కల్తీ నిరోధానికి చర్యలేవీ?

Duplicate Oil tiins
Duplicate Oil tiins

కల్తీ నిరోధానికి చర్యలేవీ?

అదుపు ఆజ్ఞాలేకుండా పెరిగిపోతున్న కల్తీని అదుపు చేయడంలో కేంద్ర,రాష్ట్ర పాలకులు విఫలమవ్ఞతున్నారు. కల్తీదారుల ను, కల్తీ వ్యాపారులను ఉక్కుపాదంతో అణచివేస్తాం, పీడీ చట్టాన్ని అమలు చేస్తాం అంటూ పాలకులు చేస్తున్న ప్రకటనలు గాలిమాటలుగానే మిగిలిపోతున్నాయి. ఈ కల్తీ రానురాను శృతిమించి ప్రజారోగ్యంపై దాడి చేస్తూ చివరకు మనిషి మనుగడకే ప్రమాదకరంగా సంభవించే పరిస్థితులు ఇంకెంతో దూరంలో లేవని అనిపిస్తున్నాయి. వాయు, నీటి లాంటి కాలుష్యాలకంటే కల్తీ అత్యంత ప్రమాదకరంగా మారుతున్నా నివారించేందుకు త్రికరణ శుద్ధిగా ప్రయత్నాలు జరగడం లేదు.అందుకే అన్ని చోట్ల అన్ని వస్తువ్ఞల్లో పొగమంచులా ఈ కల్తీ విస్తరించిపోతున్నది.

ఉప్పు,పప్పు, నూనె లాంటి నిత్యావసర వస్తువ్ఞ లతోపాటు చిన్న పిల్లల నుండి ఎనభై ఏళ్ల ముదుసలి వరకు తాగే పాలల్లో కల్తీ అదుపు తప్పిపోతున్నది. ముఖ్యంగా మామూలు మందులు సరే,చివరకు ప్రాణాపా యం నుంచి కాపాడే మందుల్లో కూడా ఈ కల్తీ పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అసలు కల్తీ భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తుల నుంచే మొదలవ్ఞతుందని చెప్పొచ్చు. పంటలకు వాడుతున్న ఎరువ్ఞలు, క్రిమిసంహారక మందుల్లోనే కల్తీ ఆరంభమై వాటి అవశేషాలు, ఆహారధాన్యాల్లోనూ, పండ్లు, కూరగాయల్లోనూ మిగిలి ఉంటున్నాయి. అవి ఆహారంగా తీసుకోవడం ద్వారా మానవ దేహాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంటల కోతలకు ముందు ఆ తర్వావ నిల్వలు చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడుతున్నారు. కాయలను పండ్లుగా మార్చేందుకు రసాయనాలు వాడటం వల్ల అవి తిన్నవారికి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. మనదేశంలో ఉత్పత్తి అవ్ఞతున్న పండ్లేకాదు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పండ్లను నిల్వ చేసేందుకు రకరకాల రంగులు, రసాయనాలు వాడటంతో అవి విషతుల్యంగా మారుతున్నాయి.

ఇక సామాన్యుడు సైతం నిత్యం వాడే ఆకుకూరలు, వంగ,బెండ,టామోటా లాంటి కూరగాయాల్లో క్రిమిసంహారక మందుల అవశేషాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి చేరి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నట్లు వైద్యనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల మానవ శరీరంలో గ్రంధులు దెబ్బతిని కేన్సర్‌ లాంటి వ్యాధులు వ్యాపిస్తున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడైంది. ఇక హోటళ్లలో తయారవ్ఞతున్న తినుబండారాల విషయంలో కూడా అధికారికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వాడిన నూనెనే మళ్లీమళ్లీ వాడుతుండటం, అది కల్తీకావడం, నూనెల్లో కూడా పశువ్ఞల కొవ్ఞ్వతో తయారు చేసిన నూనెలు వాడుతుండటం వల్ల మానవ శరీరంలో పేరుకుపోయి రకరకాల వ్యాధులకు కారణమవ్ఞతున్నాయి. అయితే కొన్ని హోటళ్ల యాజమాన్యాలు వాడుతున్న నిత్యావసర వస్తువ్ఞలు కానీ, ఆ తర్వాత కనబడేందుకు వేస్తున్న రసాయనికాలతో కూడిన రంగులు కూడా ప్రజారోగ్యానికి హానికలిగిస్తున్నాయి.

వీటిని నియంత్రించేందుకు అధికారులున్నా చట్టాలున్నా మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారు తప్ప నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. అక్కడక్కడ ఫిర్యాదులు ఇచ్చిన సందర్భాల్లో నామమాత్రపు కేసులతో చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ కల్తీదారులను జైళ్లకు పంపించినా, జరిమానా కట్టించినా శిక్ష అనుభవించి తిరిగి వచ్చి యధాప్రకారం అదే కల్తీ వ్యాపారంలో నిమగ్నమైపోతున్నారు. భారత్‌లో లభిస్తున్న ఆహార పదార్థాలలో నలభై శాతంపైగా కల్తీవేనని అనధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆహార నాణ్యతను సంరక్షించే వసతులు లేకపోవడం ఈ కల్తీని ఖచ్చితంగా గుర్తించలేకపోతున్నారు. అసలు తాము వాడే ఈ రసాయనాలు,క్రిమిసంహారక మందుల వల్ల వారి ఆరోగ్యమేకాదు, వినియోగదారులు అనారోగ్యానికి గురవ్ఞతున్నారనే విషయం గ్రామాల్లో ఉన్న రైతులకు అంతగా అవగాహన ఉండటం లేదు. ఇక ఉత్పత్తి అయి వ్యాపారుల దగ్గరికి చేరిన తర్వాతనే కల్తీ మరీ అదుపు తప్పిపోతున్నది. ఆకర్షణీయంగా ఉండేవిధంగా తయారు చేసేందుకు రంగులు కలుపుతున్నారు. యూరియాతో పాలను తయారు చేస్తున్నారు. రంపపు పొట్టు, ఇనుప రజను టీలోవాడే పొడిలో కలుపుతున్నారు.

ఇక రకరకాల స్వీట్స్‌లో జరుగుతున్న కల్తీ అంతా ఇంతా కాదు. కారంలో రోడామైన్‌ కల్చర్‌ లేక ఇటుకల పొడినో కలపడం వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆపిల్‌ లాంటి పండ్లకు మంచి రంగువన్నె తీసుకురావడానికి మైనంపూత పూయడం ద్వారా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని చెప్పొచ్చు. ఇలా అదీ ఇదీ అని కాదు. దాదాపు అన్నీ ఆహారపదార్థాలలో కల్తీ అంతకంతకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశం.

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న కల్తీని అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆదేశించింది. అందుకు అనుగుణంగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఒక ముసాయిదాను కూడా రూపొందించింది. సింగపూర్‌లో అమలవ్ఞతున్నటువంటి చట్టాన్ని తీసుకువస్తే కానీ పరిస్థితుల్లో కొంత మేరకైనా అదుపురాదని అభిప్రాయాలు వ్యక్తమవ్ఞతున్నాయి.కేంద్ర పాలకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకొని మీనమేషాలు లెక్కపెట్టకుండా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనాఉంది. చట్టాన్ని తీసుకువచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా అది అమలుకు సమర్థులైన, నిజాయితీపరులైన అధికారులను నియమించినప్పుడే ప్రయోజనం ఉంటుంది.

– దామెర్ల సాయిబాబ,ఎడిటర్‌,హైదరాబాద్‌