వృద్ధిబాటలో వెనుకబాటు!

Economy DownFall
Economy DownFall

భారత్‌ శరవేగంగా అభివృద్ధిచెందుతున్న దేశమని, వచ్చే ఐదేళ్లలో ఐదులక్షలకోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థకు చేరుస్తామని పాలకులు ఓపక్క గొప్పగా చెపుతున్న మాటలకు చేతలకు పొంతనలేదని అంతర్జాతీయ ఆర్థికసంస్థలు చేస్తున్న విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఈ మధ్యకాలంలోనే విడుదల చేసిన ఆర్థిక వర్గీకరణ నివేదికలో మన ఆర్థికపరిస్థితి ఎంతమాత్రం వృద్ధికారకంగా లేదు. ఇప్పటికీ భారత్‌ దిగువ, మధ్య ఆదాయ దేశంగా కొనసాగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది. ఈ స్థాయిలో పొరుగుననే ఉన్న శ్రీలంక కంటే తక్కువస్థాయి ర్యాంకులో ఉంది. శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశాలున్న జాబితాలో చేరింది.

భారత్‌ పదేళ్లక్రితం అత్యంత తక్కువ ఆదాయవనరులున్న దేశాల జాబితా నుంచి కొంతమెరుగుపడి మధ్యస్థాయి ఆదాయవనరుల దేశాలున్న కేటగిరిలోనికి చేరింది. పదేళ్లు గడచిపోయినా ఇప్పటికీ అదే కేటగిరి జాబితాలో కొనసాగుతున్నట్లు ఈనెల్లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో వాస్తవాలు వెలుగుచూసాయి. తలసరి ఆదాయం వెయ్యిడాలర్లకు మించకుండా ఉంటే దిగువ కేటగిరి దేశంగా పరిగణిస్తారు. 2.73 లక్షల వార్షిక ఆదాయం సగటు ఉంటే దిగువ మధ్యతరగతి కేటగిరిగాను, 8.45లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉంటే ఎగువమధ్యకేటగిరి దేశంగాను, ఎగువకేటగిరికి 8.46 లక్షలకంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలుగా ప్రపంచబ్యాంకు వర్గీకరణచేస్తున్నది. ఈదేశాల జాబితాలో భారత్‌స్థితిగతులు ఆర్థికరంగపరంగా ఎంతమాత్రం మెరుగుపడలేదని విశ్లేషించడం మన ఆర్థికవేత్తలు గమనించాల్సిన అంశం. ప్రపంచ బ్యాంకు నివేదికలో విస్తుపోయే నిజాలు కూడా వెలుగుచూసాయి.

మొత్తం 193 ప్రపంచ దేశాల్లో 80కిపైగా దేశాలు ఎగువ ఆదాయ కేటగిరిలోనే ఉన్నాయి. 31దేశాలు దిగువ ఆదాయ కేటగిరిలో ఉన్నాయి. శ్రీలంకతోపాటు మరికొన్ని దేశాలు ఎగువ తరగతి కేటగిరిలోనికి వెళితే అర్జంటైనా దేశం ఒక్కటే ఎగువస్థాయినుంచి కిందికి దిగజారింది. ఇప్పుడు భారత్‌ పరిస్థితిలో కూడా ఎంతమాత్రం మార్పు లేదని ఈ ప్రపంచబ్యాంకు వర్గీకరణ తేటతెల్లంచేస్తోంది. ఓపక్క భారత్‌లో 27.1 కోట్లమంది నిరుపేదలకు దారిద్య్రం నుంచి విముక్తి కల్పించినట్లు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి విభాగం అంచనావేస్తే తలసరి ఆదాయ వివరాలతో చూస్తే భారత్‌ మరింతగా వెనుకబాటుతో ఉందన్న వాస్తవాలను అంగీకరించాలి.

మొత్తం 101 దేశాల పేదరిక సూచీలను చూస్తే భారత్‌లో పేదరికాన్ని గడచిన దశాబ్దకాలంలోనే గణనీయంగా తగ్గించగలిగామని చెపుతున్నది. పేదరికం అంటేకేవలం ఆదాయవనరులు ఒక్కటే కాదని, ఆరోగ్యం, పక్కాఇల్లు, వంటగ్యాస్‌ వినియోగం, విద్యుత్‌ వంటి వాటినికూడా ప్రామాణికాలుగా తీసుకుంటామని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి నివేదికను, ప్రపంచ బ్యాంకు నివేదికతో బేరీజువేస్తే దారిద్య్ర నిర్మూలన దిశగా భారత్‌ మరింతగా మెరుగుపడాలన్న వాస్తవాలను తేటతెల్లంచేస్తోంది. 200కోట్ల జనాభా ఉన్న పదిదేశాలు పేదరిక నిర్మూల నలో గణనీయమైన కృషిచేసాయని చెప్పిన సమితి నివేదికను బట్టిచూస్తే దశలవారీగా పేదరికం నుంచి విముక్తి కలుగుతున్నదన్న భావన ధృఢపడింది. భారత్‌తోపాటు ఇథియోపియా, పెరూదేశాలు కూడా పేదరికం తగ్గించేందుకు విశేషకృషిచేసాయని ప్రశంసలు కురిపించింది.

మొత్తం వీటిలో 31 అల్పాదాయ దేశాలు, 68 మధ్యస్థాయి ఆదాయవనరులున్న దేశాలను సర్వేచేసింది. మొత్తం 130 కోట్లమంది ఈ దేశాల్లో బహుముఖంగా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన కూడా ఒకటి. సమితి బహుముఖ పేదరిక సూచీలో చూస్తే పదిదేశాలు విశేష కృషిచేసాయనే చెపుతున్నారు. అయినా భారత్‌లో వలసలు తగ్గడంలేదు. ఉపాధికోసం ఇతరప్రాంతాలకు తరలిపోతున్న కార్మికులను చూస్తూనే ఉన్నాం. రెక్కాడితేకానీ డొక్కాడని నిరుపేదలు దేశంలో ఇంకా వలసజీవులుగానే మారుతున్నారు. ఇదే తరుణంలో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన కేటగిరి సూచినిచూస్తే అభివృద్ధిలో భారత్‌ మరింతగా మెరుగుపడాల్సి ఉందన్న అంశాన్ని నొక్కి వక్కాణిస్తోంది.

పొరుగుననే ఉన్న శ్రీలంక దేశం కంటే వెనుకబడి ఉన్నామంటే స్థిరమైన ఆదాయవనరుల కల్పనలో భారత్‌ మరింతగా కృషిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం అవుతున్నది. పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామికాభివృద్ధి, ఉత్పత్తిరంగం బహుముఖ వృద్ధిపైనే సూచించడతోపాటు మన పాలకులు వ్యవసాయరంగంపై కూడా మరింత శ్రద్ధను పెంచాలి. క్షేత్రస్థాయిలోనే పేదరికం స్థాయి ఉన్నదంటే వారి తలసరి ఆదాయం మెరుగుపడాల్సిందేనని తేటతెల్లం చేస్తోంది.

ప్రస్తుతం 5.8శాతం ఆర్థికవృద్ధితో ఉన్న భారత్‌ను ఏడుశాతం ఆర్థికవృద్ధికి చేరుస్తామని ధీమా వ్యక్తంచేస్తున్న మన పాలకులు ఈ అంతర్జాతీయ సంస్థల నివేదికలను కూడా పరిగణనలోనికి తీసుకుని సంస్కరణలు, కార్యాచరణతో ఆర్థికవృద్ధిని సాధిస్తే తప్ప భారత్‌ ఎగువ ఆదాయకేటగిరిలోనికి చేరడం కష్టం అన్నది పాలకులు గుర్తెరగాలి. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ వేగవంతం చేయాలి. ఆర్థికపరిపుష్టి మరింతగా పెంచుకోవాలి. ఆ దిశగా ముందుకు సాగితే రానున్న ఐదేళ్లలో భారత్‌ ఐదులక్షలకోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థ ఉన్న దేశంగా మార్పు చెందగలదని కొంతైనా విశ్వసించవచ్చు.

  • దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌,హైదరాబాద్‌