దేశ ఆర్థికవృద్ధికి కీలకం ఐపిఎల్‌

IPL 2019
IPL 2019

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అంటే నరాలు తెగే ఉత్కంఠ,ఆటగాళ్ల బ్యాటింగ్‌ విన్యాసాలు, బౌలింగ్‌ ట్రిక్కులు, మెరుపు ఫీల్డింగ్‌. మ్యాచ్‌ ఆరంభం నుంచి చివరి వరకు రసవత్తరంగా సాగే అద్భుతమైన ఆట. ఇదంతా క్రికెట్‌ క్రీడాభిమానుల దృష్టిలో… మరి వ్యాపారవేత్తల మాటేంటో తెలుసా..? ఐపిఎల్‌ అంటే కాసుల గలగలలు, సిరుల పంట. దేశ ఆర్థిక వ్యవస్థకు వృద్ధికారి ఐపిఎల్‌. ఐపిఎల్‌ అంటే కేవలం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కాదు.ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇండియన్‌ ప్రాఫిటబుల్‌ లీగ్‌. ఓవైపు ఆట మరోవైపు ఆర్జనతో అదరగొడుతున్న అద్భుత టోర్నీ. ఆటగాళ్ల, యాజమా న్యాల సంపదను ఏటా రెట్టింపు చేస్తోంది. పరుగుల వరదతో తడిసిన మైదానంలో సిరుల పంటపండుతోంది. అంతేనా..! ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన టాప్‌-5 లీగుల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి కారకం అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మౌలిక సదుపాయాలు, రవాణా, కొనుగోలు, మార్కెటింగ్‌, వ్యాపార నిర్వహణ, ప్రచారం అనేక రంగాల్లో కొన్ని వందల మందికి ఉపాధి అందించి న కల్పవల్లి. ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తూ తన బ్రాండ్‌ విలువను పెంచుకుంటోంది. అప్పటి బిసిసిఐ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోడీ మానస పుత్రికైన ఐపిఎల్‌ రంగ ప్రవేశమే ఒక సంచలనం. 2008లో కేవలం 723.59 మిలియన్‌ డాలర్లలో ఆరంభమైన ఈ లీగ్‌ బ్రాండ్‌ విలువ 2018కి 6.3బిలియన్‌ డాలర్లకు అంటే దాదాపు రూ.43,000కోట్లకు చేరుకుంది. అంతేనా, 2015లో దేశ స్థూల జాతీయోత్పత్తికి రూ.1150కోట్లు (182 మిలియన్‌ డాలర్లు) అందించింది. ప్రత్యక్ష, పరోక్ష లావాదేవీలను కలుపుకుంటే ఈ మొత్తం రూ.2,650 కోట్లుగా (418మిలియన్‌ డాలర్లు ) ఉంటుంది. అలా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఓ కారకంగా మారింది ఐపిఎల్‌. 2019 సీజన్‌ పూర్తయితే లీగ్‌ బ్రాండ్‌ విలువ దాదాపు రూ.50,000కోట్లైనా ఆశ్చర్యం లేదు. ఐపిఎల్‌ బ్రాండ్‌ విలువను ఫ్రాంచైజీల ఆధారంగా లెక్కిస్తారు. ఇలా చూస్తే లీగ్‌లోని ఎనిమిది జట్లలో ముంబయి ఇండియన్స్‌దే అగ్రస్థానం. 2017లో 106 మిలియన్‌ డాలర్లు ఉన్న ముంబయి బ్రాండ్‌ విలువ 7శాతం పెరిగి 2018లో 113 మిలియన్‌ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విలువ 2017లో 99మిలియన్‌ డాలర్లు కాగా 5శాతం వృద్ధితో 104 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఫ్రాంచైజీలు గత ఏడాది 98 మిలియన్‌ డాలర్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. బెంగుళూరు అంతకుముందు ఏడాదితో 11శాతం వృద్ధి సాధించింది. ఇక సన్‌రైజర్స్‌ విలువ ఏకంగా 25శాతం పెరగడం విశేషం. 2017లో 56 మిలియన్‌ డాలర్లు ఉండగా అదిప్పుడు 70మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ సంయుక్తంగా 6వస్థానం దక్కించుకున్నాయి. 18శాతం వృద్ధితో ఢిల్లీ 44 నుంచి 52, 27శాతం వృద్ధితో పంజాబ్‌ 41 నుంచి 52మిలియన్‌ డాలర్లకు విలువను పెంచుకున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ 43మిలియన్‌ డాలర్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. లీగ్‌లో 11సీజన్లు ముగిశాయి. దాదాపు 694మంది పారితోషికాలు అందుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ దాదాపు రూ.4,284కోట్లకు పైగా ఆటగాళ్లకు చెల్లించారు. 426మంది భారత ఆటగాళ్లు రూ.2,354 కోట్లు వేతనంగా అందుకున్నారు. మొత్తం చెల్లింపులో ఇది 54.95శాతం అన్నమాట. ఇక 268 మంది విదేశీ క్రికెటర్లకు రూ.1,930కోట్లు దక్కింది. వీరిలో అత్యధికంగా ఆర్జించింది కంగారులూ. 84మంది ఆసీస్‌ క్రికెటర్లు రూ.653కోట్లు (15.26శాతం) అందుకు న్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 52మంది రూ.428కోట్లు తీసుకున్నారు. 26మంది వెస్టిండీస్‌ క్రికెటర్లు రూ.279కోట్లు, 26మంది లంకేయులు రూ.191కోట్లు, న్యూజిలాండ్‌ 22మంది క్రికెటర్లు రూ.151కోట్లు తీసుకున్నారు. ఇక లీగ్‌లో టాప్‌-10 ఆటగాళ్లకు దక్కిన మొత్తం రూ.821 కోట్లు. అంటే పారితోషికంలో 19.18శాతం. ఇందులో ఎంఎస్‌ ధోని, రోహిత్‌శర్మ, కోహ్లీ తలో రూ.100కోట్లు సంపాదించారు. గంభీర్‌, రైనా, యువీకి రూ.80కోట్లకు పైగా అందుకున్నారు. టాప్‌-20 క్రికెటర్లకు అయిన ఖర్చు రూ.1305కోట్లు (31.52శాతం), టాప్‌ 11-20 క్రికెటర్లకు రూ.5.28కోట్లు (12.32శాతం) చెల్లించారు. ప్రసార హక్కుల్లోనూ ఐపిఎల్‌ దిమ్మతిరిగే షాకులిచ్చింది. స్టార్‌ ఇండియా ఐదేళ్ల కాలానికి రూ.16,347కోట్లకు (2.55 బిలియన్‌ డాలర్లు) అంతర్జాతీయ ప్రసార హక్కుల్ని గెలుచుకుంది. ప్రసార హక్కుల అంశంలో ప్రపంచం లోని ప్రముఖ క్రీడా లీగులతో పోలిస్తే ఐపిఎల్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఐపిఎల్‌ మూడేళ్ల ప్రసారానికి 13.4బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 4.4), ఎన్‌ఎఫ్‌ఎల్‌కు తొమ్మిది ఏళ్లకు 39.6బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 4.4), ఎన్‌బిఏకు తొమ్మిదేళ్లకు 24 బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 2.6) తర్వాత స్థానం ఐపిఎల్‌దే. ఏడాదికి 0.5బిలియన్‌ డాలర్లు స్టార్‌ చెల్లిస్తోంది. 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి 20 మ్యాచ్‌లను దుబా§్‌ులో నిర్వహించారు. దాంతోనే దుబా§్‌ు ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా 215 మిలియన్ల దిర్హమ్స్‌ ప్రవహించాయి. 2009లో దక్షిణాఫ్రికాలోనూ ఇలాగే జరిగిందని కెపిఎంజి అధ్యయనం తెలిపింది. టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది వృద్ధికారకమని చెప్పకతప్పదు.

  • దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌, హైదరాబాద్‌