చాలా దేశాల్లో కంటే అత్యధికంగా వెనుకబడి ఉంది.

ఐర్లాండ్‌లో హెక్టారుకు 67 టన్నులకుపైగా ఉత్ప త్తిని సాధిస్తూ ఆ రైతులు అగ్రస్థానంలో ఉంటే భారత్‌లో పధ్నాలుగున్నర టన్నులకే పరిమితమై 90వస్థానంలో ఉన్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకో వచ్చు. అలాగే భారతదేశంలో ఉల్లివినియోగం సరాసరి 6.7 కిలోలు అని జాతీయ ఉల్లి, అల్లం పరిశోధనాసంస్థ వెల్లడించింది.వినియోగం క్రమేణా పెరుగుతున్నది. దేశ జనాభా 2050 నాటికి 170 కోట్లకు చేరుకుంటుందని అప్పటి తలసరి వినియోగం దాదాపు పదకొండున్నర కిలోలు అవ్ఞతుందని ఆ సంస్థ అంచనా వేసింది.

కానీ సాగు విస్తీర్ణం అందుకు విరుద్ధంగా తగ్గిపోతున్నది. పెరిగే అవకాశాలు కన్పించడం లేదు. అప్పటి అధికార లెక్కల ప్రకారమే ఏటాదాదాపు మూడుకోట్ల టన్నుల ఉల్లిపా యలు మన అవసరాలకు రైతులు పండించాలి. అలాగే ఉత్పత్తి కూడా హెక్టారుకు 21టన్నులకు చేరాలి.కానీ పరి స్థితులు పరిశీలిస్తే ఆ అవకాశాలు ఏమాత్రం కన్పించడం లేదు.అనేక పాశ్చాత్యదేశాలు ఉల్లిరైతులకు ఎన్నో ప్రోత్సా హకాలు ఇస్తున్నాయి.సబ్సిడీతో సంకర జాతి వంగడాలు, ఆధునిక యంత్రాల సరఫరా, కోత అనంతరం నష్టనివా రణ చర్యలు పెద్దఎత్తున చేపడుతున్నాయి.

కానీభారత్‌లో పురాతన సంప్రదాయ పద్ధతుల్లో తక్కువ కాలవ్యవధి వంగడాలను సాగుచేస్తున్నారు.దీర్ఘకాల సాగువల్ల ఉల్లిగడ్డ బరువ్ఞ, పరిమాణం పెరిగి ఆదాయం ఎక్కువగావస్తుంది. భారత్‌లో రైతులకు సక్రమమైన, నాణ్యమైన ఉల్లివిత్తనా లు లభించడం లేదు. భారతదేశానికి సంబంధించినంత వరకు పరిశీలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకల్లోనే ఉల్లిదిగుబడు లు భారీగా ఉన్నాయి. ఏటా మూడు సీజన్‌ల్లో ఉల్లిసాగు చేయవచ్చు.

ఉల్లిగడ్డలు నిల్వ చేయడం కూడా రైతులకు సమస్యగా తయారవ్ఞతున్నది. మహారాష్ట్రలోని లాసల్‌ గాంవ్‌ దేశంలోనే ఉల్లిపాయ హోల్‌సేల్‌ మార్కెట్లో అతిపెద్దది. ధర నిర్ణయం కూడా అక్కడే జరుగుతుంది. ఉల్లికి సంబంధిం చినంతవరకు అన్ని నిర్ణయాలు అక్కడే జరుగుతున్నాయి. ఆ మార్కెట్‌ బట్టే దేశవ్యాప్తంగా ఉల్లిధర ఆధారపడి ఉంటుంది. గతంలో ఇలాంటి పరిస్థితులను ముందుగానే ఊహించి ఉల్లిగడ్డలను ఇతర దేశాలనుంచి తెప్పించి నిల్వ చేసిధరలను నియంత్రించిన సందర్భాలు ఎన్నోఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ జరిగింది. అయితే నిల్వ చేసుకోవడానికి అవసరమైన గోదాములు లేకపోవడం కూడా ఒక సమస్యగా పరిణమించింది. ప్రస్తుతం పెరిగిన ధరలను నియంత్రించేందుకు కేంద్రపెద్దలు ఆలస్యంగానైనా కళ్లు తెరిచారు. దిగుమతుల కోసం చర్యలు చేపట్టారు. ఈ చర్యలేవో రెండు మూడు నెలల ముందే పరిస్థితిని అంచనావేసుకొని దిగుమతులకు శ్రీకారం చుట్టిఉంటే ఇలాంటి పరిస్థితి దాపురించేదికాదు. ఏదిఏమైనా ఉల్లిధర కట్టుతప్పి సామాన్యులకు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నది. ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వాల అసమర్థ నిర్వాకమే ఈ సంక్షోభానికి కారణమనే ఆరోపణలను కొట్టివేయలేం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/