తుపానుల నుంచి రక్షణ కల్పించలేమా?

Titly
Titly

తుపానుల నుంచి రక్షణ కల్పించలేమా?

మానవుడు ఎంత సాంకేతిక పరిజ్ఞానం సంపాదించినా, ఇతర రంగాల్లో మరెంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు తల వంచని పరిస్థితుల నుండి బయటపడ లేకపోతు న్నారు. తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సం నుండి ఇంకా ఆయా ప్రాంతాల ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ, అటు ఒడిశా రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో ఈ తుపాను సృష్టించిన బీభత్సానికి అటు పంటలు, ఇటు రహదారులు ఒకటేమిటి జనజీవనమే స్తంభించిపోయిందని చెప్పొచ్చు. అనేక ప్రాంతాలకు నేటికీ రవాణా సౌకర్యం కల్పించలేకపోతున్నా రు. మొన్నటివరకు కళకళలాడుతున్న ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం జిల్లాలోని అనేక వేల ఎకరాల్లోని పంటలు ఒక్కరోజుల్లో నేలమట్టం అయిపోయాయి.

కోస్తాతీరానికి తుపాను తాకిడి రానురాను పెరిగిపోతున్నదేమోననిపి స్తున్నది. 1999లో సూపర్‌ సైక్లోన్‌, 2013లో ఫైలిన్‌, 2014లో హుదూద్‌, ఇప్పుడు మళ్లీ తిత్లీ తుఫాన్లు తీరంపై దాడిచేశాయి. ఇవన్నీ అక్టోబర్‌ నెలలోనే రావడం గమనించదగ్గ విషయం. తిత్లీ తుపాను గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసింది. కానీ ఆఅంచనాలను తారు మారుచేస్తూ శ్రీకాకుళం జిల్లా శివారులో తిత్లీ పెను తుపానుగా మారి విరుకుచుకుపడింది. తెలంగాణలో కూడా విద్యుత్‌ రంగానికి భారీ నష్టమే చేకూర్చింది. బంగాళాఖాతం లోనే ఈ తుపానుల సంఖ్య ఏడాదికెడాదికి పెరిగిపోవడానికి కారణాలను ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. బంగాళా ఖాతంలో నాలుగు తుపానులు వస్తే అరేబియా సముద్రంలో ఒకటి వస్తున్నది. 1892 నుంచి నిన్న తిత్లీ తుపాను వరకు లెక్క చూసినా ఏకంగా నాలుగు రెట్లు అధికంగా బంగాళాఖాతంలో తుపానులు పుట్టుకొస్తున్నాయి. ఈ తుపానులో కొన్ని పెనుతుపానులుగా మారి ధనధన్యా దులతో తులతూగే పల్లెసీమలను మరుభూములుగా మార్చు తున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన తుపానులను పరిశీలిస్తే అన్నిటికంటే ఎక్కువగా నెల్లూరు జిల్లాలోనే తుపానులు తీరాన్ని దాటగా ఆ తర్వాత స్థానంలో కృష్ణా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి వరుసక్రమంలో ఉన్నాయి. అన్నిటికంటే మించి 1977 నవంబరు 19న సంభవించిన తుపాను ధాన్యాగారమైన దివిసీమను దిక్కులేని శవాల సీమగా మార్చివేసింది. వేలాది మందిప్రాణాలు నీటిలో కలిసిపో యాయి. అప్పటి ఆ బీభత్సాన్ని నేటికీ మరిచిపోలేక పోతున్నారు. రికార్డు స్థాయిలో గంటకు రెండువందల అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు కానీ, ఆతర్వాత కానీ రాలేదని చెప్పొచ్చు. గాలివేగాన్ని బట్టి తీవ్రతను అంచనా వేస్తారు. అంతేకాదు వాయుగుండం, తుపాను, పెను తుపానులాంటి వి కూడా నిర్ధారించేది గాలివేగాన్ని బట్టే. వాతావరణంలో సంభవించే అనూహ్య పరిణామాలు ఎలాంటి రూపం సంతరించుకుంటాయి? ఎలా నియంత్రిం చాలనే తదితర అంశాలకు సంబంధించి నేటికీ ముందుగా చెప్పలేని పరిస్థితి. తుపానుల బీభత్సాల నుండి కోస్తాతీర ప్రాంత ప్రజలను, వారి ఆస్తులను కాపాడటం సాధ్యం కాదేమోననిపిస్తున్నది.

ముఖ్యంగా ఏళ్లతరబడి పెంచుకున్న మామిడి, కొబ్బరి, బత్తాయి తోటల్లోని చెట్లు ఒక్కసారి కూకటివేళ్లతో కూలిపోతే ఆ రైతులుపడే ఆవేదన, ఆందోళన మాటలకు అందదు. నిన్న తిత్లీ తుపాను కూడా అంతటి బీభత్సం సృష్టించక పోయినా భారీ నష్టాన్నే కలిగించింది. ఇలాంటి ఉపద్ర వాలు వచ్చినప్పుడు అంతోఇంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నది. బాధితులు తలదాచుకునేందుకు షెల్టర్లను ఏర్పాటు చేయడం, తాత్కాలిక సహాయం అంది స్తున్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అవసరమైన రీతిలో బాధితులకు ముఖ్యంగా రైతులకు ఏమాత్రం చేయూతనివ్వడం లేదు. ఇలాంటివి జరిగినప్పుడు నష్టం అంచనాలకు అధికారుల బృందాన్నిపంపడం, పంపి చేతులుదులుపు కుంటున్నది. కానీ ఈ బృందాల సర్వేలపై, సహాయంపై ప్రజల్లో రానురాను నమ్మకాలు సన్నగిల్లుతు న్నాయి. చూసిపోవడమే తప్ప చేసేది ఏమీ లేదనేది ప్రజల ప్రగా ఢనమ్మకం. వారి నివేదికల ఆధారంగానైనా మిగిలి స్తున్నారంటే అదీ లేదు. ఇచ్చే కొద్దిపాటి నిధులు ఏమవ్ఞతు న్నాయో? ఎవరిని ఆదుకునేందుకు ఖర్చుపెడుతున్నారో అర్థం కాదు. ఇలాంటిఆపదలో ఉన్నప్పుడుకేంద్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ఆలోచించి ఆపన్నహస్తం అందించాలి. గత రెండు దశాబ్దాలుగా తుపానుల వల్ల తీవ్రప్రాంతానికి జరిగిన నష్టం రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సహాయం, కేంద్రం అందించింది చూస్తే ఇరవైవంతు కూడా ఇవ్వలేదు.

ఇక ఈ తుపానుల భారీ నుండి తీర ప్రాంతాలను రక్షించేందుకు చట్టాలు కూడా చేశారు.దేశవ్యా ప్తంగా తీరప్రాంత పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 అనుగుణంగా తీర ప్రాంత నియంత్రణ నిబంధనల పేరిట కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సిఆర్‌జెడ్‌) నోటిఫికేషన్‌ను 1991లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం అమలులోకి వచ్చి దాదాపు మూడు దశాబ్దాలు కావస్తున్నా నేటికీ తీరపరిరక్షణ కోసం సమగ్ర యాజమాన్య ప్రణాళిక లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో రూపొం దించలేకపోయాయి. భారతదేశ వ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లోని 84 జిల్లాలు అండమాన్‌ లక్ష్యదీప్‌ కేంద్రపాలిత రాష్ట్రాల్లో 7500 కిలోమీటర్లు సముద్ర తీరప్రాంతం విస్తరించి ఉంది. వీటిలో గుజరాత్‌ పన్నెండువందల పధ్నాలుగు కిలోమీటర్ల పొడవ్ఞతో మొదటిస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 974 కిలోమీటర్లతో రెండోస్థానంలో ఉంది. మొత్తం మీద ప్రకృతి విపత్తులకు భారత్‌ అంతులేని మూల్యాన్ని చెల్లిస్తుందనే చెప్పాలి. గత రెండు దశాబ్దాలుగా కేవలం విపత్తుల కారణంగా ఆరులక్షల కోట్ల రూపాయల మేరకు నష్టపోయింది. ఏదిఏమైనా తుపాను ఉధృతిని, కదలికను ముందుగానే గమనించి నియంత్రించే మరింత శాస్త్రపరిజ్ఞానం లభించేంతవరకు ఈ కష్టాలు, నష్టాలు తప్పవేమో.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌