కర్ణాటక కమలంలో మళ్లీ ముసలం!

BJP
BJP

కర్ణాటకలో మరో రాజకీయ దుమారం లేచింది. బిజెపికి మరోసారి చిక్కులు ఎదురవుతున్నాయి. అగ్రనేత రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ యెడ్యూరప్ప తన డైరీలో రాసుకున్నట్లుగా ఆయన దస్తూరితో ఉన్న పత్రాలు వెలుగులోనికి వచ్చాయి. బిజెపిలోని అగ్రనేత లకు మొత్తం రూ.1800 కోట్లు ముడుపుల రూపంలో ఇచ్చినట్లు ఆ పత్రాల సారాంశం. ఈ పత్రాలు ఎక్కడ లభించాయి అంటే అదికూడా కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి డికె శివకుమార్‌ ఇంట్లో సోదాలుచేసిన ఆదాయపు పన్ను అధికారులకు లభించాయి. అనుకోని విధంగా ఎన్నికల తరుణంలో బైటికి వచ్చిన వివాదంతో ఇపుడు కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారాస్త్రంగా కలిసొచ్చింది. కర్ణాటకలో చెలరేగిన ఈ వివాదంపై ఇపుడు సంకీర్ణ ప్రభుత్వ పార్టీలుజెడిఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు భారీ ఎత్తున ఎన్నికల్లో సొమ్ము చేసు కునేందుకు ముందుకు ఉరుకుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీ స్థాయినుంచి బిజెపిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అయితే ఏకంగా చౌకీదారులు అందరూ చోరులేని తేల్చేశారు. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? ఇది ఎలా బైటకు వచ్చింది. అందులోనూ ప్రత్యర్ధిపార్టీకి చెందిన మంత్రి ఇంట్లో సోదాల సమ యంలో లభించడమేమిటి? అన్న ప్రశ్నలు ఇపుడు బిజెపి హైకమాండ్‌ను తొలిచేస్తున్నాయి. అంతేకాకుండా తనను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకుగాను యెడ్యూరప్ప కేంద్రంలోని కీలక మంత్రులు, పార్టీ కీలక నేతలు అంద రికీ కోట్లలోనే ముడుపులు ముట్టచెప్పినట్లు తన డైరీలో రాసుకున్నట్లు చెపుతున్నారు. అసలు ఇవి యెడ్యూరప్ప డైరీలో నుంచి తెచ్చినవేనా? లేక పత్రాలను సృష్టించారా? ఏరూపంలో ఇవి కాంగ్రెస్‌ మంత్రి ఇంట్లో లభించాయి. ఇందులో మతలబు ఏమిటి అన్నదే ఇపుడు దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది.

కారవాన్‌ వెబ్‌ మ్యాగజైన్‌ ఈ మొత్తం పత్రాల సారాంశాన్ని విశేషకథనంగా ప్రచురించ డంతో ఇపుడు దేశవ్యాప్తంగా కర్ణాటక మరోసారి రాజ కీయాల్లోనికి వచ్చింది. అంతేకాకుండా ప్రతి నాయకుని నోటా కూడా యెడ్యూరప్ప డైరీల ఉదంతమే వినిపి స్తోంది. వీటిని కర్ణాటక మంత్రి డికె శివకుమార్‌ ఇళ్లు కార్యాలయాలను సోదా చేసిన సమయంలో లభించా యని, అయితే ఇవి కేవలం జిరాక్స్‌ ప్రతులు మాత్రమేన ని, ఒరిజినల్స్‌ ఇవ్వాలని కోరినట్లు ఆదాయపు పన్నుశాఖ అధికారులు సెలవిచ్చారు. అయితే యెడ్యూరప్ప కానీ, శివకుమార్‌కానీ ఒరిజినల్స్‌ ఇవ్వడంలో విఫలం అయ్యారని, ఇపుడు నిజానిజాలు నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పంపించాల్సి ఉంటుందని చెప్పి ఐటి అధికారులు తప్పించుకున్నారు. బిజెపి కేంద్ర కమిటీకే భారీ ఎత్తున నగదు ముట్టచెప్పినట్లుగా ఈ పత్రాల్లో ఉంది. అవినీతి ఆరోపణలు ఆపై రాజకీయంగా దుమారం రేగడం కర్ణాటకలో కొత్తేమీ కాదు. గనుల కుంభకోణానికి సంబంధించి గతంలో ఆ రాష్ట్రలోకాయుక్త చేసిన విచారణలో కూడా యెడ్యూరప్ప పెనుసవాళ్లు ఎదుర్కొన్నారు. చివరకు ఆ ప్రభుత్వమే కుప్పకూలిపో యింది. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తనను ఎక్కడ మారుస్తారోనని ముందుగానే ఊహించి డైరీలో తాను ఇచ్చిన వివరాలన్నింటినీ నిక్షిప్తంచేసుకున్నారని, అయితే ఆయనే ఇపుడు స్వయంగా ఇచ్చారా? లేక మరెవరైనా చోరీచేసి అవి ప్రత్యర్థులకు అందచేసారా అన్నదే తేల్చాల్సి ఉంది.

అదేవిధంగా సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు తనకు ఎలా లభించాయో, ఎవరు వీటిని అందచేశారో కూడా కర్ణాటక మంత్రి చెప్పలేకపో యినట్లు ఐటి శాఖ వెల్లడించింది. యెడ్యూరప్ప కథనం ప్రకారం ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, తప్పుడు పత్రాలేనని ఐటిశాఖ తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చిందని చెపుతున్న యెడ్యూరప్ప ఇపుడు విచారణలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రాఫెల్‌డీల్‌పై సుప్రీంలో కేసువేసి విచారణ జరిపించాలని డిమాండ్‌చేసిన ప్రతిపక్షాలు ఇపుడు ఎన్నికల సమయంలో తమకు లభించిన ప్రచారాస్త్రాన్ని సులువుగా వదులుకుంటారని మాత్రం చెప్పలేం. అవసరమైతే సుప్రీంకోర్టులో కేసులు వేసే అవకాశాలు కూడా ప్రతిపక్షాలు అన్వేషిస్తున్నాయి.

అంతేకాకుండా కొత్తగా ప్రమాణ స్వీకారంచేసిన లోక్‌పాల్‌కు ఈ కేసును దాఖలు చేసినా ఆశ్చర్యపోనవసరంలేదు. మొత్తం మీద కర్ణాటకలో యెడ్యూరప్పకు పార్టీని నడిపించడం ఒక ఎత్తయితే ఎన్నికల్లో తాను చెప్పినట్లుగా 22 స్థానాలు గెలుచుకోవడం ఒక ఎత్తు అని చెప్పాలి. బిజెపికి పట్టున్న నియోజకవర్గాల్లో తన శక్తియుక్తులను ప్రదర్శించి గెలుపే ధ్యేయంగా ముందుకువెళితే పార్లమెంటు ఎన్నికల అనంతరం కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఝలక్‌ ఇవ్వడంద్వారా మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టే వ్యూహంతో ఉన్న యెడ్యూరప్పకు కారవాన్‌ మ్యాగజైన్‌ప్రచురించిన పరిశోధనాత్మక కథనం లోక్‌సభ ఎన్నికల్లో మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది.

రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక విధివిధానాలను ఏర్పాటుచేసుకుని ఓ ప్రత్యేక కోటరీని నిర్మించుకునే యెడ్యూరప్ప ఇపుడు కర్ణాటకలో నిలదొక్కుకునేందుకు ముందు ఈ అవినీతి ఆరోపణలనుంచి గట్టెక్కాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో యెడ్యూరప్ప డైరీలో నిక్షిప్తంచేసుకున్నారని చెపుతున్న వీటిపై సమగ్ర విచారణకు అయినా ముందు రాకుంటే ఈ డైరీలో ఉన్న నిజాలను అంగీకరించడంలో ఆయన వెనుకంజ వేస్తున్నారన్న అపవాదును మూటగట్టుకోవడంతోపాటు ఇపుడు సొంతపార్టీ హైకమాండ్‌కు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని అధిగమించకపోతే ఎన్నికలపై ప్రభావం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌ ,హైదరాబాద్‌