మోగిన ఎన్నికల నగారా!

general elections 2019
general elections 2019


దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ఏడువిడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. వెనువెంటనే ఎన్నికలనియమావళిసైతం అమలుకు వచ్చింది. ఈసారి నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులు ప్రస్తుతం వారికి ఉన్న హోదాను ఎన్నికల తేదీకి ముందే మూడుసార్లు స్పష్టంచేయాల్సి ఉంటుంది. మొత్తం పది లక్షల పోలింగ్‌కేంద్రాల్లో ఎన్నికలకు ముహూర్తం నిర్ణయిం చారు. ఆదివారం ఎన్నికల షెడ్యూలునుప్రకటించిన భారత ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికలకు వివిపాట్‌లనుసైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది దీనివల్ల అభ్యర్ధితాను వేసిన ఓటు ఎవరికి వేసిందీ కూడా బూత్‌లో వెనువెంటనే చూసుకునే అవకాశం కలుగుతుంది.

అధికారిక నోటిఫికేషన్‌ ఈరోజే వెలువడినా రాజకీయ పార్టీల్లో మాత్రం ఎన్నికల వేడి గతనెలలోనే ప్రారంభం అయింది. అధికారంలోని భారతీయ జనతాపార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా తన ప్రచారాన్ని షురూచేసి ఏడెనిమిది రాష్ట్రాల్లో ప్రధానిమోడీ, బిజెపి అధినేత అమిత్‌షాలు పర్యటనలు షురూచేసారు. మరోపక్క ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనదైన శైలిలో అధికార పక్షంపై విరుచుకుపడుతూ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అధికారికంగా వెలువడిన నోటిఫికేషన్‌తో మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు జరుగు తున్నాయి. మొదటి విడత ఏప్రిల్‌ 11వ తేదీ నిర్వహి స్తారు. మొదటి మూడు విడతలుగాజరిగిన ఎన్నికల్లో 91స్థానాలనుంచి గరిష్టంగా మూడో విడత 115స్థానాల్లో జరుగుతున్నది.

మొత్తం పోలింగ్‌ ప్రక్రియ మేనెల 19వ తేదీతో ముగుస్తున్నది. మొత్తం 543 స్థానాలకు ఏడు విడతలుగా జరిగిన పోలింగ్‌ప్రక్రియ అనంతరం ఎన్నికల ఫలితాలుమేనెల 23వ తేదీ వెలువడతాయి. ఎన్నికల పరంగా రాజకీయ పార్టీలు పొత్తులు షురూచేసిన మహా కూటమి నేతలు ఇపుడిపుడే తమతమ ప్రచారానికి పదును పెడుతున్నారు. కోల్‌కతా, ఢిల్లీల్లో మహాకూటమి సభలు నిర్వహించి ఎన్‌డిఎ మిత్రపక్షాలపై నిప్పులు చెరుగుతూ తమతమ ప్రచారాన్ని షురూచేస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా రాఫెల్‌ అవినీతి, జిఎస్‌టి, కిసాన్‌ సమ్మాన్‌నిధి వంటి వాటినే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నది. 2014లో జరిగిన ఎన్నికల్లో యుపిఎని ఓడించి ఎన్‌డిఎకు పట్టం కట్టారు.

ఆనాటి యుపిఎ పాలనపై అవినీతి, బంధుప్రీతి, విదివిధానాలు, కీలక నిర్ణయాల్లో వైఫల్యం వంటి వాటిని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీనే ప్రకటించి ఆనాడు బిజెపి ప్రచారానికి నడుం బిగించింది. భారత ప్రజల్లో నెలకొన్న నిరాశా నిస్ప్రృహలను తొలగించి అభివృద్ధివైపు భారత్‌ను నడిపిస్తామని హామీ ఇచ్చిన బిజెపి అధికారంలోనికి వచ్చింది. ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు సైతం ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయిం చింది. వీటిలో కొన్ని రాష్ట్రాలకు ఒకేరోజు ఒకే విడతలో ఎన్నికలు ముగిసేటట్లు ఆయా రాష్ట్రాల అభిమతంమేరకు ఎన్నికల ఏర్పాట్లుచేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటిం చింది. ఎన్నికలు జరగాల్సి ఉన్న జమ్ముకాశ్మీర్‌లో మాత్రం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది.

రాష్ట్ర పాలనా యంత్రాంగంనుంచి నివేదిక కోరిన ఎన్నికల సంఘం తదనంతర ఎన్నికల బృందాన్నిరాష్ట్రానికి పంపించింది. అన్ని రాజకీయ పార్టీలు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వమించిన అనంతరంఎన్నికల సంఘం రాష్ట్రంలో కేవలం పార్లమెంటరీఎన్నికలు మాత్రమే నిర్వహి స్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలపై తర్వాత నిర్ణ యిస్తామని వెల్లడించింది. అలాగే ఆరాష్ట్రంలోని అనంత్‌ నాగ్‌ లోక్‌సభస్థానానికి మూడుదశల్లో పోలింగ్‌ నిర్వహి స్తోంది. అక్కడ నెలకొన్న శాంతిభద్రతల సమస్యలు, మిలి టెంట్ల జొరబాట్లు, ఉగ్రదాడుల నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేకత ఏమిటంటే 22 రాష్ట్రాలకు లోక్‌సభ ఎన్నికలు ఒకేదశలో ముగుస్తున్నాయి. అవి కర్ణాటక, అసోం, మణి పూర్‌, రాజస్థాన్‌, త్రిపుర రెండుదశల్లో జరుగుతుంటే, అసోమ్‌, ఛత్తీస్‌ఘఢ్‌ మూడుదశల్లో జరుగుతున్నాయి.

పారామిలిటరీ దళాల నియామకాలకు వీలుగా ఈ ఏర్పాట్లు చేసింది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది విడతలుగాపోలింగ్‌ జరిగింది. మొదటి విడతలోనే సుమా రుగా 20రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిచేస్తామని ప్రకటించింది. వీటిలో అత్యధిక నియోజకవర్గాలున్న రాష్ట్రాలు రెండోదశలో 13 రాష్ట్రాలు ఉంటే మూడోదశలో 14రాష్ట్రాల్లో కొన్నిస్థానాలకు ఎన్నికలు నిర్వ హిస్తోంది. నాలుగోదశలో తొమ్మిదిరాష్ట్రాలు, ఐదో దశలో ఏడురాష్ట్రాలు, ఆరోదశలో ఏడు రాష్ట్రాలు, ఏడోదశలో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ ఎన్నికలకుగాను మొత్తం 90 కోట్లమంది అర్హులైన ఓటర్లు ఉన్నారని, గత ఎన్నికల్లోఓటర్ల జాబితాకంటే ఎనిమిది కోట్ల నలభైలక్షలు కొత్త ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో ఉన్న తొమ్మిది లక్షల పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేస్తే ఈసారి ఏకంగా పదిలక్షల పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2014లో జూన్‌ మూడవతేదీ కొత్తప్రభుత్వం కొలువుదీరితే ఎన్నికల తర్వాత ఇపుడు జూన్‌రెండోతేదీన కొత్తప్రభుత్వం కొలువుతీరను న్నది. షెడ్యూలు విడుదలకావడంతో ఇక రాజకీయ పార్టీలు తమతమ ప్రచారాస్త్రాలకు పదును పెట్టాయి. ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసి స్వేఛ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే సౌలభ్యం కల్పిస్తే రానున్న ప్రభుత్వానికి ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని నిష్కర్షగా చెప్పగలం.

  • దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌