మత్తుముఠాలపై పోరేది?

Drugs Mafia
Drugs Mafia

మాదకద్రవ్యాల వ్యసనం వినాశానికి దారి తీస్తుందని, దాన్ని సమిష్టిగా నిర్మూలిం చాల్సిన అవసరం ఉందని దశాబ్దాలకాలంలో పాలకులు పదేపదే చెప్తున్నా అంతకు రెట్టింపుస్థాయి లో ఏడాదికెడాదికి విస్తరించిపోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవ్ఞతున్నది. ముఖ్యంగా ఈ వ్యసనం ఇటీవల పదిహేను,పదహారేళ్ల వయస్సున్న పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నది.మరోవైపు నేరాల సంఖ్య అదుపు లేకుండా పెరిగిపోతున్నది.

మాదకద్రవ్యాల మత్తులో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితుల్లో చేయరాని, చేయకూడని పనులకు పాల్పడుతూ అవి కప్పిపుచ్చుకునేందుకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. జాతిని కేన్సర్‌ మహమ్మారిలా పట్టిపీడిస్తున్న ఈ మాదకభూతాన్ని కట్టడి చేయడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని ఎన్నో సార్లు దేశ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఉగ్రవాదం కంటే ఇది మరింత ప్రమాదకరంగా తయారవ్ఞతున్నదనే ఆవేదనలు వ్యక్తమవ్ఞతున్నాయి.ఉగ్రవాదం వల్ల మరణి స్తున్న వారికంటే ప్రపంచంలో మత్తుమందువల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు అనేక నివేది కలు వెల్లడిస్తున్నాయి.గ్లోబల్‌ పీస్‌ సూచిప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం కారణంగా 2016లో 29వేల376 మంది మరణిస్తే మత్తుమందు వాడకం వల్ల దాదాపు లక్షాతొంభైవేల మంది అసువ్ఞలుబాసారు.

మెక్సికోలో ఆ సంవత్సరంలో మత్తుమందుల వ్యాపారుల మధ్య జరిగిన ఘర్షణలో 23వేల మందికిపైగా మరణించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పదిహేను నుంచి అరవైసంవత్సరాల వయస్సున్నవారిలో దాదాపు ఐదుశాతం అంటే సుమారు 25కోట్ల మంది ఇప్పటికే ఈ మత్తుకు అలవాటు పడ్డట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీరిలో దాదాపు రెండుకోట్ల డెబ్భైలక్షల మంది ఏదో ఒక రకమైన వ్యాధులతో బాధ పడుతున్నారు. అన్నింటికంటే ఆందోళనకరంగా ఇంజెక్షన్ల ద్వారా మత్తుమందులు వాడకం వల్ల లక్షలాది మందికి ఎయిడ్స్‌వ్యాధి సోకుతున్నది.

పాలకులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ వ్యాపారస్తులను వలపన్ని పట్టి న్యాయస్థానాల ముందు నిలబెట్టి జైళ్లకు పంపుతున్నా వారు శిక్ష అనుభవించి తిరిగి వచ్చి అదే వ్యాపారం చేస్తున్నారు. కేసులు, చట్టాలు వారిని ఆ వక్రమార్గం నుంచి మార్చలేకపోతున్నాయి. అత్యంత లాభదాయకం కావడం వల్లనే ఇక్కడా అక్కడా అనికాదు. ప్రపంచ వ్యాప్తంగా పెద్దపెద్ద నేరముఠాలు మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణాను వ్యాపారంగా మలుచుకుంటున్నాయి.

ప్రపంచ మాదకద్రవ్యాల వ్యాపారం విలువ దాదాపు 70వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తు న్నారు. ఇది ఏడాదికెడాదికి పెరిగిపోతున్నది. మత్తుముఠా లు పెద్దఎత్తున నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని మారుమూల ప్రాంతాలకు రవాణా చేయగలిగే రకరకాల మార్గాలను నిర్మించుకుంటున్నాయి. లాటిన్‌ అమెరికాలో తయారవ్ఞ తున్న మత్తుమందులు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలకు విస్తరిస్తున్నాయి. సెల్‌ఫోన్‌ కూడా ఈ వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. దీనికితోడు ఆర్థిక సంస్థలతో సంబంధం లేకుండా సరాసరి ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదలీ చేయగలిగే ‘క్రిఫ్టో కరెన్సీవాడకం సైతం యధేచ్ఛగా ఉపయోగించుకుంటు న్నారు.

గతంలో మత్తుమందులు కొనుగోలు చేయాలంటే తెలిసిన వాడకందారులు సంబంధిత వ్యాపారులను సంప్రదించి మత్తుమందు తీసుకొని నేరుగా డబ్బులు చెల్లించేవారు. ఈ రెండు చేతులు ఎంతో రహస్యంగా ఉండేవి. ఈ వ్యాపారుల మధ్య అంతర్జాతీయ చెల్లింపులు బ్యాంకుల ద్వారా జరిగేవి. నిఘా వర్గాలు మత్తుమందుల రవాణా, చెల్లింపులపై పటిష్టమైన తనిఖీలు ఉండటంతో ఎక్కడో ఒక దగ్గర బయటపడే అవకాశం ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొరియర్‌ ద్వారా అందుకునే ఏర్పాటు చేసుకుంటున్నారు.

రవాణా ఇంత సులభం కావడంవల్లనే వాడకం పెరిగిపోయింది.మాదకద్రవ్యాలకు సంబంధించి ఇటీవల కాలంలో భారత్‌ అగ్రస్థానంలోకి వచ్చిందనే ప్రచారం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా డార్క్‌నెట్‌ ద్వారా జరిగిన మత్తుమందుల కొనుగోళ్లలో ఆసియాఖండంలో 13 శాతం వరకు ఉంది. అందులో మొన్నటివరకు చైనా తర్వాత స్థానం భారత్‌దేననే వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు చైనాను మించిపోయినట్లు అధికారవర్గాలే అంటున్నాయి.

మత్తుమందుల వాడకం భారత్‌లో పంజాబ్‌ మొదటిస్థానంలో ఉందని చెప్పొచ్చు. రాష్ట్రంలో దాదాపు పదివేల కోట్లకుపైగా మత్తుమందులపై ఖర్చుపెడుతున్నట్లు అంచనా. 2012లో దేశంలో ప్రతిలక్ష మందిలో 250 మంది మత్తుమందులు వాడగా పంజాబ్‌ లో అప్పటికే 836మంది వాడినట్లు సర్వేలో బయట పడింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై కూడామత్తుమందు వ్యాపారులు పంజావిసురుతున్నారు. మారుతున్న జీవన విధానం, అధిక మొత్తాల్లో లభించే ఆదాయం యువతను ఆ దిశగా నడిపిస్తున్నది. హైదరాబాద్‌ నగర శివారుల్లోని పారిశ్రామికవాడల దాకా వ్యాపించిన ఈ దుస్సంస్కృతి జాతిభవితను ప్రశ్నార్థకం చేస్తున్నది.

పట్టణాలు,నగరాల్లో పిల్లలను మాదకద్రవ్యాల మాఫియా ముఠాలు లక్ష్యంగా చేసుకొని వాళ్లను ఒక వ్యూహం ప్రకారం ఈ ఉచ్చులోకి దించుతున్నారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పా టు అయిన జాతీయ సంఘం 2013లోనే వెలువరించిన నివేదిక అంశాలు దిగ్భ్రాంతేకాదు ఆవేదన,ఆందోళన కలిగి స్తున్నాయి. ఇంతప్రమాదకరంగా మారుతున్న ఈ మాదక ద్రవ్యాల విస్తరణను అడ్డుకొనియువతను కాపాడేందుకు ప్రభుత్వపరంగా ఆశించిన మేరకు చర్యలు తీసుకోవడం లేదు.ఈ మాదకద్రవ్యాల సవాల్‌ను సమర్థవంతంగా ఎదు ర్కోవలసిన తరుణమిది. మాటలతో కాకుండా ఆచరణ లోచూపి నిర్మూలించాల్సిన అవసరంఎంతైనా ఉంది.